దగాపడ్డ రైతుబిడ్డ

దగాపడ్డ రైతుబిడ్డ - Sakshi


‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ అస్త్రంతో వడ్డీ మేర కూడా

మాఫీ కాని  వ్యవసాయ రుణం

తక్షణమే అప్పు చెల్లించాలంటూ బ్యాంకర్ల నోటీసులు

రెన్యూవల్ చేసుకోకుంటే అపరాధ వడ్డీ తప్పదని హెచ్చరిక

సంక్షోభంలో కూరుకుపోయిన కర్షకులు




తిరుపతి/పలమనేరు: పది మందికి పట్టెడన్నం పెట్టే రైతుబిడ్డ దగా పడ్డాడు. ఒక్క సంతకంతో రుణ మాఫీ చేస్తామని నమ్మించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు నట్టేట ముంచడాన్ని కర్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వడ్డీ మేర కూడా రుణం మాఫీ కాకపోవడం.. తక్షణమే అప్పు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. కనీసం రుణం రెన్యూవల్ చేసుకోకపోతే అపరాధ వడ్డీ పడుతుందని.. ఎగవేతదారుగా ముద్రవేసి ఎప్పటికీ రుణం ఇవ్వమని బ్యాంకర్లు అల్టిమేటం జారీచేస్తుండడం రైతన్నల ఆందోళనను రెట్టింపు చేస్తోంది. అప్పుల భారం ఓ వైపు.. కరువు దెబ్బ మరో వైపు అన్నదాతను సంక్షోభంలోకి నెట్టాయి. అప్పులు చెల్లించలేక.. కుటుం బాన్ని కాపాడుకోలేక.. ఆత్మాభిమానం చంపుకోలేక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాల్మీకిపురం మండ లం చింతలవారిపల్లికి చెందిన పి.అశోక్‌కుమార్‌రెడ్డి అనే యువ రైతు ఇటీవల ఆత్మార్పణం చేసుకోవడమే అందుకు పరాకాష్ట. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో డిసెంబర్ 31, 2013 నాటికి 8.70,321 మంది రైతులు రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు ఒక్క సంతకంతో ఆ రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులు భావించారు. కానీ.. సీఎం చంద్రబాబు రైతులను నిలువునా ముంచారు.



ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అస్త్రాన్ని వినియోగించి రైతన్నలను చావుదెబ్బ తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి.. ఆ రైతులందరూ మాఫీకి అర్హులుగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ.. ప్రభుత్వం తొలి విడత 3,06,544, రెండో విడత 1,42,229 మొత్తం 4,53,773 మంది రైతులకే మాఫీ వర్తింపజేసింది. తక్కిన 4,16,548 మంది రైతులకు మొండిచేయి చూపింది. రూ.11,180.25 కోట్లకుగానూ రూ.600 కోట్ల మేర మాత్రమే రుణ మాఫీ చేసినట్లు బ్యాంకర్లు లెక్కలు వేస్తున్నారు. రుణ మాఫీ హామీ అమల్లో జాప్యంతో రైతులపై రూ.939 కోట్ల అపరాధ వడ్డీ భారం పడడం గమనార్హం.

 

బ్యాంకర్ల నోటీసుల బాట..



రుణ మాఫీ లెక్కలు తేల్చడంతో బ్యాంకర్లు నోటీసులకు పని పెట్టారు. రుణ మాఫీ లబ్ధిదారులకు.. అఫిడవిట్‌లు ఇస్తే మాఫీ అయిన మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసి, ఆ తర్వాత అప్పు కింద జమ చేసుకుంటామంటూ ఇప్పటికే రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. పనిలో పనిగా మాఫీ అయిన మొత్తం మినహా తక్కిన రుణాన్ని చెల్లించాలని నోటీసులు జారీచేస్తున్నారు. ఒకవేళ అప్పు మొత్తం చెల్లించని పక్షంలో.. రుణాన్ని రెన్యూవల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పు చెల్లించకపోయినా.. రుణాన్ని రెన్యూవల్ చేసుకోకపోయినా అపరాధ వడ్డీ 14 శాతం కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆర్నెల్ల క్రితమే రుణమాఫీపై స్పష్టత ఇచ్చి ఉంటే.. రూ.939 కోట్ల అపరాధ వడ్డీ రైతులపై పడేది కాదని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రుణాలను ఏడు శాతం వడ్డీపై బ్యాంకులు రైతులకు ఇస్తాయి. రూ.లక్షలోపు తీసుకున్న రుణాన్ని సకాలం చెల్లిస్తే.. ఏడు శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. రూ.మూడు లక్షల్లోపు రుణం తీసుకున్న రైతులు.. సకాలంలో చెల్లిస్తే నాలుగు శాతం వడ్డీని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. రుణాలను రెన్యూవల్ చేసుకున్నా ఇవి వర్తిస్తాయి. ప్రభుత్వం రుణ మాఫీపై అప్పట్లోనే స్పష్టత ఇచ్చి ఉంటే.. కనీసం అపరాధ వడ్డీ భారం తప్పేదని.. వడ్డీ రాయితీ రూపంలో రూ.500 కోట్ల వరకూ రైతులు లబ్ధి పొంది ఉండేవారని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు.

 

బంగారం వేలం వేస్తోన్న వైనం



 జిల్లాలో 4,53,162 మంది రైతులు  బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి.. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా వ్యవసాయ రుణాలను తీసుకున్నారు. రుణాలను మాఫీ చేసి.. బంగారు నగలను విడిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఆ హామీని తుంగలోతొక్కారు. రూ.50 వేల మేర బంగారు రుణం మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. దాన్ని కూడా బుట్టదాఖలు చేశారు. బంగారు రుణాల మాఫీపై స్పష్టత రావడంతో.. మాఫీ అయిన మొత్తం మినహా తక్కిన మొత్తన్ని చెల్లించి బంగారు నగలను విడిపించుకోవాలని రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా విడిపించుకోకపోతే.. వేలం వేస్తామని స్పష్టీకరిస్తున్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటనలు కూడా జారీచేస్తున్నారు. కరవు దెబ్బకు చేతిలో చిల్లిగవ్వ లేక.. కుటుంబం గడవడమే గగనమైన దుస్థితిలో రుణం చెల్లించలేక.. బంగారు నగలను విడిపించుకోలేక రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాల్మీకిపురం మండలం చింతలవారిపల్లికి చెందిన పి.అశోక్‌కుమార్‌రెడ్డి అనే యువ రైతు ఆత్మాభిమానం చంపుకోలేక.. అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ‘భూమిని నమ్ముకున్న రైతు.. ఆ భూమిలోనే పొలయినపుడు.. అది హత్యే అవుతుంది.. ఆ హత్యకు కారకులు పాలకులు.. కాకుంటే వారి విధానాలు’ అని ప్రజాసంఘాలు స్పష్టీకరిస్తున్నాయి.

 

 గంగవరం మండలం మారేడుపల్లెకు చెందిన టి.సుబ్రమణ్యం

 



(బ్యాంకు ఖాతా నెం. 30245106889) ఎస్‌బీఐలో 2012 సంవత్సరంలో 1.12 లక్షలు బంగారంపై రుణం పొందాడు. వడ్డీ రూ.45 వేలు కలిపి.. రుణం మొత్తం రూ.1.57 లక్షలకు చేరింది. రుణ విముక్తి పథకంలో ఈ రైతుకు రూ.26,200 మాత్రమే మాఫీ అయ్యింది. తక్కిన రుణం చెల్లించాలని బ్యాంకర్లు ఇప్పటికే ఈ రైతుకు మూడు సార్లు నోటీసులు జారీచేశారు. మూడు బోర్లు వేసి ఆర్థికంగా చితికిపోయిన తనకు రుణమాఫీతో మేలు జరుగుతుందనుకుంటే.. అప్పుల ఊబిలోకి నెడుతుందని ఊహించలేదని ఆ రైతు లబోదిబోమంటున్నాడు.

 పలమనేరు మండలం జరావారిపల్లెకు చెందిన  వెంకట్రామప్ప



 (బ్యాంకు ఖాతా 11137597431) ఎస్‌బీఐలో 2011లో పాసుపుస్తకాలు తనఖా పెట్టి రూ.2 లక్షలు పంట రుణం తీసుకున్నాడు. ప్రస్తుతం  అసలు, వడ్డీ కలిపి రూ.2.60 లక్షలకు చేరింది. అయితే ఇతనికి రుణ విముక్తి పథకం కింద ఈ రైతుకు 28వేలు మాత్రమే మాఫీ అయ్యింది. ఇదేంటని బ్యాంకర్లను నిలదీస్తే.. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ నిబంధనల ప్రకారం ప్రభుత్వం మాఫీ చేసిందని చెప్పారని ఆ రైతు వాపోయారు. ఇప్పుడు తక్కిన రుణాన్ని చెల్లించాలని బ్యాంకర్లు అడుగుతున్నారని.. ఎక్కడి నుంచి తెచ్చి అప్పు తీర్చాలని ఆ రైతు కన్నీటిపర్యంతమయ్యాడు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top