శఠగోపం


కడప కల్చరల్ :

 దేవుని సొమ్మును కూడా కొంతమంది అవినీతి పరులు వదలడం లేదు.కడప నగరంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాల ఇటీవల వివాదాలకు నిలయంగా మారింది. పాఠశాల ప్రత్యేకాధికారి రామచంద్రారెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి. పాఠశాల నిర్వహణలో అవినీతి చోటుచేసుకుందన్న విమర్శల కారణంగా అధికారులు అతన్ని ఆ పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఆయనపై మరో ఆరోపణ వినిపిస్తోంది. మే నెలలో టీటీడీ  శుభప్రదం కార్యక్రమానికి సంబంధించి ఆ పాఠశాలకు అందజేసిన నిధుల్లో అవినీతి జరిగిందన్న విమర్శలు సాగుతున్నాయి.



ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన పెంచేందుకు తిరుమల-తిరుపతి దేవస్థానాలు శుభప్రదం కార్యక్రమాన్ని రెండేళ్లుగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిగల విద్యార్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా వారికి ఆధ్యాత్మిక, నైతిక విలువలను బోధించారు. తొలి విడతగా కడప నగరంలోని రామకృష్ణమిషన్, పవన్ హైస్కూలులో శిక్షణ ఇచ్చారు. రెండవ విడతగా ఈ సంవత్సరం మే నెలలో కడప నగరంలోని రామకృష్ణ మిషన్, ప్రభుత్వ క్రీడా పాఠశాల, కమలాపురంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో వారం రోజులపాటు ఈ శిక్షణ ఇచ్చారు.



తమ సంస్థలో విద్యార్థులకు వారం రోజులపాటు వసతి కల్పించినందుకు ఆయా సంస్థలకు టీటీడీ రోజుకు రూ. 10 వేలు చొప్పున ఏడు రోజులకు రూ. 70 వేలు చెల్లించింది. టీటీడీ ఏ ధార్మిక కార్యక్రమం నిర్వహించినా తమ అనుబంధ సంస్థలైన ధర్మ ప్రచార పరిషత్, ధార్మిక సలహా మండలికి నిర్వహణ బాధ్యతను అప్పగిస్తుంది. ఎప్పటిలా  పరిషత్ కో ఆర్డినేటర్ లేదా ప్రోగాం అసిస్టెంట్ ద్వారా కార్యక్రమాల నిర్వహణ, ధర్మ ప్రచార మండలి అధ్యక్ష, కార్యదర్శుల ద్వారా ఆర్థిక పరమైన చెల్లింపులు చేస్తున్నారు.



కార్యక్రమ ముగింపు రోజున నిబంధనల ప్రకారం శిక్షణకు వచ్చిన విద్యార్థులకు ఏడు రోజులపాటు వసతి కల్పించినందుకు జిల్లా ప్రచార మండలి అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల ఓబుల్‌రెడ్డి, కటారు రామసుబ్బారెడ్డి, వసతి ఇచ్చిన రామకృష్ణ మిషన్, కమలాపురంలోని డిగ్రీ కళాశాలలకు ఆయా సంస్థల పేరిట రూ. 70 వేలు చొప్పున చెల్లించారు. కానీ, ప్రభుత్వ క్రీడా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మాత్రం సొమ్మును సంస్థ పేరిటగాక తనకే నేరుగా ఇవ్వాలని కోరారు. అందుకు ధర్మ ప్రచార మండలి అధ్యక్ష, కార్యదర్శులు ఒప్పుకోలేదు.



సంస్థ పేరిట ఇవ్వాలని తమకు టీటీడీ అధికారులు సూచించారని, వ్యక్తి పేరిట ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని వారు నిర్మొహమాటంగా చెప్పారు. టీటీడీపై గల గౌరవంతో తాను  పాఠశాలను శుభప్రదం కార్యక్రమానికి వసతిగా ఇచ్చానని, దీన్ని ప్రభుత్వం వరకు తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని,  వసతి కోసం ఇచ్చే రూ. 70 వేలు సంస్థ పేరిట కాకుండా నేరుగా తనకే చెల్లించాలని ఎస్‌ఓ డిమాండ్ చేశారు.



ధర్మ ప్రచార మండలి సభ్యులు టీటీడీ అధికారులను సంప్రదించారు.సంబంధిత టీటీడీ అధికారి ఒకరు సొమ్ము ఎటూ ఇవ్వాల్సిందే గనుక ఎస్‌ఓ అడిగినట్లే ఇచ్చేయాలని సూచించారు. చేసేది లేక ధర్మ ప్రచార మండలి అధ్యక్ష, కార్యదర్శులు రూ. 70 వేలను నగదు రూపంలో ఎస్‌ఓకు అందజేశారు. ఇటీవలే టీటీటీ విజిలెన్స్ అధికారులు జిల్లాకు వచ్చి సంస్థల్లోని ఇతర సభ్యులు కార్యక్రమానికి సహకరించిన ప్రముఖులను విచారించారు.



ఆ సందర్భంగా క్రీడా పాఠశాల ఎస్‌ఓ రామచంద్రారెడ్డికి నేరుగా నగదు చెల్లించిన విషయం బయటపడింది. వారం రోజులపాటు క్రీడా పాఠశాలలో బస చేసిన విద్యార్థులకు ముప్పూటల ఆహారం అందించిన కాంట్రాక్టర్‌కు రూ. 2.50 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉండగా, ఇంతవరకు ఆ సొమ్ము చెల్లించలేదని కూడా తెలుస్తోంది.



 నిబంధనలకు వ్యతిరేకం

 వసతి కోసం చెల్లించే సొమ్మును కేవలం సంస్థల పేరిటే ఇవ్వాలని మా అధికారులు సూచించారు. అందుకే  క్రీడా పాఠశాల ఎస్‌ఓకు సొమ్ము నేరుగా చెల్లించడానికి వ్యతిరేకించాం.  ఆయన మాపై అధికారులతో చెప్పించడంతో ఇవ్వక తప్పింది కాదు.

 - ఓబుల్‌రెడ్డి, అధ్యక్షులు,

 ధర్మ ప్రచార మండలి, వైఎస్సార్‌జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top