చిన్నారిని చిదిమేసింది!

చిన్నారిని చిదిమేసింది! - Sakshi


► బాలికను కబళించిన స్కూల్‌ బస్సు

► గొట్టలో విషాదఛాయలు


హిరమండలం : తల్లి ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన చిన్నారిని స్కూల్‌ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. పేదింట అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అప్పటివరకు చిట్టిపొట్టి అడుగులతో.. చిన్నిచిన్ని మాటలతో ఆనందంగా గడిపిన చిన్నారికి... అన్నయ్య వెళ్లే స్కూల్‌ బస్సే యమపాశమైంది. రెప్పపాటు కాలంలోనే బస్సు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయింది. కన్నతల్లి కళ్ల ముందే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘటన మండలంలోని గొట్ట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. నిండా మూడేళ్లూ నిండని కుమార్తె.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. వివరాలిలా ఉన్నాయి.


మండలంలోని ధనుపురం గ్రామానికి చెందిన చీకటి వసంతరావు, రోహిణిలకు ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల వయస్సు గల పెద్ద కుమారుడు వేణుగోపాలరావు మండలంలోని కల్లటలో ఉన్న కార్మిల్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ధనుపురంలో ఉంటున్న రోహిణి.. శుభకార్యం నిమిత్తం గొట్ట గ్రామంలోని తన తమ్ముడి ఇంటికి ఐదు రోజుల క్రితం వచ్చింది. శనివారం ఉదయం కుమారుడు వేణుగోపాలరావును ఇక్కడి నుంచే స్కూల్‌కు పంపించేందుకు సిద్ధం చేసి, బస్సు కోసం వేచి చూస్తోంది.


కుమారుడిని స్కూల్‌కు తీసుకువెళ్లే బస్సే.. తన చిన్నారి కూతురు జీవితాన్ని బలిగొంటుందని ఆ క్షణంలో ఆమె ఊహించలేదు. కుమారుడిని బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చిన ఆమె.. తన వెంటే కుమార్తె శార్వాణి వచ్చిందన్న విషయం గమనించలేదు. తల్లి వెనుకగా వచ్చిన శార్వాణి.. బస్సు టైర్ల చెంతనే నిల్చొంది. బస్సు ఎక్కిన కుమారుడు.. తల్లికి ‘బై..బై’ అంటూ చెప్పడం, వెంటనే బస్సు కదలడం.. ఆ చక్రాల కింద కుమార్తె శార్వాణి నలిగిపోవడం ఒక్కసారిగా జరిగిపోయాయి. కుమార్తె కేకలు విన్న ఆ తల్లి.. ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది.


అప్పటికే ఆ చిట్టితల్లి చక్రాల కింద బలైపోయింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటనతో గొట్ట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో బస్సు తీయడం వల్లే ముందు టైరుకింద పడి పాప చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు. తల్లి రోహిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. రహదారి ప్రమాదాల ప్రత్యేక టీమ్‌ రాజాం ఎస్సై జె.శంకరరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top