దుర్బుద్ధి పురందేశ్వరి కుటుంబానికే వర్తిస్తుంది


ఒంగోలు : దుర్బుద్ధి అనేది పురందేశ్వరి కుటుంబానికే వర్తిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజకుమారి మాట్లాడుతూ దుర్బుద్ధి, సంకల్పం అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండి..మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ రాదని నిర్ణయించుకుని..బీజేపీలో చేరడం పురందేశ్వరికే చెల్లిందన్నారు.


కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో రాష్ట్రాన్ని విభజిస్తుంటే తనను దిగ్విజయ్‌సింగ్ రాజీనామా చేయవద్దని కోరాడని పురందేశ్వరి చెప్పిందన్నారు. అదే కేంద్ర మంత్రి రాష్ట్రాన్ని విభజిస్తానని హైదరాబాద్‌లో ప్రకటిస్తే కూడా స్పందించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు విడుదల చేయడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు  బీజేపీ వారిపై మాట్లాడవద్దని అనడంతో తాము మాట్లాడటం లేదన్నారు.  



హుద్‌హుద్ తుఫాను సమయంలో మోడీ రాష్ట్రానికి వచ్చి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామన్నారని..అయితే ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బడ్జెట్‌లో ఏమీ నిధులు కేటాయించలేదన్నారు. రాజధాని నిర్మాణానికి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రాన్ని విడగొడుతున్న సమయంలో ఆంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని చెప్పిన కేంద్రం మాట మార్చిందన్నారు. మిగిలిన రాష్ట్రాలను మన రాష్ట్రంతో పోలుస్తున్నారన్నారు.


ఆంధ్రులకు అన్యాయం చేసినవారు ఎవరూ బాగుపడలేదన్నారు. దేశంలో ఉన్న తెలుగు వారు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారని, రాష్ట్రాన్ని విడగొట్టడం వల్లనే కాంగ్రెస్‌ను తెలుగు ప్రజలు మట్టి కరిపించారని అన్నారు. రాష్ట్ర రాజధానిగా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా తుళ్లూరును నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.



ఇలా ఎవరైనా చెబితే అది వారి అజ్ఞానం అవుతుందన్నారు. 33 వేల ఎకరాలకు పైగా రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇచ్చారన్నారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా స్థలాలు కొని, వెంటనే పూలింగ్‌కు ఇస్తున్నారన్నారు. మెజారిటీ శాతం అంటే 80 శాతంకు పైగా రైతులు రాజధాని నిర్మాణానికి భూములను ఇవ్వడానికి అంగీకార పత్రాలను ఇచ్చారన్నారు. ఎకరాకు రైతులకు 1450 గజాల స్థలం ఇవ్వడానికి చంద్రబాబు ఆమోదించారని,  దీనికి గానూ అనేక సవరణలు చేసినట్లు తెలిపారు.


రాజధాని విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను నిర్మిం చింది చంద్రబాబే అని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటాయని చెప్పారు. కేంద్రాన్ని బెది రించే పరిస్థితుల్లో తాము లేమన్నారు. కేం ద్రం రాష్ట్రానికి సహకరించకపోతే ఆందోళనలు, ధర్నాలు చేస్తామన్నారు. వెంకయ్య నాయుడు హామీలు ఇచ్చినా మోడీనే అమలు చేయాల్సి ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి టి. అరుణ, శ్రీనివాసరావు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top