బడి బస్సు.. తనిఖీలు తుస్సు!

బడి బస్సు.. తనిఖీలు తుస్సు! - Sakshi


నత్తనడకన ఫిట్‌నెస్ పరీక్షలు

పట్టించుకోని పాఠశాల యాజమాన్యాలు

నిర్లక్ష్యాన్ని వీడని రవాణ శాఖ అధికారులు

ఆన్‌లైన్‌లో నమోదు అంతంతే

జూన్ 1కి ముగియనున్న గడువు


 

 బడి బస్సులు భద్రంగా ఉండాలి.. విద్యార్థులు క్షేమంగా పాఠశాలకు వెళ్లాలి..అనుమతుల్లేకుండా రోడ్లపై తిరిగే బస్సులపై కఠినంగా వ్యవహరించండి..అంటూ ప్రభుత్వం ఆదేశించినా జిల్లా రవాణా శాఖలో పెద్దగా చలనం కనిపించలేదు. ఈనెల 15 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్ పరీక్షల తనిఖీలు జిల్లాలో తూతూమంత్రంగా సాగుతున్నాయి. వ్యవస్థాగతంగా జరగాల్సిన తనిఖీ నామమాత్రంగా ముగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 కర్నూలు: బస్సుల్లో వెళ్లే చిన్నారులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రభుత్వం సామర్థ్య పరీక్షల కోసం పాఠశాల బస్సులకు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసింది. డ్రైవర్ అర్హతల నుంచి బస్సు ఫిట్‌నెస్ వరకు మొత్తం 33 అంశాల ప్రాతిపదికన తనిఖీలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో 980 పాఠశాలల బస్సులు ఉండగా.. ఈనెల 15తో వాటన్నిటికీ ఫిట్‌నెస్ గడువు ముగిసింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని రవాణా శాఖ కార్యాలయాల్లో తనిఖీలు చేయించుకుని ఫిట్‌నెస్ ధృవపత్రాలు పొందాకే వాహనాలు రోడ్డుపై తిప్పాలి.



ఇప్పటివరకు 45 బస్సులకు మాత్రమే సామర్థ్య పరీక్షలు చేయించుకున్నారు. మరో 14 బస్సులు కండీషన్ సరిగా లేకపోవడంతో వాటి యజమానులకు సీఎఫ్‌ఆర్‌ఆర్ నోటీసులను అధికారులు జారీ చేశారు. ప్రతి ఏడాది మే 15వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించి సంబంధిత అధికారులు ఫిట్‌నెస్ పత్రాలు జారీ చేసేవారు. ప్రస్తుతం పాఠశాలలు తెరిచేలోపు తప్పనిసరిగా ఎఫ్‌సీ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.



సామర్థ్య పరీక్షలకు జూన్ 1వ తేదీ తుది గడువుగా ప్రకటించినప్పటికీ పాఠశాలల యాజమాన్యాలలో స్పందన అంతంతమాత్రమే. అధికారులు తనిఖీలు కూడా ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ 900 బస్సులకు పైగా ఫిట్‌నెస్ చేయించుకోవాల్సి ఉంది. రవాణా శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్ కోసం నమోదు చేసుకున్న బస్సుల సంఖ్య ఇప్పటివరకు వందకు మించలేదు. ప్రతి బస్సునకు ఫలానా డ్రైవర్, క్లీనర్ ఉంటారని యాజమాన్యాలు వెబ్‌సైట్‌లో సూచించాలి. వారినే సామర్థ్య పరీక్షలకు పంపాలి.



డ్రైవర్ పూర్తి ఆరోగ్యంతో 60 ఏళ్లకు మించని వాడై ఉండాలి. చాలా సంస్థల్లో ముసలి, ముతక డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్లు ఉండటం లేదు. అటువంటివారు స్లాట్ నమోదుకు వెనుకాడుతున్నారు. అయితే పాఠశాలల యాజమాన్యాల వాదన మరో విధంగా ఉంది. తనిఖీల సమయం కోసం నమోదు ప్రక్రియను మే 1 నుంచి ప్రారంభించివుంటే తమకు 15 రోజులు వెసులుబాటు దక్కేదని విద్యాసంస్థల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. గడువు ముగిసిన రోజు నుంచి స్లాట్‌కు ప్రయత్నిస్తున్నప్పటికీ సమయం పడుతున్నందున మరికొంత వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. కర్నూలు, నంద్యాలలో ప్రాంతీయ కార్యాలయాలు, ఆదోనిలో యూనిట్ కేంద్రం, ఆత్మకూరు, డోన్‌లో ఎంవీఐ కేంద్రాలు రవాణా శాఖకు ఉన్నాయి.

 

 గడువులోగా ఎఫ్‌సీ చేయించుకోకపోతే చర్యలు

 జిల్లాలో పాఠశాలల బస్సులు సామర్థ్య నిర్ధారణ పరీక్షలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించాం. విద్యాసంస్థల బస్సులు తమ శాఖ నుంచి విధిగా అనుమతి పొందాలి. ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చినందున ఆ మేరకు విద్యాసంస్థ తమ బస్సుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. గడువులోగా ఎఫ్‌సీ చేయించుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. చాలా బస్సులు కండీషన్‌గా ఉండటం లేదు. వాటన్నిటినీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసుకుని నిబంధనల మేరకే బస్సులను కార్యాలయానికి తీసుకురావాలని నోటీసులు ఇచ్చాం. ఎఫ్‌సీ లేకుండా రోడ్లపై తిప్పితే చర్యలు తప్పవు.

 -ఎస్.ఎస్.మూర్తి, ఆర్‌టీఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top