నిజమే.. వజీర్‌ను చితక్కొట్టారు

నిజమే.. వజీర్‌ను చితక్కొట్టారు


సాక్షి, ఏలూరు/దెందులూరు :  స్కూల్ కరస్పాండెంట్ చావబాదడంతో మతిస్థిమితం కోల్పోయిన నాలుగో తరగతి విద్యార్థి ఉదంతంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో ఆర్.నరసింహరావును ఆదేశించారు. దెందులూరు మండలం గంగన్నగూడెంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూపీ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న వజీర్‌ను ఆ స్కూల్ కరస్పాండెంట్ వసీవుల్లా విచక్షణా రహితంగా కొట్టడంతో మతిస్థిమితం కోల్పోయాడని వజీర్ తండ్రి హిదయతుల్లా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

 

 ఈ ఉదంతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, కలెక్టర్ స్పందించారు. హుటాహుటిన విద్యాశాఖ అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాల్సిందిగా డీఈవో ఆర్.నరసింహరావును ఆదేశించారు. దీంతో దెందులూరు ఎంఈవో వి.రంగప్రసాద్‌ను విచారణాధికారిగా నియమిస్తూ డీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎంఈవో రంగప్రసాద్ ఆ పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు. ఉపాధ్యాయులు అఫీజుల్లా, నుజమిల్, 6వ తరగతి విద్యార్థులు అనిష్, అబ్దుల్ రెహమాన్ షాలిక్‌తోపాటు మరో 12 మందిని విడివిడిగా విచారించిన ఎంఈవో వివరాలు నమోదు చేశారు.

 

 కొట్టిన విషయం వాస్తవమే...

 ఘటన జరిగిన రోజున విద్యార్థి వజీర్ కరస్పాండెంట్ ఉంటున్న గదిలోకి వెళ్లి పాస్ పోసినట్టు విచారణాధికారికి ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన కరస్పాండెంట్ వజీర్‌ను కొట్టిన విషయం వాస్తవమేనన్నారు. వజీర్ బాగా చదువుతాడని, క్రమశిక్షణతో ఉంటాడని విద్యార్థులు వాగ్మూ లం ఇచ్చారు. అయితే వజీర్ తరచూ కిందపడిపోతూ ఉంటాడని, అతనికి ఫిట్స్ ఉందని కొందరు చెప్పినట్టు విచారణాధికారి తెలిపారు. ఘటనపై డీఈవోకు నివేదిక అందజేస్తామని రంగప్రసాద్ తెలిపారు. కాగా విచారణ నిర్వహించిన సమయంలో బాధిత విద్యార్థి సోదరుడు, కరస్పాండెంట్ అక్కడ లేరు.

 

 చైల్డ్‌లైన్ సిబ్బంది కౌన్సెలింగ్

 మౌలానా అబ్దుల్ కలాం పాఠశాలలో చైల్డ్‌లైన్ (ఏలూరు) కో-ఆర్డినేటర్లు వి.ప్రసాద్, జె.ప్రసాద్ తదితరులు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శని వారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, మానసిక స్థితిగతులు, బోధన, పరస్పర సహాయ సహకారాలు, మానవతా ధృక్పథం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top