విత్తనం స్వాహా

విత్తనం స్వాహా


సాక్షి నెట్‌వర్క్: సాగు ఊపందుకుంటున్న తరుణంలో విత్తన అమ్మకాల్లో గోల్‌మాల్ చోటుచేసుకుంటోంది. రాష్ర్టంలో పలుచోట్ల సబ్సిడీ విత్తనాలను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. పలు రకాల విత్తనాల సబ్సిడీ ధరలకు, మార్కెట్ ధరలకు మధ్య పెద్దగా తేడా కూడా ఉండటం లేదు. నాణ్యత పేరుతో విత్తన కంపెనీలు ఎక్కువ ధర కోట్ చేస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి కసరత్తు చేయకుండా దానిపైనే సబ్సిడీని నిర్ణయించడం ఈ పరిస్థితికి దారి తీస్తోంది. ప్రైవేట్ కంపెనీల మాయాజాలంతో ఇటు సర్కారు.. అటు రైతులు నష్టపోతున్నా రు. ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీలో కలిపి రాష్ట్రంలో 105 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఖరీఫ్ వరకైతే 66.37 లక్షల టన్నుల ఉత్పత్తిపై ఆశలు పెట్టుకుంది.

 

 పత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలు కాకుండా ఆహార ధాన్యాలకు సంబంధించి మాత్రమే ఈ మేరకు లక్ష్యంగా ఉంది. దీంతో 35.83 లక్షల హెక్టార్లలో ఈ పంటలు వేయాలని ఆ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. సాగు అవసరాల కోసం 17.89 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ధారించారు. దీంట్లో 8.19 లక్షల క్వింటాళ్లను రూ. 128.19 కోట్ల సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల విత్తనాలపై వేర్వేరుగా సబ్సిడీలు ఇస్తోంది. వరి విత్తనాలపై కిలోకు ఐదు రూపాయల చొప్పున సబ్సిడీ ఖరారు చేసింది. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ. 500 సబ్సిడీ ఉంది. వేరుశనగ విత్తనాలపై 32.61 శాతం సబ్సిడీగా నిర్ణయించారు. దీంతో దీని సబ్సిడీ ధర క్వింటాల్‌కురూ. 3,100గా ఉంది. కందులు, పెసలు, మినుము విత్తనాలపై ప్రభుత్వం 33 శాతం సబ్సిడీ ఇస్తోంది. కంది విత్తనాల్లో హైబ్రిడ్(ఐసీపీహెచ్-2740) రకాలపై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. మొక్కజొన్న, ఆముదం, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలపై క్వింటాల్‌కు రూ. 2,500 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. ఇలా ఒక్కో విత్తనాలకు ఒక్కో రకం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం.. ఈ విషయంలో కంపెనీల వ్యూహాన్ని పట్టించుకోవడం లేదు.

 

 కంపెనీల ఇష్టారాజ్యం

 

 రైతులకు 30 నుంచి 50 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. మొక్కజొన్న విత్తనాలపైప్రభుత్వం కిలోకు రూ. 25 సబ్సిడీ ఇస్తోంది. ప్రస్తుతం అన్ని కంపెనీలకు చెందిన 35 రకాల మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సగం వరకు రకాలు సబ్సిడీపై, బహిరంగ మార్కెట్‌లో ఒకే ధరకు లభిస్తున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌లో మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలోని కావేరి విత్తనాల పంపిణీకి సంబంధించి జ్యోతి, శివ ట్రేడర్‌లు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు.

 

 సబ్సిడీపై అందజేసే విత్తనాలను పర్మిట్లు పొందిన రైతులు ఈ రెండు దుకాణాల్లోనే రూ.525కు ప్యాకెట్ చొప్పున తీసుకోవాలి. అయితే స్థానికంగా ఉన్న జీవన్, హనుమాన్, వెంకటేశ్వర, ప్రజ్ఞాపూర్‌లోని లక్ష్మీవెంకటరమణ దుకాణదారులు పర్మిట్‌లతో ప్రమేయం లేకుండా ఈ విత్తనాలను ప్యాకెట్‌కు రూ.520 లోపే విక్రయిస్తున్నట్లు గజ్వేల్ వ్యవసాయాధికారి ప్రవీణ్‌కుమార్ గుర్తించారు. ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 180 ప్యాకెట్లను సీజ్ చేసి, ఆ ప్యాకెట్ల అమ్మకాలను నిలిపివేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ సబ్సిడీ కింద సరఫరా చేస్తున్న విత్తనాలకు కంపెనీలు అధిక ధరలను వసూలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. బీటీ పత్తి విత్తనాల విషయంలో వ్యాపారులు కొత్త తరహా అక్రమానికి తెరలేపారు. రూ. 500కు విక్రయించాల్సిన హైబ్రీడ్ పత్తి విత్తన ప్యాకెట్‌ను బీటీ-2 పేరుతో రూ. 930కి అమ్ముతున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో గత నెలలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇండిగో సీడ్ కంపెనీకి చెందిన ‘సచిన్’ రకానికి చెందిన హైబ్రీడ్ పత్తి విత్తనాన్ని బీటీ-2గా చలామణి చేస్తున్నట్లు తేలింది. అలాగే అజయ్-151 రకానికి చెందిన పత్తి విత్తన ప్యాకెట్‌లో 125 గ్రాముల కంది విత్తనాలు కూడా లభిస్తాయి. దీని రేటును ప్రభుత్వం రూ. 862గా ఖరారు చేసినప్పటికీ సదరు కంపెనీ మాత్రం దీన్ని రూ. 930కే రైతులకు విక్రయించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top