‘సేవ్ ఎనర్జీ’కి ‘షార్ట్ సర్క్యూట్’

‘సేవ్ ఎనర్జీ’కి ‘షార్ట్ సర్క్యూట్’


 ‘తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతి’ని నగరానికి ప్రసాదించాలన్న ధ్యేయంతోప్రారంభమైన పథకం రాజమండ్రిలో కొడిగట్టింది. నగర పాలక సంస్థ అధికారుల నిర్వాకమే ఇందుకు కారణమని కాంట్రాక్టు సంస్థ అంటుండగా.. కాంట్రాక్టు సంస్థదే బాధ్యత అని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద  వెలుగుల పథకం..షార్ట్ సర్క్యూట్‌తో మాడిపోయిన విద్యుద్దీపంలా మిగిలింది.

 

 సాక్షి, రాజమండ్రి :‘సేవ్ ఎనర్జీ’ (విద్యుత్‌ను ఆదా చేద్దాం) నినాదంతో దేశంలోనే తొలిసారిగా చారిత్రకనగరం రాజ మండ్రిలో అమలు చేసిన ఎల్‌ఈడీ వీధిలైట్ల పథకంపై చీకటి కమ్ముకుంది. వెలుగులు విరజిమ్మాల్సిన దీపాలు వెలవెలబోతున్నాయి. ఇందుకు నెపాన్ని నగర పాలకసంస్థ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు.  ఈ పథకం కింత హైదరాబాద్‌కు చెందిన హైపీరియన్ గ్రీన్ ఎనర్జీ సంస్థతో 2009 నవంబరులో నగరపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం హైపీరియన్ సొంత ఖర్చుతో ఎల్‌ఈడీ బల్బులు అమర్చి, ఏడేళ్ల పాటు రూ.3.90 వంతున వీధిలైట్ల కరెంటు బిల్లుకు ఏడాదికి రూ.1.91 కోట్లు కార్పొరేషన్ వెచ్చిస్తోంది. నగరంలో మొత్తం 11 వేల లైట్ల మార్పిడి ద్వారా కనీసం 60 శాతం విద్యుత్ ఆదా సాధించాలన్నది ఈ పథకం లక్ష్యం. కాంట్రాక్టు కాలంలో అలా ఆదా అయిన మొత్తాన్ని హైపీరియన్‌కు కొంత శాతాన్ని నగర పాలక సంస్థ ఇవ్వాలి.

 

 ఎవరేం చేయాలి...

 ఎల్‌ఈడీ లైట్ల వల్ల కరెంటు ఆదాను చూపించాల్సిన బాధ్యత హైపీరియన్‌దే. లైటు వరకూ నెట్‌వర్క్ అంటే స్విచ్చులు, వైరింగ్, విద్యుత్తు సరఫరా, మీటర్లు వంటి వాటిని సక్రమంగా ఉంచే బాధ్యత నగరపాలక సంస్థది. ఆదా అయిన విద్యుత్తు విలువలో మొదటి రెండు సంవత్సరాలు 90:10, మూడు, నాలుగు సంవత్సరాల్లో 85:15, ఐదు నుంచి ఏడేళ్ల వరకు 80:20 నిష్పత్తిలో హైపీరియన్, నగరపాలక సంస్థలు పంచుకోవాలి. ఆ సొమ్మునే హైపీరియన్‌కి ఇచ్చే లీజు మొత్తంగా పరిగణిస్తారు.  అయితే 2009 నుంచి 2012 వరకూ ఎన్నిలైట్లు మార్చారు, ఏ ఏడాది ఎంత ఆదా అయింది, ఆ ప్రకారం హైపీరియన్‌కి ఎంత చెల్లించాలనే గణాంకాలను అధికారులు నిక్కచ్చిగా నమోదు చేయలేదని, దీనిపై ఆడిట్ అభ్యంతరాలు కూడా వచ్చాయని తెలుస్తోంది.  

 

 రోజుకు 11 గంటల కాలాన్ని వీధిలైట్లు వెలిగే సమయంగా పరిగణించి వినియోగం, ఆదాపై అంచనాలు వేయాలని, వేసవిలో కరెంటు కోత కాలంలో వినియోగం, ఆదా రెండూ లెక్కించరాదని ఒప్పందం. కానీ కోత సమయాలను పరిగణనలోకి తీసుకోలేదు. లైట్ల చోరీ జరిగినా, ప్రమాదాలు, తుపాన్ల వల్ల లైట్లు పాడైనా నగరపాలక సంస్థ భరించాలి. ఇందుకు మొత్తం లైట్లన్నింటికీ బీమా చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 2013లో జల్ తుపానుతో లైట్లకు వాటిల్లిన నష్టం ఎవరు భరించాలన్న వివాదం నేటికీ తేలలేదు. అధికారుల నిర్లక్ష్యంతో రూ.50 లక్షల మేర నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాగా అధికారులు తాము తప్పించుకునేందుకు బాధ్యత తమదేనంటున్నారని కాంట్రాక్టు సంస్థ చెపుతోంది.

 

 తప్పుడు లెక్కలతో లక్షల బొక్కుడు..

 విద్యుత్తు ఆదా 74 శాతం వరకూ ఉన్నా 60 శాతం మాత్రమే ఉన్నట్టు చూపుతున్నారని, ఈ విధమైన వ్యత్యాసాల ద్వారా నగర పాలక సంస్థ అధికారులు లక్షలు దిగమింగారని ఆరోపణలున్నాయి. ఏడాదికి రూ.26 లక్షల వరకు పక్కదారి పట్టాయంటున్నారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా..‘ఎలాగోలా’ సర్దుబాటు చేసుకున్న అధికారులు.. నగర పాలక సంస్థ చూసుకోవలసిన నెట్ వర్కింగ్ లోపాల నిర్వహణనూ హైపీరియన్ మీదే వేసి, ఆ మేరకు కూడా సొమ్ము చేసుకున్నట్టు చెపుతున్నారు. మొత్తమ్మీద అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు మధ్యన విభేదాలు తలెత్తడంతో ఎల్‌ఈడీ లైట్లు ఆలనాపాలనా ఎరుగని ‘అనాథ’ల్లా మారాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2013 జూన్‌లో నగరపాలక సంస్థ అధికారులు సర్వే చేయించగా 70 శాతం పైగా లైట్లు వెలగడం లేదని తేలింది. ఆ సంస్థ నుంచి కమిషన్లు దండుకున్నట్టు ఆరోపణలున్న అధికారులు వాటి నుంచి గట్టెక్కేందుకు ఇదే అదనుగా లైట్ల అధ్వానస్థితికి  పూర్తి బాధ్యతను కాంట్రాక్టు సంస్థపై నెట్టేస్తూ లేఖలు, నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టుకెక్కింది.  

 

 మాకు తీవ్రనష్టం తెచ్చారు..

 కార్పొరేషన్ చేయాల్సిన వైరింగ్ వంటి పనులను కూడా మా చేతే చేయించారు. మాకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టి, ఇప్పుడు తప్పంతా మాదేనంటున్నారు. ఎల్‌ఈడీ లైట్లతో ఆశించిన 60 శాతం కన్నా ఎక్కువగా 74 శాతం ఆదా అయినా తగ్గించి చూపేందుకు యత్నించారు. ఇప్పుడు అసలు ఆదాయే కావడం లేదని నెపం మాపై వేస్తున్నారు. వెలిగే లైట్ల వద్దే ఎక్కువ కరెంటు ఖర్చయ్యే లైట్లు బిగిస్తున్నారు. ఎల్‌ఈడీ లైట్ల వరకే మా బాధ్యత. నెట్ వర్కింగ్‌ను మున్సిపల్ సిబ్బంది చేయడం లేదు.

 

 - డాక్టర్ కె.విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, హైపీరియన్

 మరమ్మతుల్ని కార్పొరేషన్ చేయించింది..

 లైట్ల నిర్వహణ బాధ్యత అంతా కాంట్రాక్టు సంస్థదే. ఇదే విషయాన్ని సూచిస్తూ గతంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సలహా మేరకు కంపెనీకి లేఖలు రాశాం. హైపీరియన్ సంస్థ మరమ్మతులు చేయకపోతే వాటిని కార్పొరేషన్ ద్వారా చేయించి ఆ ఖర్చును కంపెనీకి ఇచ్చే నిర్వహణా వ్యయం నుంచి మినహాయించాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

 - రవీంద్రబాబు, కమిషనర్, రాజమండ్రి నగర పాలక సంస్థ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top