ఇసుక క్వారీల్లో ఆగని దందా

ఇసుక క్వారీల్లో ఆగని దందా


కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలింపు

పట్టించుకోని ఉన్నతాధికారులు

ప్రశ్నించిన మ్యాక్స్ సొసైటీ  అధ్యక్షురాళ్లకు హెచ్చరికలు

 గుంటుపల్లి ఇసుక రీచ్‌పై విచారణ చేసిన సబ్ కలెక్టర్

 


విజయవాడ :  జిల్లాలో ఇసుక అక్రమ దందా ఆగ లేదు. అధికార పార్టీ అండ చూసుకుని కొందరు రెచ్చిపోతున్నారు. ప్రజల ప్రాణాలు కూడా హరిస్తున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు. అధికారులు కూడా వీరి దందాకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. మహిళా మ్యాక్స్ సొసైటీల ముసుగులో వీరి దందా మరీ ఎక్కువైంది. ఇసుక క్వారీలు ఉన్న గ్రామాల్లో మహిళా డ్వాక్రా సంఘాలను రంగంలోకి దించిన ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేవారిలో కొందరిని ఎంపిక చేసి మ్యాక్స్ సొసైటీలుగా ఏర్పాటుచేసింది. ఈ సొసైటీల్లో డ్వాక్రా సంఘాల సభ్యులను చేర్చి వారితో ఇసుక వ్యాపారం చేయిస్తున్నట్లు చెప్పింది. అయితే ఇది నటనేనని అక్కడి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. మ్యాక్స్ సంఘాలతో రికార్డులు రాయించి ఎవరైతే దందాదారులు ఉన్నారో వారే ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు.



ఒకే బిల్లుపై 20 నుంచి 30 లారీల ఇసుక విక్రయం



ఇసుక రీచ్‌ల్లో లారీ ఇసుకకు బిల్లు తీసుకుని దాదాపు 20 నుంచి 30 లారీల ఇసుకను అదే బిల్లుపై యథేచ్ఛగా విక్రయించుకుని కొందరు సిండికేట్లు కోట్లు గడిస్తున్నారు. దీనికి పంచాయతీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరించటంతో అక్రమ వ్యాపారం లక్షల స్థాయి నుంచి కోట్లకు చేరింది. ఇదంతా అక్రమంగా సాగుతుందని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకూ తెలుసు. ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి ఇసుక రీచ్‌లో అక్రమ దందా సాగుతూనే ఉంది. ఇసుక రీచ్‌ను బోట్స్‌మెన్ సొసైటీ గతంలో నిర్వహించింది. ప్రస్తుతం ఈ బాధ్యతను గుంటుపల్లి శాండ్ మైనింగ్ ఉమెన్స్ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీకి ప్రభుత్వం ఇచ్చింది. ఇసుకను నది నుంచి బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులకు చెందిన పడవల్లో తీసుకువస్తారు.



అందుకు గానూ వారికి లేబర్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్న లారీ లోడ్‌కు రూ.3,900గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. లారీ లోడ్‌కు లేబర్ చార్జ్ కింద రూ.1,380 బోట్స్‌మెన్ సొసైటీకి ఇస్తారు. నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మహిళా సంఘం కమీషన్ తీసుకుని మిగిలిన డబ్బును ప్రభుత్వానికి చెల్లిస్తుంది. నదీ ప్రవాహం ఇక్కడ 365 రోజులూ ఉండటంతో నాణ్యమైన ఇసుక లభ్యమవుతుంది. బోట్స్‌మెన్ సొసైటీలోని కొందరు సభ్యులు చక్రంతిప్పి అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ఇదేమిటని ప్రశ్నించిన ఇక్కడి మ్యాక్స్ సంఘం అధ్యక్షురాలిని ఇటీవల   బెది రించారు. అధ్యక్షురాలి ఫిర్యాదు మేరకు గతనెలలో సబ్ కలెక్టర్ నాగలక్ష్మి విచారణ నిర్వహించారు.



అక్రమాలు ఇలా...



మహిళా సంఘం పర్యవేక్షణలో ఇసుక రీచ్‌లో కంప్యూటర్లు ఉంటాయి. కంప్యూటర్లపై పనిచేసేందుకు సంఘం ఆపరేటర్లను నియమించుకోవాలి. మ్యాక్స్ సొసైటీ ఇస్తున్న బిల్లు ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదుకావటం లేదు. నిత్యం ఈ రీచ్ నుంచి 70 లారీల ఇసుక తరలుతుంటే 20 వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో రశీదులు నమోదవుతున్నాయి. అధికారికంగా నమోదు చేస్తున్న లారీల్లో కూడా తేడాలు వస్తున్నాయి. ఒకే బిల్లును రెండు మూడుసార్లు నమోదు చేస్తే రెడ్‌మార్క్ వచ్చి వివరం నమోదు కాదు. అనేక రీచ్‌లలో ఆన్‌లైన్‌లో నిత్యం రెడ్‌మార్క్ వస్తూనే ఉంది. ప్రతిచోటా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పెత్తనం చేస్తున్నారు.

 పెనమలూరు నియోజకవర్గంలోని పెద  పులిపాక ఇసుక క్వారీలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు హవా సాగిస్తున్నారు.



ఇక్కడ కూడా అక్రమ తరలింపు జరుగుతోంది.



ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక క్వారీలో నిబంధనలు పాటించడం లేదు. పలువురు చీకటి వ్యాపారులు పగటి పూట కాకుండా రాత్రి పూట క్వారీయింగ్ చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఈ కారణంగా గత నెలలో చల్లపల్లిలో ఇసుక ట్రక్ కింద పడి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినా వారి దందా ఆగలేదు.  జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్వారీలు 11 ఉన్నాయి. అనుమతులు లేకుండా కృష్ణా తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు.



అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రోజుకు సుమారు రూ.11కోట్లపైనే ఇసుక వ్యాపారం చేస్తోంది. అధికారికంగా 11 ఇసుక క్వారీలు ఉన్నాయి. రాత్రుల్లో అనధికారికంగా జరిగే ఇసుక దందా మరో రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎక్కడక్కడ స్థానికులతో కలిసి అధికార పార్టీ నేతలు దందాకు పాల్పడుతున్నారు. జిల్లాలో రోజుకు రూ.15 కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలుతోంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top