‘కల్తీ’ గుట్టురట్టు

‘కల్తీ’ గుట్టురట్టు

  • నువ్వుల నూనె, ఆవు నెయ్యి పేరిట పామాయిల్ అమ్మకాలు

  •  విజయవాడ పాత ఆర్‌ఆర్‌పేటలో తయారీ కేంద్రం

  •  స్థానికుల సమాచారంతో రంగంలోకి అధికారులు

  •  సరుకు, గోడౌన్ సీజ్

  • విజయవాడ : భక్తులు దీపారాధనకు వినియోగించే ఆవునెయ్యి, నూనెను కల్తీ చేసి వాటిని మార్కెట్‌లో అమ్ముతూ అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ వ్యవహారం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పాత రాజరాజేశ్వరిపేటలోని కొత్త మసీదు వీధిలో శ్రీలక్ష్మీసాయి అయిల్ ట్రేడర్స్ పేరిట అమరా రామసుధాకర్‌రావు మూడేళ్లగా దీపారాధన నూనెల వ్యాపారం చేస్తున్నారు.



    డాల్డా, పామాయిల్‌తోపాటు కొన్ని రసాయనాలు, రంగులను కలిసి ఆవునెయ్యి పేరుతో 50, 100, 500 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో నింపుతున్నాడు. నూనె చిక్కబడేందుకు కొన్ని రసాయనాలతో కొవ్వును సైతం కలుపుతున్నట్లు సమాచారం. నువ్వుల నూనె పేరిట రైస్ బ్రాన్ ఆయిల్‌తో పాటు ఎందుకూ పనికిరాని వైట్ ఆయిల్‌లో సుగంధ ద్రవ్యాలను కలిపించి ప్యాకింగ్ చేయిస్తున్నాడు.



    డాల్డా, పామాయిల్‌తో నెయ్యి తయారీ సందర్భంలో పలు రసాయనాలను వినియోగిస్తునట్లు తెలిసింది. వాటిని వేడి చేసేందుకు గ్యాస్ పొయ్యిలను వినియోగిస్తున్నారు. నెయ్యి విక్రయాలలో పేరుపొందిన నందిని పేరును అనుకరిస్తూ శ్రీనందిని, సత్యభామ, ఎస్‌ఎల్‌ఎస్ ఆయిల్ పేరిట దీపారాధన నూనెలను మార్కెట్‌లోకి సంస్థ నిర్వాహకుడు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారం అత్యంత పకడ్బందీగా చేస్తున్నారు. ప్యాకింగ్ జరిగే భవనం ఎదురుగా ఎవరు వచ్చినా తమకు కనిపించేలా సీసీ కెమెరాలను సంస్థ నిర్వాహకుడు ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా నిఘా ఉంచి, సరుకు కల్తీ గుట్టు రట్టవకుండా సంస్థ నిర్వాహకుడు జాగ్రత్తలు తీసుకున్నారు.

     

    శనివారమే బట్టబయలు



    మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం రాబోతుండటంతో రేయింబవళ్లు పెద్దఎత్తున కల్తీ ఆవునెయ్యి, నువ్వుల నూనెలను ఈ సంస్థలో ప్యాకింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం పోలీసులకు విషయం తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. శనివారం రాత్రి కొత్తపేట పోలీసులు మచిలీపట్నంలోని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అన్నపురెడ్డి సుందరరామరెడ్డి, ఎం.శ్రీనివాసరావులకు సమాచారం అందించారు.



    కొత్తపేట సీఐ వెంకటేశ్వర్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు శనివారం రాత్రి నూనె గోడౌన్‌ను పరిశీలించారు. ఆదివారం పంచనామా నిర్వహించాలని భావించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా రెండు శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుడ్ ఇన్‌స్పెక్టర్లు మధ్యాహ్నం గోడౌన్ నుంచి ఆయిల్ శాంపిల్స్‌ను తీసుకుని హైదరాబాద్‌కు పంపారు. వీటి పరీక్షలకు సంబంధించి రిపోర్టు వచ్చే వరకు గోడౌన్‌తో పాటు స్టాక్‌ను సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. కల్తీ జరిగిందని తెలిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

     

    రాష్ర్టవ్యాప్తంగా విక్రయాలు



    డాల్డా, పామాయిల్‌తో తయారు చేసిన ఆవునెయ్యి, నువ్వుల నూనె రాష్ర్టంలోని అన్ని ప్రముఖ దేవాలయాలతో పాటు ప్రముఖ నగరాలలో విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. భారీఎత్తున జరుగుతున్న ఈ వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా పలువురు అధికారులకు, స్థానిక నేతలకు సంస్థనుంచి నెలనెలా మామూళ్లు అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆవునెయ్యి, నువ్వుల నూనెలను కల్తీ చేస్తున్న వ్యాపారులపై అధికారులు  వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.



    కార్పొరేషన్‌లో సేల్స్ టాక్స్, పుడ్ ఇన్‌స్పెక్టర్లకు మేనేజ్ చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని ఈ సంస్థ నిర్వాహకుడు చెబుతున్నట్లు తెలిసింది. మరో 10 రోజులలో తమ స్టాక్‌ని రిలీజ్ చేయించుకోగలమని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తీసుకున్న ట్రేడ్ లెసైన్స్‌తో లక్షల రూపాయల కల్తీ వ్యాపారం జరుగుతున్నా తమ దృష్టికి రాలేదని సేల్స్ టాక్స్ అధికారులు చెప్పడం శోచనీయం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top