సారాల!

సారాల!


చీరాలకు చిన ముంబైగా పేరుంది. అంటే ఇక్కడ నిత్యం ముంబై తరహా వ్యాపారం జరుగుతోంది కాబోలు..అని కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరైనా ఊహిస్తారు! ఇప్పుడు చిన్న ముంబై స్థానంలో మరో పేరు తెరపైకి వస్తోంది. అదే.. సారాల..! సారా అంగళ్లు సందు సందుకూ.. గొంది గొందికీ పుట్టుకొచ్చాయి. పట్టణంలో సారా పరవళ్లు తొక్కుతోంది. దీని తయారీదారులను సారా సామ్రాట్లు, సారా కింగ్‌లుగా పిలుస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు చీరాల.. సారాలగా మారిందంటూ పట్టణ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- చీరాలను సారాలగా మార్చుతున్న సారా సామ్రాట్లు

- స్టూవర్టుపురం నుంచి నిత్యం యథే చ్ఛగా రవాణా

- కాపుసారా మత్తులో బడుగులు, కూలీలే అధికం

- నిద్రనటిస్తున్న పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు

చీరాల :
చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలో సారా పరవళ్లు తొక్కుతోంది. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న స్టూవర్టుపురం నుంచి వేల లీటర్ల నాటుసారా యథేచ్ఛగా వస్తోంది. అక్కడి నుంచి చీరాల ప్రాంతంలో ఉన్న వివిధ గ్రామాలు, ప్రాంతాల్లో ఉన్న సారా అంగళ్లకు చేరుకుంటుంది. ఇక్కడ ఎక్కువగా నివసించేది బడుగులే. కాయకష్టం చేసుకుంటూ కుటుంబాలను భారంగా నెట్టుకొస్తుంటారు. 



మద్యం కొనలేక..

కూలీలకు మద్యం కొనుగోలు చేసి తాగే ఆర్థిక స్థోమత ఉండదు. ప్రత్యామ్నాయ మార్గంగా తక్కువ ధరకు వచ్చే సారా వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఇక్కడ సారా పరవళ్లు తొక్కుతోంది. చీరాలకు కూతవేటు దూరం..అంటే సరిగ్గా ఐదు కిలోమీటర్లలోపే స్టూవర్టుపురం ఉంది. ఉదయం విజయవాడ వైపు వెళ్లే ప్యాసింజర్ స్టూవర్టుపురంలో ఆగినప్పుడు చూస్తే ఏదో పెద్ద జాతర జరుగుతున్నట్లు కనిపిస్తుంది.   

 

సారా ఉత్పత్తి కేంద్రం స్టూవర్టుపురం


రాష్ట్రస్థాయి, అంతర్‌రాష్ట్ర స్థాయి దొంగలకు స్టూవర్టుపురం ఒకప్పుడు పెట్టింది పేరు. ప్రస్తుతం దొంగతనాలకు వెళ్లటం మానేసిన కొందరు మాజీ నేరస్తులు కొన్నేళ్లుగా నాటుసారా తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఏదో చాటుమాటుగా కాకుండా ఇళ్ల వద్దే సారా కాస్తున్నారు. రోజూ నాటుసారా కాచి స్టూవర్టుపురం రైల్వేస్టేషన్‌తో పాటు బేతపూడి సమీపంలో మల్లె తోటల వద్ద బహిరంగంగా విక్రయిస్తున్నారు.

 

ఇవిగో..కేంద్రాలు

చీరాల, రామ్‌నగర్, ఆదినారాయణపురం, సాయికాలనీ, తోటవారిపాలెం వీవర్స్‌కాలనీకు చెందిన కొందరు స్టూవర్టుపురంలో కాచే సారాను ఐదు లీటర్ల క్యాన్ రూ.400లకు కొనుగోలు చేసి మందుబాబులకు గ్లాస్ రూ.10, క్వార్టర్ రూ.20 నుంచి 30 చొప్పున విక్రయిస్తున్నారు. చీరాల ప్రాంతంలోని దండుబాట, స్వర్ణరోడ్డు, జాలమ్మగుడి, ఉజిలీపేట, శృంగారపేట, గాంధీనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్, రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో కూడా సారా నిత్యం అందుబాటులో ఉంటోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top