వాతావరణ మార్పులతోనే తీవ్ర వడగాలులు

వాతావరణ మార్పులతోనే తీవ్ర వడగాలులు


సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వె ల్లడి

దేశవ్యాప్తంగా 2,000 మంది మృత్యువాత.. అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలే కారణం


 

హైదరాబాద్: ఈ ఏడాది మండిపోతున్న వేసవికి ప్రజలు పిట్టల్లా రాలి పోతున్నారు.. వడగాల్పుల ప్రభావానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు రెండు వేల మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ దారుణ విపత్తుకు వాతావరణంలో తీవ్రమైన మార్పులే కారణమని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయని, ఈ మార్పు అకస్మాత్తుగా చోటు చేసుకోవడం వల్లే మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని  సీఎస్‌ఈ పేర్కొంది.



ముఖ్యంగా పచ్చదన లేమి, తారు, సిమెంట్ రోడ్డులు ఉన్న కాస్త ఖాళీ స్థలాన్ని కప్పివేయడంతో నగరాల్లోనే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని వెల్లడించింది. వేడి మొత్తం రహదారుల ఉపరితలంపైనే  ఉండిపోవడం వల్ల నగరాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఫలితంగా ఉష్ణోగ్రతలు మరో మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉన్న అనుభూతి కలుగుతుందని సీఎస్‌ఈ క్లైమేట్ చేంజ్ విభాగం ప్రోగ్రామ్ మేనేజర్ అర్జున శ్రీనిధి తెలిపారు. ‘‘2010తో పోలిస్తే ఈ ఏడాది వడగాల్పులు చాలా తక్కువ. కానీ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చిల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసిన తరువాత కూడా ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగిపోవడానికి నగరాలలోని పరిస్థితులే  కారణం’’ అని ఆయన వివరించారు.

 

రుతు పవనాలపై ప్రభావం



 వేసవిలో ఎండలు బాగా ఉంటే ఆ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని అంటుంటారు. కానీ, ఈ రోజుల్లో దీన్ని కూడా నమ్మే అవకాశం లేదు. వడగాల్పుల కారణంగా నేల వేడెక్కిన కారణంగా వెస్టర్లీ డిస్టర్‌బెన్సెస్ (పసిఫిక్, ఆర్కిటిక్ ప్రాంతాల నుంచి వీచే గాలులు)లో తేడాలు వస్తాయని, రుతు పవనాలపై వీటి ప్రభావం ఉండే అవకాశముందని సీఎస్‌ఈ శాస్త్రవేత్త గీతికా సింగ్ ‘సాక్షి’కి తెలిపారు.

 

అతి నీలలోహిత కిరణాల ముప్పు

 

మానవ చర్యల కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు ప్రతిఏటా పెరుగుతున్నాయి. 2001 నుంచి 2010 మధ్యలో భారత్‌లోనే సగటు ఉష్ణోగ్రతలు దాదాపు అర డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వందేళ్లలో ఉష్ణోగ్రత పెరుగుదల 0.8 డిగ్రీలుగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో వడగాల్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని సీఎస్‌ఈ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం వడగాల్పులు వీచే సమయం అయిదు రోజులు మాత్రమే ఉండగా భవిష్యత్తులో ఇది 30 నుంచి 40 రోజులకు పెరుగుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల నగరాల్లో చర్మ కేన్సర్‌కు కారణమయ్యే అతి నీలలోహిత కిరణాల ప్రభావమూ పెరుగుతోందని తెలిపింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియాలజీ లెక్కల ప్రకారం కొన్ని నగరాల యూవీ ఇండెక్స్ (అతి నీలలోహిత కిరణాల సూచీ) ప్రమాదకర స్థాయిలో ఆరు నుంచి తొమ్మిది మధ్యలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో వడగాల్పులకు సంబంధించిన అవగాహన పెంచడంతోపాటు, హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, తగిన సంఖ్యలో వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సీఎస్‌ఈ సూచించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top