శశిశ్రీకి కన్నీటి వీడ్కోలు


కడప కల్చరల్: ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు ఎస్‌బీ రహమతుల్లా అలియాస్ శశిశ్రీకి అభిమానులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు బుధవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న ఆయన అభిమానులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు ఉదయం 10 గంటల నుంచి కడప నగరం ద్వారకానగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.



అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు, పాత్రికేయులు, సీమ జిల్లాలకు చెందిన సాహితీవేత్తలు కూడా ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వెంట రాగా ఆయన భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో చిలకలబావి సమీపంలోని మసీదు శ్మశాన వాటికకు చేర్చారు. మత గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఖనన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయులు, స్నేహితులు ఆయనతో తమకు గల అనుబంధాన్ని స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

 

శశిశ్రీ మృతికి నివాళి


వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం తొలిపాలక మండలి సభ్యుడు, సీనియర్ పాత్రికేయుడు శశిశ్రీ మరణం పట్ల వైవీయూ వైస్ ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్, అధ్యాపక బృందం సంతాపం తెలిపారు. బుధవారం వైవీయూలో శశిశ్రీ సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ మాట్లాడుతూ  పుట్టపర్తి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన శివతాండవ కావ్యాన్ని హావభావాలతో గానం చేసిన వ్యక్తి శశిశ్రీ అన్నారు.



ఆయన్ను ఇటీవల పరామర్శించినప్పుడు అనారోగ్యం శరీరానికి కానీ మనసుకు కాదని ఎంతో నిబ్బరంగా చెప్పారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య టి. వాసంతి తదితరులు శశిశ్రీ చేసిన సాహితీసేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు ఎం. రామకృష్ణారెడ్డి, వలీపాషా, గులాం తారీఖ్, కె. కృష్ణారెడ్డి, షావలీఖాన్, జయపాల్‌గౌద్, రఘునాథరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top