ఖాకీ ‘రాజీ’కీయం!

ఖాకీ ‘రాజీ’కీయం! - Sakshi


పోలీసులు ప్రజలకు స్నేహితులు. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలు పరిరక్షించాలి.. పోలీస్ బాస్‌లు తమ సిబ్బందికి నిరంతరం నూరిపోసే సూక్తులు ఇవే. కానీ ఆ స్టేషన్‌లో అంతా రివర్స్‌లో సాగుతోంది. పంచాయితీలు, రాజీలు, సెటిల్‌మెంట్లు, వసూళ్లు.. ఇవే అక్కడ నిత్యం జరిగే తతంగాలు. అసలు విధుల కంటే కొసరు విధులపైన అమితమైన శ్రద్ధ చూపిస్తూ జీతం కంటే గీతం ఎక్కువ దండుకుంటున్నారు. రాత్రి గస్తీలు మాని.. చీకటి దందాలకు దన్నుగా నిలుస్తున్నారు. త్రివేణి సంగమమైన ఈ ప్రాంతంలో నదుల్లో ఇసుక దోపిడీదారులకు కొమ్ముకాస్తూ ట్రాక్టర్‌కు ఇంత.. అని రేటు నిర్దేశించి వసూలు చేస్తున్నారు. వీటన్నింటితో భౌగోళికంగా ఒక మూలనున్న వంగర స్టేషన్ పేరు మార్చుకొని సెటిల్‌మెంట్ స్టేషన్‌గా మారిపోయింది.

 

 వంగర:రాజీలు కుదర్చడం.. ఆ పేరుతో రెండువైపులా డబ్బు గుంజడం, ఇసుక, కలప అక్రమ రవాణాదారులకు అండ నిలవడంలో సిద్ధహస్తులమని నిరూపించుకుంటున్నారు వంగర పోలీసులు. మండల పరిధిలో నాగావళి, వేగావతి, సువర్ణముఖి నదులు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం పట్టణ ప్రాంతాలకు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు ట్రాక్టర్ల యజమానులతో డీల్ కుదుర్చుకున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ. 3 వేలు వసూలు చేస్తూ రవాణాకు పచ్చ జెండా ఊపేశారు. మండలంలో ఇసుక ట్రాక్టర్లు 30 వరకు ఉన్నాయి, అయితే పక్కనున్న రేగిడి, రాజాం మండలాల నుంచి వస్తున్న ట్రాక్టర్ల నుంచీ నెలవారీ కమీషన్ వసూలు చేస్తూ ఇసుక దోపిడీకి అనుమతిస్తున్నారు. అవసరమైతే ఈ విషయం లో బెదిరింపులకూ వెనుకాడటం లేదు.

 

 కలప, గ్రానైట్ రవాణాకూ ఆసరా

 ఈ స్టేషన్ పరిధిలో కలప అక్రమ రవాణా కూడా ఎక్కువే. పార్వతీపురం, గరుగుబిల్లి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదిత ర ప్రాంతాల నుంచి నిత్యం అక్రమ కలప రవాణా అవుతోంది. రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల్లో విలువైన కలపను వంగర పోలీస్ స్టేషన్ మీదుగానే తరలిస్తున్నారు. ఈ వాహనాల నుంచి కూడా డబ్బులు వసూలు చేసి అక్రమ రవాణాను చూడనట్లే వదిలేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి కూడా నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడ్లతో గ్రానైట్ బ్లాకులను తరలిస్తున్నా ఏమాత్రం అడ్డుకోవడం లేదు.

 

 పంచాయితీలతో కాసుల పంట

 ఇక సివిల్, క్రిమినల్ అన్న తేడా లేకుండా.. కుటుంబ తగాదాలు, భూ తగాదాలు, కొట్లాటలు, భార్యాభర్తల వివాదాలు వంటి ప్రతి వ్యవహారాన్ని ఈ స్టేషన్ సిబ్బంది వదలడం లేదు. రాజీలు, సెటిల్‌మెంట్ల పేరుతో ఇరువర్గాల నుంచి డబ్బులు గుంజేస్తున్నారు.  న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తే జేబుకు చిల్లులు పడుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అయితే పోలీసులంటే భయంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. గతంలో జరిగిన కొన్ని ఉదంతాలు పరిశీలిస్తే..


  కొన్నాళ్ల క్రితం ఓ మహిళ ప్రమాదవశాత్తు గాయపడి మరణించింది. ఈ కేసు దర్యాప్తు విషయంలో మౌనం వహించిన స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు ఇవ్వాలంటూ సంబంధితుల నుంచి రూ. 10 వేలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్తమరువాడ గ్రామంలో రెండు నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఫిర్యాదు అందినా కేసు నమోదు చేయకుండా.. రాజీ కోసం దాదాపు ఒక రోజంతా మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచేశారని ఆ ప్రాంతప్రజలు ఆరోపిస్తున్నారు.

 

  మడ్డువలస సమీపంలో రోడ్డుపై గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న ఓ వ్యక్తి రాజాం ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందినా ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేయలేదు.  లక్ష్మీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. వాటి నిర్మాణం పేరుతో మండలంలోని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వ్యాపారస్తులు, వాహన యజమానుల నుంచి రూ. 3 లక్షలు వసూలు చేశారని సమాచారం.  ఇవే కాకుండా  పోలీస్‌స్టేషన్‌కు వచ్చే చిన్న తగాదాలు, కుటుంబ వివాదాలు.. ఇలా విషయం ఏదైనా.. కేసు నమోదైనా.. రాజీ అయినా వసూళ్ల పంట పండించుకుంటున్నారు. బెల్టు షాపుల నుంచి ఆటోలు, చిరు వ్యాపారుల వరకు అందరూ మామూళ్లు బాధితులే కావడం విశేషం.

 

 ఓ బాస్...ఇద్దరు కానిస్టేబుల్స్...

 వంగర స్టేషన్‌లో 20 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. అయినా రాత్రి గస్తీలు ఎక్కడా కనిపించవు. అసలు విధులపై పెద్దగా శ్రద్ధ చూపరు. కాగా అక్రమ దందాల వ్యవహారమంతా బాస్ కనుసన్నల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు చక్కబెడుతూ చక్రం తిప్పుతున్నారు. ఓ కానిస్టేబుల్ విధులు వదిలిపెట్టి నిత్యం మఫ్టీలో తిరుగుతూ వసూళ్ల దందా సాగిస్తుంటారు. ఎదురుతిరిగిన వారిని బాస్ దగ్గరకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇప్పించి వసూళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తుంటారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top