సిమెంట్ రోడ్ల ముసుగులో ఇసుక అక్రమ రవాణా

సిమెంట్ రోడ్ల ముసుగులో ఇసుక అక్రమ రవాణా - Sakshi


 అథారిటీ అధికారి అనుమతి లేకుండా తరలింపు

 పట్టించుకోని రెవెన్యూ అధికారులు, పోలీసులు


 

రామసముద్రం
: మండల పరిధిలోని పంచాయతీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల భాగస్వామ్యంతో వేస్తున్న సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు అనుమతి లేకుండానే ఇసుక తరలిపోతుంది. పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చిన అంచనా పత్రాన్ని చూపిస్తూ ఒక ట్రాక్టర్ ఇసుకను సిమెంట్ రోడ్లకు తోలి, నాలుగు లోడ్లు పట్టణాలకు, కర్ణాటక ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.




 రూ.1.24కోట్లకు సిమెంట్ రోడ్లు మంజూరు..

మండలంలోని 18 పంచాయతీల్లో రూ.1.24కోట్లతో 3.176కిలోమీటర్ల దూరం సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి గాను 50పనులు మంజూరయ్యాయి. వీటిలో 50 శాతం పంచాయతీ, 50శాతం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు ఉంటాయి. ఇప్పటి వరకు 17పనులు పూర్తి చేశారు. రూ.18లక్షలు బిల్లులు కూడా అయిపోయాయి. ఈ పనులకు 600 ట్రాక్టర్ లోడ్లు ఇసుక, 1,200 లోడ్ల 20(ఎంఎం)కంకర, 15వేల బస్తాల సిమెంట్ అవసరమని అధికారులు ప్రతిపాదించారు.



 అంచనాకు మించి ఇసుక రవాణా..

మండలంలో మంజూరైన పనులకు 600లోడ్లు ఇసుక అవసరముండగా సగం పనులు పూర్తికాకనే రెట్టింపు తరలిపోయింది. పీఆర్ అధికారుల అనుమతి లేని నకిలీ ట్రాక్టర్లు, ఇసుక అక్రమ వ్యాపారులు కూడా ఇసుకను తరలిస్తున్నారు. ప్రశ్నిస్తే సిమెంట్ రోడ్డుకని చెప్పి తప్పించుకుని ట్రాక్టర్ రూ.1500 నుంచి రూ.2వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చెంబకూరు, మూగవాడి, ఎలవానెల్లూరు, అక్కగార్లకుంట, అరికెల, రాగిమాకులపల్లె, నారిగానిపల్లె తదితర ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, వంకలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ, పట్టా భూముల్లో నుంచి జోరుగా రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తోడుతున్నారు. పుంగనూరు, మదనపల్లె, కర్ణాటక రాష్ట్రం బేడపల్లె, సోమయాజులపల్లె తదితర ప్రాంతాలకు వందల లోడ్లు తరలించి డంపింగ్‌లు చేసి అక్కడి నుంచి లారీల్లో బెంగళూరుకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పలుచోట్ల ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఇటీవల మదనపల్లె తహశీల్దార్ వద్ద అనుమతి పొంది ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తుండటంతో టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇసుక రవాణాదారుల మధ్య పెద్దయెత్తున వాగ్వాదం చోటుచేసుకుంది.



 ఇసుక అనుమతి పొందాల్సింది ఇలా..

గ్రామాల్లో వేస్తున్న సిమెంట్ రోడ్లకు ఇసుక సరఫరాకు ఎంపీడీవో అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఏ ప్రదేశం నుంచి ఎక్కడకు తోలుతున్నారు.. ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్ నంబరు... డ్రైవర్ పేరు.. ఏ పనులకు తోలుతున్నారు...ఎన్ని లోడ్లు అవసరం ఉంది.. ఎన్ని రోజుల్లో ఇసుక తోలాలి అనేది ఎంపీడీవో నిర్ధేశించి అనుమతి పత్రాన్ని ఇవ్వాలి. ఇప్పటివరకు ఒక్కరు కూడా అనుమతి పొందిన దాఖలాలు లేవు. దీనిపై ఏంపీడీవో దయానందంను వివరణ కోరగా ఇప్పటివరకు తన వద్దకు అనుమతి కోసం ఒక్కరు కూడా రాలేదన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top