ఎంపీల ప్రతిపాదనలు బుట్టదాఖలు


విజయవాడ :  రైల్వే బడ్జెట్‌లో విజయవాడ డివిజన్‌కు నిధులు కేటాయించాలంటూ జనవరి ఆరో తేదీన జరిగిన సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవను బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కోరారు.

 

కేశినేని నాని ప్రతిపాదనలివీ..



 నూతన రాష్ట్ర రాజధానిగా విజయవాడ మారిన నేపథ్యంలో విజయవాడ రైల్వే  స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేసి అన్ని సౌకర్యాలూ కల్పించాలి.   రాజధాని ప్రాంతంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైళ్ల సంఖ్య పెంచాలి.   రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాపును ఆధునికీకరించాలి.  నగరంలోని రైల్వే ఆస్పత్రిని వెయ్యి పడకలకు విస్తరించి అభివృద్ధి చేయాలి. విజయవాడ నుంచి నడిచే ఒకరైలుకు ఇంద్రకీలాద్రి ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలి. విజయవాడ నుంచి ముంబయి, కొచ్చిన్, త్రివేండ్రం, సూరత్, గౌహతి, కోయంబత్తూర్‌కు రైళ్లు నడపాలి. గుణదల, వాంబేకాలనీతో పాటు విజయవాడలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు నిర్మించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి.



కొనకళ్ల నారాయణ ప్రతిపాదనలివీ..

 

బందరు పోర్టు నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం కేంద్రంగా కోస్తా రైల్ కారిడార్‌ను ఏర్పాటుచేయాలి.బందరు నుంచి కోటిపల్లి, రేపల్లె రైల్వే లైన్లను విస్తరిస్తే భవిష్యత్తులో కోస్తా రైలు మార్గం కీలకంగా మారుతుంది.  పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి కాబట్టి అందుకనుగుణంగా మచిలీపట్నం స్టేషన్‌ను అభివృద్ధిచేయాలి.  మచిలీపట్నం-విజయవాడ రైల్వే లైను డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి.  బందరు నుంచి విశాఖపట్నం, తిరుపతికి నడుపుతున్న రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలి. నూజివీడులో మరిన్ని రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి.  కొత్త రైళ్ల కేటాయింపులో మచిలీపట్నానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.

 

వినూత్న బడ్జెట్



గత ప్రభుత్వాలు ప్రకటించిన ప్రాజెక్టులను పూర్తిచేసే ఉద్దేశంతో రైల్వేమంత్రి సురేష్ ప్రభు వినూత్నంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రయాణికులకు మెరుగైన  సౌకర్యాలు, టికెట్ బుకింగ్ దగ్గర నుంచి రైల్వే ప్రయాణం, గమ్యస్థానం చేరే వరకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాల మెరుగుదలే ధ్యేయంగా ఈ బడ్జెట్ ఉంది. గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఏపీ ఎక్స్‌ప్రెస్, రైల్వే యూనివర్శిటీ, రైల్‌నీరు వంటి ప్రాజెక్టుల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తా. ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ బడ్జెట్  ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సిన ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేస్తుందని నేను భావిస్తున్నాను.

 - కేశినేని నాని, విజయవాడ ఎంపీ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top