సారా ఏరులు

సారా ఏరులు - Sakshi

  •     మూడు పీపాలు, ఆరు క్యాన్లుగా వెలిగిపోతున్న తయారీదారులు

  •      కిరాణా దుకాణాలకు సరఫరా

  •      గుట్టుగా అమ్మకాలు

  • విశాఖపట్నం: బెల్టు దుకాణాలపై ఎక్సయిజ్ శాఖ దాడులు పెరగడంతో మందుబాబులు సారా బాట పడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సారా ప్యాకెట్లను ద్విచక్రవాహనాల్లో తరలిస్తూ విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణాలకు సరుకులను సరఫరా చేసినట్టు బ్యాగుల్లో సారా ప్యాకెట్లను నింపి బైకుల పై సంచరిస్తూ విక్రయిస్తున్నారు. చౌకగా లభించడం, తక్కువ మోతాదుకే ఎక్కువ కిక్ ఇస్తుండటంతో పల్లెల్లో దొరికే సారాకు మద్యం ప్రియులు ఎగబడుతున్నా రు. జిల్లాలో ఇప్పటికే 97 మద్యం దుకాణాలకు వ్యాపారులు  ముందుకు రాలేదు. దీంతో ఆ వ్యాపారాన్ని సారా ముఠా చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఎక్సయిజ్ శాఖ కళ్లుగప్పి సారా వ్యాపారాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు చక్రం తిప్పుతోంది.

     

    పెరుగుతున్న సారా కేసులు : జిల్లాలో కొంతకాలంగా సారా కేసులు పెరుగుతున్నాయి. జూలైలో భారీగా కేసులు నమోదు కావడం ఎక్సయిజ్ శాఖకు తలనొప్పిగా పరిణమించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 720 మందిపై సారా కేసులు పెడితే, జూలై ఒకటి నుంచి 23 మధ్య 424 కేసులు నమోదయ్యాయంటే సారా విక్రేతల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతోందో ఊహించుకోవచ్చు. న ర్సీపట్నం, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, పాడేరు, అరుకు, చింతపల్లి, అనకాపల్లిలోని కొన్ని ప్రాంతాల్లో సారా విక్రేతలు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. పాడేరు, చింతపల్లి, సీలేరు ప్రాంతాల్లో సారాను కాచి ప్యాకెట్లలోకి నింపుకుని చెక్‌పోస్టులు లేని మార్గాల్లో కావిళ్లతో గ్రామాల్లోకి రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి చిన్నచిన్న ప్యాకెట్లలోకి సారా పోసి వాటిని కిరాణా వర్తక వ్యాపార సంచుల్లో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా పైపైన చిరుతిళ్లను పెట్టి పల్లెల్లోకి సరఫరా చేస్తున్నారు.

     

    పట్టించుకోని యంత్రాంగం

     

    పల్లెల్లో యథేచ్ఛగా సారా అమ్మకాలు సాగుతున్నా అధికార యంత్రాంగం మౌనవ్రతం చేస్తోంది. గాజువాక పారిశ్రామిక వాడల్లోనూ ఈ వ్యాపారం ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. రాత్రి విధులు ముగించుకుని ఉదయాన్నే ఇంటిబాట పట్టేవారికి, ఇంటి నుంచి రాత్రి విధులకు వెళ్లేవారికి మార్గమధ్యంలోనే ఈ దుకాణాలు ఆహ్వానాలు పలుకుతున్నాయని మందుబాబులు చెప్పుకుంటున్నారు.

     

    252 మందికి రిమాండ్



    బెల్ట్ దుకాణాలు నిర్వహించే గ్రామీణులు కొందరు సారా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే అరెస్టు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలిస్తుండటంతో వారంతా ఈ వ్యాపారంలోకి వెళ్లినట్టు తెలిసింది. రెండు మాసాల్లో జిల్లాలోని 246 బెల్ట్ దుకాణాలపై కేసులు నమోదు చేసి 252 మందిని రిమాండ్‌కు తరలించారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top