పరిశ్రమల స్థాపనపై ఆసక్తి చూపాలి


ఒంగోలు సబర్బన్: నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమల స్థాపనపై ఆసక్తి చూపాలని కాకినాడ జేఎన్‌టీయూ  వైస్ చాన్సలర్ (వీసీ) తులసీ రాందాస్ పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు ఒంగోలులోని ఎంహెచ్‌ఆర్ ఫంక్షన్ హాలులో కాకినాడ జేఎన్‌టీయూలోని సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో యువ ఇంజినీర్లకు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అవగాహ న కార్యక్రమం నిర్వహిస్తున్నారు.



 అందులో భాగంగా రెండో రోజు మంగళవారం సదస్సుకు వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని అభివర్ణించారు. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం కాకినాడ జేఎన్‌టీయూలో ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్‌మెంట్ సెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీని ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిస్తామన్నారు. మొత్తం ఈ సెల్ పరిధిలో 8 జిల్లాలున్నాయని, ఇప్పటికే మూడు జిల్లాల్లో అవగాహనా సదస్సులు పూర్తి చేశామన్నారు.



 కొత్త రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం  ఉందన్నారు. తద్వారా స్థానిక అవసరాలతోపాటు ఎగుమతులకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలు నెరుపుకోవచ్చన్నారు. సహజ వనరులను వినియోగించుకోవడం, భూగర్భం నుంచి ఖనిజాలను వెలికితీసి వాటి ద్వారా ఉత్పత్తులను పెంపొందించుకోవడం చేయాలన్నారు. ఐటీ పార్కులు, మందుల తయారీ కంపెనీలు, ఓడరేవులు, వంతెనలు, విమానాశ్రయాలుతోపాటు అనేక రకాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నందున వాటికి సంబంధించిన నిపుణులుగా యువ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు ఎదగాలన్నారు.



సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని ప్రతి ఒక్కరూ స్వంత ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చి కొత్త పథకాల ద్వారా నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్విస్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కల్యాణ్ చక్రవర్తి, పేస్ కళాశాల చైర్మన్ అండ్ కరస్పాండెంట్ శ్రీధర్, ఏబీఆర్ చైర్మన్ బసివిరెడ్డి, కృష్ణచైతన్య కళాశాల చైర్మన్ చైతన్యలతోపాటు పలు ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి కాకినాడలోని సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వీసీ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top