అసంతృప్తి..ఆగ్రహం


ఒంగోలు : అడుగడుగునా అసహనం..అసంతృప్తి... ప్రభుత్వ శాఖలు, అధికారుల పనితీరుపై ఆగ్రహం... స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో శనివారం రాత్రి నాలుగు ప్రభుత్వ శాఖలపై మంత్రి శిద్దా రాఘవరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరిస్థితి ఇది. జిల్లాలో ప్రభుత్వ పాలనను వేగవంతం చేసేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి శిద్దాకు అధికారులు అడుగడుగునా చుక్కలు చూపించారు. ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పకుండా మంత్రిని తీవ్ర అసహనానికి గురిచేశారు.



సమావేశంలో కేవలం నాలుగు శాఖలపైనే సమీక్షించాలని కలెక్టర్ విజయకుమార్ నిర్ణయించారు. ఆ మేరకు సమావేశం ప్రారంభానికి ముందే దానిపై మంత్రి దృష్టికి తీసుకెళ్లి తదుపరి సమావేశానికి అన్ని శాఖల సమీక్షకు సిద్ధంగా ఉంటామంటూ వివరణ ఇచ్చారు. అయితే, సమీక్ష ప్రారంభించినన అనంతరం ప్రతి శాఖపైనా శాసనసభ్యులు ప్రశ్నించడంతో అధికారులు నీళ్లునమలడానికే పరిమితమయ్యారు. దీంతో పలుమార్లు మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ విజయ్‌కుమార్‌లు జోక్యం చేసుకుని అధికారులను            మందలించారు.

 

సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు..? : ఎమ్మెల్యేలు గొట్టిపాటి, ఆదిమూలపు

ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ లక్ష ఎకరాల ఆయకట్టుకు ఎందుకు నీరివ్వలేకపోతున్నారో చెప్పాలంటూ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. 95 శాతం పూర్తయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి కూడా నీరు విడుదల చేసుకోలేకపోవడానికి గల కారణాలు చెప్పాలంటూ నిలదీశారు. 61 ఎకరాల స్థల సేకరణ సమస్యంటూ చెప్పడంతో 5 సంవత్సరాలుగా అదే సమస్య చెబుతుంటే ఇక ఎలా పూర్తిచేస్తారంటూ మంత్రి శిద్దా జోక్యం చేసుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



కాలువలపై అధికారుల పర్యవేక్షణ లేకుండా ఉంటే చివరి భూములకు నీరెలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అంతేగాకుండా జోన్-1కు నీరు ఎప్పటి వరకు ఇస్తారు, జోన్-2కు ఎప్పటి వరకు ఇస్తారని ప్రశ్నించారు. ఇవ్వలేకపోతే రైతులకు ఎలాంటి పంటలు వేసుకోవాలో సూచనలు చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం ఏంటని నిలదీశారు. రబీ సీజన్ ఆలస్యంగా ప్రారంభమైతే రైతులకు ఎప్పటి వరకు నీరిస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలంటూ గొట్టిపాటి రవికుమార్ పట్టుబట్టారు. దీంతో మంత్రి శిద్దా జోక్యం చేసుకుని ఆదివారం జిల్లా పర్యటనకు భారీ నీటిపారుదల శాఖామంత్రి వస్తున్నందున మాట్లాడి తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 

విచారణకు ఆదేశించాలి : ఎమ్మెల్యే డోలా


సంగమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి దొంగపట్టాలు పుట్టించి నష్టపరిహారం తీసుకున్నారని, దానిపై విచారణకు ఆదేశించాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు.

 

సగిలేరు ఆవశ్యకతను గుర్తించాలి :

ఎమ్మెల్యే ముత్తుముల


గిద్దలూరులో సగిలేరు కాలువ ఆవశ్యకతను గుర్తించాలని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బల్లికురవ, మార్టూరు మండలాల్లో డ్రైనేజీ కాలువల పర్యవేక్షణ ఏ శాఖ చూస్తుందో తెలియదనడంతో అధికారులంతా ఒకరి శాఖపై మరొకరు చెప్పుకున్నారు. దీంతో జిల్లా మొత్తాన్ని చీరాలలో ఉన్న డ్రైనేజీ అధికారుల పర్యవేక్షణకే ఇచ్చేలా ముఖ్యమంత్రితో మాట్లాడతామంటూ మంత్రి శిద్దా సూచించారు.

 

తాగునీటిపై గందరగోళం...

తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆర్‌డబ్ల్యూయస్ ఈఈపై అద్దంకి, గిద్దలూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీపీడబ్ల్యూ స్కీములను తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకున్నారని ఆరోపించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తక్షణమే టెండర్లు పిలుస్తామని చెప్పిన అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేవలం పర్సంటేజీలే అందుకు కారణమంటూ ఆరోపించారు. కొమ్మాలపాడు, మోదేపల్లి వంటి ప్రాంతాల్లో స్కీములు కట్టారని, కానీ గ్రామం పక్కనుంచే నీరు వెళ్తున్నా ట్యాంకులు నింపుకోలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.



ఓవర్‌హెడ్ ట్యాంకులు కట్టినా కనీసం వాటికి కనెక్షన్‌లు ఇప్పించుకోవడంలో కూడా నిర్లక్ష్యం తాండవిస్తుందంటూ మండిపడ్డారు. ఇప్పటికే గిద్దలూరు పట్టణంతోపాటు పలు మండలాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైందని, ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తప్పదంటూ మంత్రికి నివేదించారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకుంటూ ఎన్నికలకు ముందు చాలా పథకాలు వచ్చాయని, అయితే సకాలంలో పూర్తిచేయకపోవడం వల్ల అవన్నీ వృథా అయ్యాయని పేర్కొన్నారు.



మార్కెటింగ్ శాఖాధికారుల పొంతనలేని లెక్కలు...

మార్కెటింగ్ శాఖాధికారులు పొంతనలేని లెక్కలు చెప్పడంతో ఆ శాఖ తీరును కూడా ఎమ్మెల్యేలు ఎండగట్టారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుంటూ సమావేశానికి వచ్చే సమయంలోనే పూర్తి సమాచారంతో రావాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం జేజే-11 శనగల కొనుగోలుపై దృష్టిసారించడంతో బయటి మార్కెట్ కూడా పెరిగిందని శాసనసభ్యులు సూచించారు.



అందువల్ల కాక్-2, బోల్డ్ రకానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొనుగోలుపై దృష్టిసారిస్తే ప్రైవేటు మార్కెట్ కూడా పెరిగి రైతు లాభపడతారంటూ గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ దానిపై కూడా దృష్టిపెడతామని, ప్రైవేటు వ్యాపారులతో కూడా చర్చిస్తున్నామని అన్నారు. అధికారులందరితో తప్పకుండా పనిచేయిస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top