రౌడీయిజం అంతు చూస్తా

రౌడీయిజం అంతు చూస్తా - Sakshi


శ్రీకాకుళం క్రైం: రౌడీయిజం అంతు చూస్తానని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎ.ఎస్.ఖాన్ అన్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో పరిపాలన విభాగం డీసీపీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చిన ఆయన, ఇప్పటివరకు ఎస్పీగా ఉన్న నవీన్ గులాఠీ నుంచి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రౌడీయిజాన్ని సమూలంగా రూపుమాపుతానన్నారు. ఇసుక మాఫియాపై గనుల శాఖ నుంచి ఫిర్యాదు అందితే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భూ కబ్జాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూకబ్జాదారులకు కొందరు ఎస్సైలు, సీఐలు కొమ్ముకాస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ వారిపైన డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారని..

 

 బాధితులు న్యాయం కోసం ఎవరినైనా సంప్రదించవచ్చని బదులిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ప్రశాంతతకు మారుపేరని వ్యాఖ్యానించారు. రాయలసీమ వైపు నుంచి వచ్చే అధికారులు తమ పనితీరు మార్చుకోవలసి ఉంటుందన్నారు. ఎందుకంటే అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, అది తమ బాధ్యతని తెలిపారు. కడపకు బదిలీపై వెళ్తున్న నవీన్ గులాఠీకి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. నవీన్ గులాఠీ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఎస్పీ ఖాన్ గతంలో మంచి విజయాలు సాధించారని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటారన్నారు.

 

 జిల్లా ప్రజలు చాలా మంచి వాళ్లని, వారిని విడిచిపెట్టి వెళ్లటం బాధకరమైనా విధి నిర్వహణలో బదిలీలు తప్పవని వ్యాఖ్యానించారు. జిల్లా ప్రజలు, నాయకులు, మీడియా వారు తనకు ఎంతో సహకరించారని అన్నారు. తన హాయంలో వరుస ఎన్నికలు సవాల్‌గా మారని, అయితే పక్కా ప్రణాళికతో విజయం సాధించామన్నారు. దేవుని దయ వల్ల జిల్లాలో తాను విధులు నిర్వహించినంత కాలం ఎటువంటి ఇబ్బం దులు రాలేదని తెలిపారు. తాను విధులు నిర్వహించిన ప్రాంతాలన్నింటిలోకి శ్రీకాకుళం జిల్లా ఎంతో ప్రశాంతమైనదని చెప్పా రు. గతంలో తాను విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా పనిచేశానని, ఉత్తరాంధ్ర  ప్రజలు ఎంతో మంచివారని చెప్పారు.

 

 కొత్త ఎస్పీకి పోలీస్ యంత్రాంగం స్వాగతం

 కొత్త ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు జిల్లా పోలీసు యంత్రాంగం ఆదివారం ఘనంగా స్వాగతం పలికింది. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ కార్యాలయానికి వచ్చి ఎస్పీని కలిసి పరిచయం చేసుకున్నారు. ఇదే సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎస్పీ నవీన గులాఠీకి ఘన వీడ్కోలు పలికారు. తనను ఇంత వరకు సహకరించినందుకు గులాఠీ జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top