పెద్దాసుపత్రికంపు..కంపు

పెద్దాసుపత్రికంపు..కంపు


కర్నూలు (హాస్పిటల్): సీమ స్థాయిలో నిత్యం వేలాది మంది రోగులకు సేవలందిస్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమస్యలతో సతమతమవుతోంది. ఏళ్ల నాటి డ్రెయినేజీ వ్యవస్థతో రోగులు నానాఅవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్య పనుల కోసం ఏటా రూ. 2.16 కోట్లు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం కానరావడంలేదు. ఫలితంగా పందుల సంచారం, పారిశుద్ధ్య లోపం కారణంగా  రోగు లు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ వందల సంఖ్యలో వివిధ రకాల వైద్య చికిత్సల కోసం రోగులు వస్తుంటారు. కర్నూలుతో పాటు కడప, అనంతపురం, తిరుపతి, ప్రకాశం, మహబూబ్‌నగర్, కర్ణాటక, రాయచూరి నుంచి వచ్చే రోగులకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది.

 

 రూ. కోట్లు ఖర్చవుతున్నా అవే సమస్యలు:

 ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ పనులు చేపట్టేందుకు 2010 అక్టోబర్ 1 నుంచి పజిల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేటు లిమిటెడ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఏజెన్సీ కింద పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 169 మంది వర్కర్లు, 10 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ప్రతి నెలా రూ. 18 లక్షల ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తున్నా పారిశుద్ధ్యం మెరుగుపడటం లేదు. పందులు, కుక్కల బెడద అధికంగా ఉంది. కొందరు స్థానిక లెప్రసీ వార్డు, దోబీ ఘాట్ వద్ద వ్యర్థ పదార్థాలను పడేస్తున్నారు.  

 

 మూడు నెలలుగా అందని వేతనాలు:

 పారిశుద్ధ కార్మికులకు ఏజెన్సీ నిర్వాహకులు ఏ నెల కూడా జీతాలు సక్రమంగా ఇవ్వడంలేదు. నెలల తరబడిగా జీతాలు లేక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఏడాది మార్చికి ఏజెన్సీ గడువు ముగియడంతో కొత్త కాంట్రాక్టు ఇచ్చే వరకు బాధ్యతలను డెరైక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు అప్పగించారు. అప్పటి నుంచి ఏప్రిల్ నెల జీతం ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పారిశుద్ధ్య కార్మికులను కొందరు సిబ్బంది ఇతర పనులకు వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

 

 అధ్వాన్నంగా డ్రెయినేజీ వ్యవస్థ:

 వైద్యశాలలో పురాతన కాలం నిర్మించిన డ్రెయినేజీ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది. పలుచోట్ల సిల్ట్ తొలగించలేని పరిస్థితి. ట్రామాకేర్ సెంటర్ సందులో డ్రెయినేజీ దెబ్బతిని మురుగునీరు ఎక్కడికక్కడే స్తంభించింది. అలాగే ఏఆర్‌టీ నుంచి గైనిక్ వార్డు గేట్ వద్ద డ్రెయినేజీ సక్రమంగా లేదు. అలాగే ఆసుపత్రిలో మామూళ్ల పర్వం యధేచ్ఛగా సాగుతోంది. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. నాలుగేళ్లుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించిన సంస్థకే మరోసారి కాంట్రాక్టు అప్పగించినట్లు సమాచారం.

 

 కొత్త కలెక్టర్ గారూ... దృష్టి పెట్టండి...:

 వేలాది మంది రోగులకు వైద్య సేవలందిస్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలపై కొత్త కలెక్టర్ విజయమోహన్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పందులు, కుక్కల సమస్య, అధ్వాన్నంగా డ్రెయినేజీ, పారిశుద్ధ్య సమస్యలపై ఆకస్మిక, విస్తృత తనిఖీలు చేయాలని రోగులు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top