ద్వారపురెడ్డి జగదీష్‌ను టార్గెట్ చేసిన శత్రుచర్ల వర్గం

ద్వారపురెడ్డి జగదీష్‌ను టార్గెట్ చేసిన శత్రుచర్ల వర్గం - Sakshi


సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో ఓ వర్గం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను టార్గెట్ చేసింది. ఎన్నికల సమయంలో జరిగిన అక్రమాలను బయటపెట్టడమే కాకుండా అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తోంది. దీంతో జగదీష్ అంటకాగుతున్న శత్రుచర్ల వర్గం కూడా ఇరుకున పడింది. లోపాయికారీగా నడిపిన కుమ్మక్కు రాజకీయాలకు బలైన టీడీపీ నాయకులంతా జగదీష్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు.  అటు జగదీష్‌ను, ఇటు థాట్రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు.

 

 దీనికి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ నేత పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చేతివాటం ప్రదర్శించారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పార్టీలో పెద్ద చర్చే సాగింది. కానీ, ఎన్నికలప్పుడు రచ్చకెక్కితే పార్టీకి నష్టమనే భావనతో అధిష్టానం చూసీ చూడనట్టు వదిలేసింది. మొత్తానికి ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో జగదీష్‌పై వచ్చిన ఆరోపణలన్నీ మరుగున పడిపోయా యి.

 

 అయితే, కొమరాడ, జియ్యమ్మవలస ఎంపీపీలతో పాటు, పార్వతీపురం వైస్ చైర్మన ఎన్నిక వ్యవహారంతో  జగదీష్ వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది. ఎంపీపీ ఎన్నికలప్పుడు కూడా జగదీష్ లోపాయికారీగా వ్యవహారం నడిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొమరాడ ఎంపీపీ ఎన్నికలో టీడీపీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీల అభిప్రాయం తెలుసుకోకుండా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వి.టి.జనార్దన్ థాట్రాజ్ చెప్పినట్టు నడుచుకున్నారని, దీనివెనుక పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారాయని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున బిఫారం ఇచ్చిన వ్యక్తిని కాకుండా టీడీపీ ఎంపీటీసీలంతా మరో వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. తన మాట కాదని వేరొక వ్యక్తిని ఎన్నుకుంటారా అని విప్ ధిక్కారం కింద ఎనిమిది మంది ఎంపీటీసీలపై ఫిర్యాదు చేయించారు.

 

 దీంతో వారంతా సభ్యత్వాన్ని కోల్పోయారు. జగదీష్, థాట్రాజ్ అనుసరించిన దుర్నీతికి తామంతా బలి పశువు అయ్యామని, అవతలి వ్యక్తితో ఒప్పందాలు చేసుకుని తమకు అన్యాయం చేశారని వారందరూ తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. జగదీష్‌ను టార్గెట్ చేసి ఫిర్యాదు చేశారు. జియ్యమ్మవలస ఎంపీపీ ఎన్నికల్లో కూడా  జగదీష్   అదే తరహాలో వ్యవహరించారని ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతోంది. ఈ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ నుంచి ఎనిమిది మంది, ఇండిపెండెంట్లు ఆరుగురు, వైఎస్సార్‌సీపీ తరఫున ఒకరు గెలిచారు.

 

 టీడీపీ తరఫున గెలిచిన వాళ్లంతా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ వర్గీయులుగా, ఇండిపెండెంట్‌గా గెలిచిన వారంతా థాట్రాజ్ వర్గీయులుగా కొనసాగారు. ఎంపీపీ ఎన్నికల్లో థాట్రాజ్ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించి జయరాజ్ వర్గం నుంచి ఒకర్ని లాగి ఆ వ్యక్తికే పార్టీ తరఫున బీ ఫారం తీసుకొచ్చి ఎంపీపీగా పోటీ చేయించారు. జగదీష్ తెరవెనుక పావులు కదపడం వల్లే   ఇదంతా జరిగిందని టీడీపీ తరఫున గెలిచిన వాళ్లంతా భావించారు. దీంతో వారంతా పార్టీ తరపున బీ ఫారం ఇచ్చిన వారికి కాకుండా తమలో ఒకర్ని ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీంతో థాట్రాజ్, జగదీష్ వ్యూహం బెడిసికొట్టింది. పార్టీ సూచించిన వారికి కాకుండా వేరొకరికి ఓటు వేస్తారా అని వారిపై విప్ ధిక్కారం కింద ఫిర్యాదు చేశారు.

 

 దీంతో  వారి సభ్యత్వం రద్దయింది.   దీనికంతటికీ జగదీషే కారణమని ధ్వజమెత్తుతున్నారు. లోపాయికారీగా చేసుకున్న ఒప్పందాలకు తామంతా బలి పశువులమయ్యామని వాపోతున్నారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై పార్టీ దూతలు ఆరా తీస్తున్నాయి. పార్వతీపురం వైస్ చైర్మన్ ఎన్నికలో కూడా జగదీష్ అడ్డగోలుగా వ్యవహరించారని ఆ పార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. పార్టీ జెండాను మోసిన నాయకులకు కాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుడికి వైస్ చైర్మన్ పోస్టు ఇచ్చారని మండి పడుతున్నాయి. దీని వెనుక పెద్ద కథే నడిచిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీని నమ్ముకుని ఎన్నాళ్లగానో పనిచేసిన నాయకులంతా ఆవేదన చెందుతున్నారు. వారంతా ఓ మాజీ ఎమ్మెల్యే ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 

 అయితే, జగదీష్‌పై ఒకేసారి అసంతృప్తి వర్గాలన్నీ రచ్చకెక్కడానికి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ నేత కారణమని తెలుస్తోంది.  ఎమ్మెల్సీ పదవి విషయంలో తనకు పోటీగా నిలిచారన్న ఆవేదనతో ఉన్న ఆ నేత,  అదను చూసుకుని వారిని రెచ్చగొట్టారని సమాచారం. జగదీష్ వ్యవహారమంతా ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేయించేలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈయన వ్యూహం ఫలిస్తే జగదీష్‌కు ఉన్నత పదవులు దక్కడం కష్టమే. ఇక జగదీష్‌తో కలిసి కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో   లోపాయికారీ రాజకీయాలు నెరిపారన్న విమర్శలతో శత్రుచర్ల వర్గం కూడా ఇబ్బందుల్లో పడేలా ఉంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top