హిందూ సంస్కృతి కాపాడండి


ప్రొద్దుటూరు: పాశ్చాత్య పరిస్థితుల ప్రభావానికి లోను కాకుండా హిందువులంతా చరిత్ర పుట్టినప్పటి నుంచి ఉన్న హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు నడుంబిగించాలని పరమహంస పరివ్రాజకాచార్య శ్రీకమలానంద భారతి స్వామీజీ తెలిపారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.


స్వామి వివేకానంద 26 ఏళ్ల వయసులోనే మన సంస్కృతి సంప్రదాయాల గురించి విదేశీయులకు సైతం చాటి చెప్పారన్నారు. హిందూ సంస్కృతికి భిన్నంగా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం తగదని సూచించారు. మిగతా మతాల వారు వృద్ధాశ్రమాల్లో మనకు కనిపించడం లేదన్నారు.



వారు ఆచార వ్యవహారాలను గొప్పగా పాటిస్తున్నారని తెలిపారు. అలాగే హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థ చాలా గొప్పదని వివరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లాలని తెలిపారు. మారిన పరిస్థితుల్లో కనీసం ఇంటిలో ఒక పంచనైనా ఉంచుకోవాలని, ఆలయాలకు వెళ్లేటప్పుడు పంచలను ధరించాలని సూచించారు. దురదృష్టవశాత్తు సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పనిచేస్తున్న మహిళలు తాళిబొట్లు ధరించడం లేదన్నారు. ఈ ప్రభావం కారణంగా ఉదయాన్నే పెళ్లిళ్లు, సాయంత్రానికి పంచాయితీలు జరుగుతున్నాయని తెలిపారు.



గ్రామాల్లోని కులాలకు ఎంతో చరిత్ర ఉందని, ఆ గ్రామ నిర్మాణంలో వారిది కీలక పాత్ర అని తెలిపారు. కమ్మరి, కుమ్మరి, ఉప్పర, నాయీబ్రాహ్మణ, మాల, మాదిగ, ఇలా అన్ని కులాల వారు చేతి వృత్తులపై ఆధారపడి జీవించేవారన్నారు. ఆలయాల్లో మాత్రమే దేవుళ్లకు ప్రాణప్రతిష్ట నిర్వహించడం జరుగుతుందన్నారు. మాల, మాదిగలతో సహా అన్ని కులాల వారిని ఆలయాల్లోకి ప్రవేశించేందుకు అభ్యంతరం చెప్పవద్దని తెలిపారు. మగవారంతా తప్పనిసరిగా పంచ ధరించాలని, మహిళలు బొట్టుతోపాటు గాజులు వేసుకోవాలని తెలిపారు.

 

ఆలయ భూములపై నేతల పెత్తనం:

తిరుప్పావై కోకిల శ్రీసేవా ఫౌండేషన్ అధ్యక్షురాలు మంజుల శ్రీ మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావం వల్లే నేటికీ సమాజంలో కాషాయ వస్త్రాలు కనిపిస్తున్నాయని తెలిపారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని తెలిపారు. ఎదుటివారిని గౌరవించడం, వందనం చేయడం, దానధర్మాలు, సూర్య నమస్కారం, లాంటివన్నీ మన సంప్రదాయ వ్యవహారాల్లో భాగమేనని చెప్పారు. ఆలయాలకు సంబంధించిన భూములను దేవాదాయశాఖ పరిధిలోకి చేర్చి వాటిపై రాజకీయ నాయకులు పెత్తనం చేస్తున్నారన్నారు.



దీని వలన ఆలయాల భూములు ఆరగిస్తున్నారన్నారు. గోవు ఆధారిత ఉత్పత్తులను వినియోగించాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రాంత అధ్యక్షులు ఎం.రామరాజు మాట్లాడుతూ హిందూ సమాజ నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ అవిరాళంగా కృషి చేస్తోందన్నారు. 1946లో చిన్మయానందస్వామి దీనిని స్థాపించారని తెలిపారు. 


కార్యక్రమానికి మారెళ్ల మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర బౌదిక్ ప్రముఖ్, పుట్టా శేషు, జిఘ్నానందస్వామి, అనంతానంద స్వామి, కంగనాథ స్వామి, రుక్మిణితోపాటు వేదికపై గౌరవాధ్యక్షులు డాక్టర్ సోమా లక్ష్మీనరసయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒంటే శ్రీనివాసులరెడ్డి, గీతాశ్రమం ట్రస్టు ఇన్‌చార్జి చింతా సుదర్శనరెడ్డి, మణిశయన, సాధుగోపాలకృష్ణ, చిప్పగిరి ప్రసాద్, దండపాణి శ్రీనివాసకుమార్, చీతిరాల నాగార్జునరావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top