ఎస్సీలకు సమున్నత స్థానం

ఎస్సీలకు సమున్నత స్థానం - Sakshi


సాక్షి ప్రతినిధి, తిరుపతి: బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుంటారు. ఆ వర్గాల ప్రజలను రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారనడానికి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామిని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షునిగా వరుసగా రెండోసారి నియమించడమే తార్కాణం. నారాయణస్వామికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.



గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి ఆదినుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలుస్తున్నారు. వైఎస్సార్‌సీపీని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఆపార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఆయనను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షునిగా 2012లో నియమించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీని తిరుగులేని శక్తిగా మార్చడంలో నారాయణస్వామి ప్రధాన భూమిక పోషించారు.



నేతలందరినీ సమన్వయపరచి.. శ్రేణులను ఒక్క తాటిపై నడిపించి.. అనేక ప్రజా ఉద్యమాలను చేశారు. 2014 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మూడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరుపతి, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. చంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది.



పార్టీ నేతలు.. శ్రేణులు ఏకతాటిపై నడవడం వల్లే ఇది సాధ్యమైంది. వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా అధ్యక్షుల నియామకానికి ఆపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెరతీశారు. ఈ క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా కె.నారాయణస్వామినే మరోసారి నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.



2004 ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టిన నారాయణస్వామి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా మెలిగారు. 2009 ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన.. వైఎస్ హఠాన్మరణం తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నడిచారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కె.నారాయణస్వామి పార్టీ శ్రేణులను సమర్థవంతంగా ముందుకు నడిపించారు.



2014 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యారు. నారాయణస్వామిని వరుసగా రెండోసారి జిల్లా అధ్యక్షునిగా నియమించడం ద్వారా ఎస్సీలకు వైఎస్సార్‌సీపీలో సమున్నత గౌరవం ఉంటుందన్నది మరోసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాటిచెప్పినట్లయింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top