టీటీడీ ఉద్యోగులకు షాక్


22,600 మంది సిబ్బంది బ్రహ్మోత్సవ బహుమానంలో కోత

పాలక మండలి ప్రతిపాదనలను తిరస్కరిస్తూ జీవో నెం.123 జారీ

 


తిరుపతి అర్బన్:  ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు టీటీడీ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానంలో రాష్ట్ర ప్రభుత్వం కోత విధించింది. బోర్డు తీర్మానించి పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంతో బోర్డు సభ్యులకు   కూడా భంగపాటు ఎదురైంది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యుడిగా కేంద్రంలోని బీజేపీకి చెందిన రాష్ట్రనేత భానుప్రకాష్‌రెడ్డి వున్నప్పటికీ వేలాది మంది ఉద్యోగుల కోసం ప్రతిపాదించిన బహుమానంలో ప్రభుత్వం కోత విధిస్తూజీవో నెం.123ను రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్‌వీ ప్రసాద్ బుధవారం మధ్యాహ్నం జారీచేశారు. దీంతో టీటీడీలోని 22,600 మంది ఉద్యోగులకు అందజేస్తున్న బ్రహ్మోత్సవ బహుమానంలో కోతపడింది. దీనిని వ్యతిరేకిస్తూ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు బుధవారం సాయంత్రం అత్యవసర ఐక్య కార్యాచరణ సమావేశాన్ని నిర్వహిం చారు. ప్రతిసారి తాను జిల్లా వాసినేనంటూ ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక వెసులుబాటుపై దెబ్బకొట్టడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై ఇప్పటికే టీటీడీ చైర్మన్‌తో ఫోన్‌లో సంప్రదించిన పలు ఉద్యోగ సంఘనాయకులకు సానుకూల స్పందన రాలేదని విశ్వసనీయ సమాచారం.



 టీటీడీ ఉద్యోగులకు బోనస్ బదులుగా బ్రహ్మోత్సవ బహుమానాన్ని 1990 నుంచి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటా పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల విభాగాలకు విడివిడిగా బహుమానం అందజేస్తున్నారు. అందుకోసం ఏటా టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానించి ప్రభుత్వ అనుమతితో ఉద్యోగులందరికీ బ్రహ్మోత్సవ బహుమానా న్ని ఖాతాల్లో జమచేసేవారు. ఇదేక్రమంలో 2014లో పర్మినెంట్ ఉద్యోగులకు రూ.11 వేలు, కాంట్రాక్టు / ఔట్‌సోర్సింగ్/ ఎన్‌ఎం ఆర్ ఉద్యోగులకు రూ.5,500లు బహుమానం గా ఇచ్చేవారు. అనంతరం టీటీడీలోని అన్ని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట సమితి నేతృత్వంలో ఉద్యమం నిర్వహించి బహుమానాన్ని పెంచుకున్నారు. అందులో భాగంగా 2015లో పర్మినెంట్ ఉద్యోగులకు రూ.12,200, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,100 బహుమానం పెంచుతూ టీటీడీ బోర్డులో తీర్మానించి ప్రభుత్వానికి నివేదిం చారు. అందుకు సంబంధించి డిసెంబర్ 7వతేది జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని అదే నెల 14వతేది ఈవో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వం నుంచి  ఉత్తర్వులు అందినప్పటికీ టీటీడీ బోర్డు తీర్మానానికి వ్యతిరేకంగా బహుమానంలో కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమేరకు రెగ్యులర్ ఉద్యోగులకు 10 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 వేలు మాత్రమే చెల్లించడానికి అనుమతి ఇచ్చింది.

 

ఆర్థికభారమనే సాకుతో..

 టీటీడీ ఉద్యోగులకు అందజేస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని ఏటా పెంచుకుంటూ పోవడం వల్ల టీటీడీకి తీవ్ర ఆర్థికభారం కలుగుతోందనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం జీవోను జారీచేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రధానంగా సూచించింది. 2014లో ఇచ్చిన బహుమానం మేరకు పర్మినెంట్ ఉద్యోగులు 9,600 మందికి రూ.10.56 కోట్లుగా ఉన్న బహుమానం 2015లో పెంచడంతో రూ.11.71 కోట్లకు చేరింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులు 13వేల మందికి  2014లో రూ.7.15 కోట్లుగా వుండగా, 2015లో పెంచిన మేరకు రూ.7.93 కోట్లకు చేరింది. వీటన్నింటినీ లెక్కించి సుమారు రూ.కోటి 93 లక్షలు అదనపు భారం టీటీడీపై పడుతోందని..  అందుకే బోర్డు ప్రతిపాదనలను తిరస్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top