చీకట్లో గ్రామాలు

చీకట్లో గ్రామాలు


విద్యుత్ బిల్లులు చెల్లించని సర్పంచ్‌లు

దశల వారీగా సరఫరా నిలిపివేస్తున్న  విద్యుత్ శాఖ

కొన్ని గ్రామాల్లో తాగునీటికి సైతం కరెంటు కట్

అయ్యన్న ఇలాకాలో ప్రజలకు తప్పని కష్టాలు

 


విశాఖపట్నం/నర్సీపట్నం : వైఎస్ హయాంలో పంచాయతీల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించేది. కిరణ్‌కుమారెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక వాటి చెల్లింపును నిలిపివేశారు. అప్పట్లో పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో పాటు బిల్లుల బకాయిలు తక్కువగా ఉండటంతో విద్యుత్ సంస్థలు పట్టించుకోలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సైతం ఈ బకాయిలు చెల్లించలేదు. సరికదా ఇక నుంచి విద్యుత్ బిల్లులు చెల్లింపు బాధ్యత పంచాయతీలదేనంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇలా బిల్లుల వ్యవహారంలో వివాదంతో పంచాయతీలన్నీ దాదాపుగా చెల్లింపులు నిలిపివేశాయి.



గతేడాది విద్యుత్ సంస్థలు పంచాయతీ పాలకవర్గాలకు నోటీసులు జారీచేశాయి. అయితే తాము అధికారంలోలేని సమయంలో వచ్చిన బిల్లులకు మాకు సంబంధం లేదంటూ ఇంత వరకు ఆ నోటీసులను సైతం పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన కొద్దిపాటి నిధులను విద్యుత్ శాఖకు చెల్లిస్తే గ్రామాల్లో  భివృద్ధి పనుల మాటేమిటని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. బిల్లు మొత్తం చెల్లించనక్కర్లేదని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన వాటిలో కొంత కడితే సర్వీసులు పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు బదులిస్తున్నారు. ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ పరిధిలో పంచాయతీల బకాయిలు రూ.52.39 కోట్లు ఉన్నాయి. హుద్‌హుద్ ధాటికి కుదేలైన విద్యుత్ శాఖను ఆదుకుంటామని ముందుకు వచ్చిన ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) తాము సాయం చేయాలంటే విశాఖలో ఉన్న విద్యుత్ బకాయిలన్నింటినీ నూరుశాతం వసూలు చేయాల్సిందేనని షరతు పెట్టింది. దీంతో ఆ శాఖ  ఉన్నతాధికారులు  బకాయిలపై దృష్టి సారించారు. రెండు రోజుల క్రితం అధికారులతో సమీక్ష జరిపిన సంస్థ సీఎండీ ఆర్. ముత్యాలరాజు కూడా మొండి బకాయిలను వసూలు చేసి సంస్థ ఆదాయం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు  నర్శీపట్నం డివిజన్‌తో పాటు జిల్లాలోని అనేక పంచాయతీలకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. డిసెంబర్ 16నే పంచాయతీలకు నోటీసులిచ్చారు. అయినా సర్పంచ్‌లు పట్టించుకోలేదు. 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి.



వాటితో విద్యుత్ బిల్లులు సర్దుబాటు చేయాలంటూ డీఎల్‌పీవోలకూ నోటీసులిచ్చారు. డీఎల్‌పీవోలకూ  నోటీసిచ్చారు. వారి నుంచీ స్పందన లేకపోవడంతో సరఫరా ఆపేశారు. కొన్ని పంచాయతీల్లో వాటర్ వర్క్స్‌కు కూడా విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఉదాహరణకు నర్సీపట్నం మండలం గురందొరపాలెంలో మూడు రోజులుగా తాగునీటి పథకానికి సరఫరా నిలిపివేశారు. నీలంపేట పంచాయతీ రూ.10లక్షలు, గురందొరపాలెం రూ.4.32లక్షలు బకాయిలు కట్టాలని విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేశారు.  దీంతో స్థానిక ప్రజలు చేతి పంపులను. పొలాల్లోకి వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. దీనిపై అధికారులను పాలకవర్గాలు ప్రశ్నించినా బకాయిలు చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తామంటూ తెగేసి చెబుతున్నారు.



రాజకీయ వివక్ష : విద్యుత్ సరఫరా నిలుపుదలలోనూ విద్యుత్ సంస్థల అధికారులు రాజకీయ వివక్షను ప్రదర్శిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ గెలిపొందిన గ్రామాలకు తాగునీటితో పాటు వీధిలైట్లుకు విద్యుత్ సరఫరా నిలిపివేయగా, అధికార పార్టీ పాలకవర్గాలున్నచోట మాత్రం బకాయిలు వసూలును పట్టించుకోకుండా నిరభ్యంతరంగా కరెంటు ఇస్తున్నారు. అధికారి పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాట్లు తెలుస్తోంది. సాక్షత్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇలాకాలోని గ్రామాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top