దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. మృత్యు ఒడికి

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. మృత్యు ఒడికి - Sakshi


♦ చెట్టును ఢీకొన్న స్కార్పియో

♦ ముగ్గురి మృతి..

♦ మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

 

 నల్లచెరువు : దైవ దర్శనానికి వె ళ్లి వస్తూ మృత్యు ఒడికి చేరుకున్నారు. తిరుమలకు వెళ్లి ఏడు కొండల స్వామిని దర్శించుకొని వస్తుండగా, జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, హిందూపురం పట్టణంలో అయ్యప్పస్వామి గుడిని నిర్మిస్తున్నారు. ఈ గుడికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంగీత వాయిద్యాలను ఉచితంగా ఇస్తామన్నారు.



ఇవి తీసుకురావడానికి హిందూపురం పట్టణానికి చెందిన పాండురంగ రవి, గురుస్వామి మురళి, డ్రైవర్ అనిల్‌తోపాటు రమేష్, టీడీపీ మాజీ కౌన్సిలర్ శ్రీరాములు, రవీంద్రనాథ్ ఠాగూర్ స్కార్పియోలో బయల్దేరారు. తిరుమలకు వెళ్లి సంగీత వాయిద్యాలు తీసుకొని  స్వామి వారి దర్శనం చేసుకున్నారు. తిరిగి హిందూపురానికి బుధవారం రాత్రి బయలుదేరారు. మార్గమధ్యంలో దేవిరెడ్డిపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుకు ఆనుకొని వున్న చింత చెట్టును స్కార్పియో ఢీ కొట్టింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడ్డ వారిని 108లో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.



పాండురంగ రవి (48) అక్కడికక్కడే మృతి చెందాడు. మార్గమధ్యంలో గురుస్వామి మురళి (45), చికిత్స పొందుతూ డ్రైవర్ అనిల్ (30) మృతి చెందారు. రమేష్, శ్రీరాములు, రవీంద్రనాథ్‌ఠాగూర్ తీవ్రంగా గాయపడ్డారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు రవికి భార్య శాంత, ఇద్దరు కుమారులున్నారు. మురళికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. డ్రైవర్ అనిల్‌కు ఇంకా పెళ్లికాలేదు. గాయపడిన వారు కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 8 నెలల క్రి తం ఇదే చింత చెట్టుకు తుఫాన్ వాహ నం ఢీ కొని సిరిగుప్ప మండలానికి చెందిన వారు నలుగురు మృతి చెందారు. దేవుళ్లకు ఎన్ని పూజలు చేసినా ఏమి ఫలితమురా నాయినా.. అంటూ పాండురంగ రవి భార్య శాంత విలపించడం చూపరులను కలిచివేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top