ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి - Sakshi


అవనిగడ్డ సాక్షిగా... మాటతప్పిన బాబు

 

ఎస్‌జీటీ పోస్టుల్లో బీఈడీలకు నో చాన్స్  లబోదిబోమంటున్న అభ్యర్థులు

 

‘ఎస్‌జీటీ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తాం..’

ఈ ఏడాది మేలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవనిగడ్డ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మండలి బుద్ధప్రసాద్ తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక రాజీవ్‌చౌక్‌లో జరిగిన బహిరంగసభలో నాటి టీడీపీ అభ్యర్థి, నేటీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు ఈ ప్రకటన చేశారు. మరి ఇప్పుడేం చేశారంటే..

 

అవనిగడ్డ : ఎస్‌జీటీ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తామని అవనిగడ్డ సాక్షిగా ప్రకటించిన చంద్రబాబు నేడు మాట తప్పారు. తాజాగా టెట్, డీఎస్సీ స్థానంలో టెట్ కమ్ టీఆర్‌టీగా పేరు మార్చి విడుదల చేసిన జీవోలో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీలకు అవకాశం కల్పించకుండానే ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాడు చంద్రబాబు చేసిన ప్రకటనను నమ్మి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణ పొందుతున్న వేలాదిమంది అభ్యర్థులు ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారు.

 

ఊరించి.. ఉసూరుమనిపించారు...




రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం డీఎస్సీ నోటీఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. బాలారిష్టాలు తొలగి ఎట్టకేలకు వెలువడిన డీఎస్సీ నోటీఫికేషన్ బీఈడీ విద్యార్థులు, అభ్యర్థులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులు రాయడానికి అవకాశం కల్పించకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కూలీనాలి చేసుకుని బతికే బడుగు జీవులు సైతం వేలాది రూపాయలు వ్యయంచేసి తమ బిడ్డలను ఇక్కడకు శిక్షణకు పంపారు. గత ఆరు నెలలుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతమైంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎస్‌జీటీ చేసిన వారిని, ఆరు నుంచి పదో తరగతి బోధించే ఉపాధ్యాయులుగా బీఈడీ అభ్యర్థులను ఎంపిక చేస్తే ప్రతి జిల్లాలోనూ స్కూలు అసిస్టెంట్ పోస్టులు పెరిగేవన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తే.. ఇప్పుడు అందులో తమ జిల్లాలో తమ సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు చూపకపోవడంతో మనోవేదనతో తల్లడిల్లిపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తామేం చేయాలో పాలుపోవడం లేదని పలువురు అభ్యర్థులు కన్నీరు పెట్టుకున్నారు. కొందరి ఆవేదన ఇలా ఉంటే మరికొందరి ఆవేదన మరోలా ఉంది. డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి జూలై ఒకటి నాటికి 40 సంవత్సరాలు నిండకూడదని గడువు విధించటం కూడా కొందరిపాలిట అశనిపాతమైంది. కనీసం జూన్ నెలను ప్రాతిపదికగా చేసుకుని ఉంటే మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించేవన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

 

 

నిరాశే మిగిలింది...



ఐదు నెలలుగా ఇక్కడ మ్యాథ్స్ బీఈడీ అసిస్టెంట్‌కు శిక్షణ పొందుతున్నాను. డీఎస్సీ నోటిఫికేషన్‌లో మా జిల్లాలో ఖాళీలు చూపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయినవారందరికీ దూరంగా ఉంటూ ఉద్యోగంపై ఆశతో శిక్షణ పొందిన నాకు చివరకు నిరాశే మిగిలింది.                - ఎస్.పద్మ, కడవకుదురు, ప్రకాశం జిల్లా

 

 అగమ్యగోచరం



 ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే పోస్టుల సంఖ్య పెరుగుతాయని ఎంతో ఆశగా గత ఆరు నెలల నుంచి పగలనకా రేయనకా కష్టపడి చదువుతున్నాం. తీరా విద్యాశాఖ ప్రకటన చూశాక ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.        - ఎన్.వెంగమ్మ, నెల్లూరు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top