ఇసుక రాబడి...అదుర్స్


రొయ్యూరు రీచ్ ద్వారా  రూ. 5.50 కోట్ల ఆదాయం

ముగిసిన ఆన్‌లైన్ బుకింగ్

రీచ్ రెన్యువల్‌కు అధికారుల పరిశీలన


 

తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు ఇసుక రీచ్ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. కేవలం 53 రోజుల వ్యవధిలో ఇసుక విక్రయాల ద్వారా రూ.5.50 కోట్ల ఆదాయం అందించింది. మహిళా మ్యాక్స్ కమిటీల ద్వారా నడిచిన ఈ రీచ్‌లో ఇసుక విక్రయాలు తొలి నెల మందకొడిగా నడిచినా పెదపులిపాక, శ్రీకాకుళం క్వారీలు  మూతపడిన అనంతరం ఊపందుకున్నాయి.  

 

తోట్లవల్లూరు : రొయ్యూరు ఇసుక రీచ్ ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. 53 రోజుల్లో ఇసుక విక్రయాల ద్వారా రూ.5.50 కోట్ల ఆదాయం లభించింది. ఇసుక పాలసీలో మార్పులు చేసి వేలం విధానానికి స్వస్తిచెప్పి, మహిళామ్యాక్స్ కమిటీల ద్వారా ప్రభుత్వం క్వారీల నిర్వహణ చేపట్టిన విషయం విదితమే. ఈ ఏడాది ఫిబ్రవరి 24న కలెక్టర్ బాబు.ఎ ఈ క్వారీని ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 80,947 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వి విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొదటి నెల రోజులు మందకొడిగా సాగిన ఇసుక ఎగుమతులు, పెదపులిపాక, శ్రీకాకుళం క్వారీలు మూతపడిన అనంతరం బాగా ఊపందుకున్నాయి. కేవలం 53 రోజుల వ్యవధిలో రూ.5.50 కోట్ల ఆదాయం సమకూరింది.



మరో వారంపాటు క్వారీయింగ్



ఇసుక విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం పూర్తి కావడంతో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ నిలిచిపోయింది.  80 వేల క్యూబిక్ మీటర్లపైగా ప్రభుత్వం నుంచి అనుమతులురాగా, ఇప్పటికే 70 వేల క్యూబిక్ మీటర్లకు పైగా ఎగుమతులు పూర్తయ్యాయి. మరో పదివేల క్యూబిక్ మీటర్లకు సంబంధించి బుకింగ్ పూర్తవడంతో, ఆన్‌లైన్ బుకింగ్ శుక్రవారం రాత్రి 11 గంటలతో నిలిచిపోయింది. బుకింగ్ పూర్తయిన పది వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఎగుమతులు జరిగేందుకు మరో వారం రోజులపాటు క్వారీ నడిచే అవకాశం ఉంది.



మరో 20 ఎకరాలకు అవకాశం...?



ఈ క్వారీలో మరో ఇరవై ఎకరాల్లో ఇసుక తవ్వకాలు జరిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం క్వారీని సందర్శిం చిన జిల్లా శాండ్ కమిటీ మరో 20 ఎకరాల్లో ఇసుక తీసేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తిం చింది. సంబంధిత విస్తీర్ణానికి సర్వే జరిపి, పూర్తి వివరాలతో నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను కోరింది. దీంతో తహశీల్దార్ జి.భద్రు నేతృత్వంలో సర్వే అధికారులు శనివారం ఈ క్వారీకి హద్దులు గుర్తించి, సర్వే పనులను చేపట్టారు. మరో ఇరవై ఎకరాలకు అనుమతులు వస్తే ఇసుక ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top