నాటుతుపాకుల కలకలం

నాటుతుపాకుల కలకలం


పట్టపగలు ఓ ఆటోలో రహస్యంగా నాటు తుపాకుల రవాణా గుట్టురట్టు కావడం పాలకొండలో కలకలం రేపింది. ఏజెన్సీ ప్రాంతంనుంచే ఇవి రవాణా కావడం పోలీసుశాఖకు సవాల్‌గా మారింది. వన్యప్రాణుల వేటకోసం వినియోగిస్తున్నారా.. లేక ఇంకే అవసరానికా... అన్నది

 ప్రశ్నార్థకంగా మారింది.

 

 పాలకొండ : ఒక ఆటోలో దర్జాగా ఎనిమిది నాటుతుపాకులు రవాణా జరుగు తూ పోలీసులకు పట్టుబడి న సంఘటన పాలకొండ పట్టణంలో చర్చనీయాంశమైంది. పోలీసు స్టేషన్ ముందు నుంచే వీటిని తరలించేసినా... ఎవరూ గుర్తు పట్టలేదు. అయితే ఆటో ఓ వ్యక్తిని ఢీకొనడంతో వారు అందించిన సమాచారం మేరకు వెంబడించి పట్టుకోగా అందులో అసలు గుట్టు రట్టయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో కొద్ది కాలంగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వన్యప్రాణుల వేటనే కొందరు వృత్తిగా మలచుకుని జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

 

  సీతంపేట మండలం ఈతమానుగూడ నుంచి తాజాగా ఆటోలో ఎనిమిది తుపాకులు పెట్టి గొనె సంచులు కప్పారు. వెనుక భాగంలో రెండు చురకత్తులు, బియ్యం, ఉప్పు, ఉల్లిపాయలు ఇతర సామగ్రితోపాటు ఐదు రోజులకు సరిపడే దుస్తులు పట్టేలా ఐదు బ్యాగ్‌లు లభించాయి. ఆటో డ్రైవర్ పప్పల చంద్రశేఖర్ మద్యం మత్తులో ఉండి పోలీసులకు చిక్కగా మరో ఎనిమిది మంది పారిపోయినట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఏజెన్సీలో అడవి పందులు, దున్నలు, జింకలను వేట సాగిస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. చంపిన జంతువుల చర్మం తొలగించి మాంసంగా మార్చేందుకు పదునైన చురకత్తులు వినియోగించవచ్చని భావిస్తున్నారు.

 అడవి పందులను హతమార్చేందుకేనా...

 

 పాలకొండ ప్రాంతంలో విరివిగా చెరకు పంటను సాగు చేస్తున్నారు. వాటిని అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈతమానుగూడకు చెందిన గిరిజనులను గోపాలపురం గ్రామంలో చెరకు పంటల్లో పడుతున్న అడవి పందులను హతమార్చేందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో నాటు తుపాకులు, కత్తులు, నాటు బాంబులకు వినియోగించే మందుగుండు సామగ్రి వెలుగు చూడటంతో వన్యప్రాణులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న తీరు ఇట్టే అర్థమౌతోంది. సంబంధిత ఆటవీశాఖ అధికారులు కాని, పోలీసులు కాని దీనిపై దృష్టిసారించలేదు. దీనికి తోడు అటవీశాఖలో కొంత మంది సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న కృష్ణ జింకుల వేటసైతం సాగుతున్నట్టు తెలుస్తోంది.

 

 మాంసం ఏమి చేస్తున్నట్టు..  

 దట్టమైన ఆడవిలతోపాటు చెరుకు తోటల్లో వేట సజావుగా సాగుతోంది. వన్యప్రాణులను చంపి ఆ మాంసాన్ని ఎక్కడ విక్రయిస్తున్నారన్న దానిపై అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో మాంసం విక్రయాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అడవిలోనే మాంసాన్ని ప్యాక్ చేసి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారించి దర్యాప్తు జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. కాగా నాటుతుపాకుల స్వాధీనంపై డీఎస్పీ సిహెచ్.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రాధమికంగా అడవి పందుల వేట కోసమే వీటిని వినియోగించినట్టు నిర్థారణకు వచ్చామన్నారు. పారిపోయిన నిందితులను పట్టుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందున్నారు. హత్యలు, దోపిడీల కోసం వీటిని వినియోగించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top