ఇసుక లారీ ఓనర్ల సమ్మె విరమణ

ఇసుక లారీ ఓనర్ల  సమ్మె విరమణ


అధికారులతో ఫలించిన చర్చలు

ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్న జేసీ

త్వరలో మరో ఐదు రీచ్‌లు


 

విజయవాడ :  ఇసుక కిరాయిలకు మీ-సేవలతో లింకు పెట్టడాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న కృష్ణా, గుంటూరు జిల్లాల లారీ యజమానులు శుక్రవారం సాయంత్రం విరమించారు. ఈ నెల 29 వరకు లారీ కిరాయిలు స్వయంగా వసూలు చేసుకోవచ్చని జిల్లా అధికారులు సూచించడంతో సమ్మె విరమించినట్లు వారు చెప్పారు. మీ-సేవలతో సంబంధం లేకుండా లారీ కిరాయిలు తామే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ఆందోళన చేపట్టామని ఈ సందర్భంగా వారు తెలిపారు. జిల్లా యంత్రాంగం మరో దఫా చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పిందని లారీ యజమానులు వివరించారు.



ఇసుక కొరత లేకుండా చర్యలు : జేసీ



ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి అన్నారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఇసుక రవాణా, లారీ యజమానుల సమ్మెపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐదు రీచ్‌ల ద్వారా 14.16 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ను గుర్తించినట్లు చెప్పారు. త్వరలో మరో ఐదు రీచ్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటు వినియోగదారులు, అటు లారీ యజమానులు నష్టపోకుండా వాస్తవ ధరలకు ఇసుక అమ్మకాలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,300 మంది వినియోగదారులు ఇసుక కోసం మీ-సేవల్లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. లారీ డ్రైవర్లు ఆధార్ నంబర్లు నమోదు చేయించుకోవాలనే నిబంధనను సడలించినట్లు జేసీ తెలిపారు. లారీ యజమానుల సమ్మె గురించి ప్రస్తావిస్తూ మొదట వచ్చిన వారికి మొదట ఇసుక సరఫరాా చేసే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఈ నెల 29 వరకు వినియోగదారునికి స్వయంగా లారీ కిరాయి మాట్లాడుకుని మీ-సేవలో ఇచ్చిన రసీదుల ప్రకారం ఇసుకను తీసుకువెళ్లే సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు. తిరిగి 29న జిల్లా యంత్రాంగం సమావేశమై లారీ యజమానులు కోరుతున్న విధంగా 10 కి లోమీటర్లకు కిరాయి రూ.1,500 విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. లారీ యజమానులు సమ్మెను విరమించి మూడు రోజులుగా నిలిచిపోయిన ఇసుకను వెంటనే వినియోగదారులకు సరఫరా చేయాలని కోరారు. విజయవాడ సిటీ పోలీసు కమీషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక మాఫియా లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించడం నేరమన్నారు. ఇసుక తరలించే విధానంలో రిజిస్ట్రేషన్ నంబరు, ఏ ప్రదేశానికి తీసుకువెళుతున్నారో స్పష్టంగా వేబిల్లులో తెలియజేయాలని చెప్పారు.



నేటి నుంచి రెండు షిఫ్టులు



జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ శనివారం నుంచి జిల్లాలోని ఇసుక రీచ్‌లు రెండు షిఫ్టులలో పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీటీసీ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి జి.నాగరాజు, ఏసీపీలు మల్లేశ్వరరాజు, రాఘవరావు, ఆర్టీవో సుబ్బారావు, మైనింగ్ ఏడీ రామచంద్రరావు, ఇసుక లారీ యజమానుల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top