దేశంలో ఇసుక తుపాను


హయాతినగరం ఇసుక రీచ్‌పై తమ్ముళ్ల గుర్రు

అధిష్టానానికి ఫ్యాక్స్‌ద్వారా ఫిర్యాదులు

మల్లగుల్లాలు పడుతున్న సీనియర్ నాయకులు

రీచ్ ఎత్తేయాలంటూ

పెరుగుతున్న ఒత్తిడి




సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లా కేంద్రంలో ఏర్పాటైన హయాతినగరం ఇసుకరీచ్ మొత్తమ్మీద తెలుగుదేశం పార్టీలో అంతర్గత వివాదాలకు కారణమైంది. ఇక్కడ జరుగుతున్న దందా... అందులో పార్టీ నాయకులకు అందుతున్న వాటాలపై దిగువస్థాయి శ్రేణులు అధిష్టానానికి ఫ్యాక్స్ పంపించినట్టు తెలుస్తోంది. అంతేగాకుండా రేవును తక్షణమే తరలించేయాలంటూ కలెక్టరేట్ సహా, మెప్మా, డీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడికూడా తెస్తున్నారు. మహిళా సంఘాల పేరిట ఏర్పాటైన ఇసుక రీచ్ టీడీపీ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. బల్క్ ఆర్డర్ పేరిట భారీగా ఇసుక తరలిపోవడం, రాత్రి వేళల్లో అక్రమంగా రవాణా కావడం, నిబంధనల కంటే అధికంగా వాహనాల్లో లోడ్ చేసేయడాల్ని ఇక్కడి తమ్ముళ్లే ఆక్షేపిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న తంతును ఓ నివేదిక ద్వారా అధిష్టానానికి ఫ్యాక్స్ పంపించినట్టు తెలిసింది. మరోవైపు జిల్లా మంత్రి, విప్‌లిద్దరూ పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్‌లను తెప్పించుకుని పరిశీలించినట్టు సమాచారం. ఇసుక రేవులో మహిళా సంఘాల సభ్యులతో పాటు అక్కడి దందాను ప్రశ్నించడానికి వచ్చేవారిని నిర్వాహకులు ఫోటోలు, వీడియోలు తీయడమేంటని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తే అందుకు విరుద్ధంగా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో నడుస్తున్న 9రీచ్‌ల్లోనూ



మొత్తం వ్యవహారాల్ని బయటపెట్టాలని, అధికారికంగా ఎంత మొత్తంలో విక్రయాలు జరిగాయో చెప్పాలంటూ నేతలపై ఒత్తిడి పెరుగుతుండడంతో కొన్ని రీచ్‌ల నిర్వహణల్ని కొన్నాళ్లపాటు తాత్కాలికంగా మూసేయాలన్న డిమాండ్ రోజురోజుకూ అధికమవుతోంది.పక్కాగా దొంగ పద్దులు : ఎవరైనా రీచ్ పరిశీలనకు వస్తే తామంతా పక్కాగా లెక్కలు, రికార్డులు నిర్వహిస్తున్నామని అక్కడి నిర్వాహకులు పద్దులు చూపుతున్నారు. కానీ లెక్కకుమించి ఇసుకను తరలించడం. బినామీ పేర్లతో ఇసుకను కొనుగోలు చేయించడం, విక్రయించడం వంటివి టీడీపీలో ఓ వర్గం అదే పనిగా చేస్తోంది. ఇసుక విక్రయాలపై వచ్చే వాటాలు భారీ స్థాయిలో నేతలకు అందుతోంది. అన్నీ పార్టీ పెద్దల అనుయాయులకే అప్పగించి తమను పూర్తిగా పక్కన పడేస్తున్నారనీ, పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లుగా ఉంటున్నా తమకేమీ అవకాశాలు కల్పించడంలేదని గగ్గోలు పెడుతున్న పార్టీలోని ఓ వర్గం ఇప్పుడు వివాదాన్ని రచ్చచేస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top