ఇసుక దందాకు ధరల ఆజ్యం


శ్రీకాకుళం పాతబస్టాండ్, పొందూరు,ఆమదాలవలస రూరల్, బూర్జ: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేశామని ఆధికారుల చెబుతున్నా ఎక్కడా ఆ జాడలు కనిపించడం లేదు. ఇసుక క్వారీల లీజులు లేనప్పుడు రహస్యంగా జరిగిన దందా.. ఇప్పుడు బహిరంగంగా సాగుతోంది. ఇసుకకు అత్యధిక ధర నిర్ణయించడం, రీచ్‌ల నిర్వహణ భాద్యతను మహిళా సంఘాలకు అప్పజెప్పినా తెరవెనుక అధికార పార్టీ నేతలు ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో ఇసుక అక్రమాలకు అధికార ముద్ర

 

 పడినట్లయ్యింది. అక్రమ రవాణా నిరోధానికి నిఘా బృందాలను వేసినా, వాటిని కొన్ని కేంద్రాలకే పరిమితం చేయడంతో నిఘా లేని మార్గాల్లో, చీకటి దారుల్లో ఆత్యం సులభంగా ఇసుక తరలిపోతోంది. ఒకే రసీదుపై పలుసార్లు ఇసుకను రవాణా చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రీచుల్లో తమకు 20 శాతం వరకు ఇసుకను అనధికారికంగా తీసుకుపోయే అవకాశం కల్పించాలని కమిటీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు మహిళా సంఘాలపై ఒత్తిడి తెస్తున్నారు. రీచుల్లో అక్రమాల నివారణకు సీసీ కెమెరాలు పెడతామని ప్రభుత్వం చెప్పినా అదీ ఆచరణలోకి రాలేదు. మరోవైపు  రాత్రి వేళల్లో జరిగే రవాణాను మహిళ సంఘాలు నియంత్రించలేకపోతున్నాయి.

 

 13 రీచులకు అనుమతి

 జిల్లాలో ఆధికారికంగా 18 రీచ్‌లను లీజుకు ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటివరకు 13 రీచుల కు అనుమతులు మంజూరు చేశారు. పది మండలాల పరిధిలో ఉన్న ఈ రీచులను 27గ్రామైక్య సంఘాల ద్వారా 716 స్వయంశక్తి సంఘాలకు అప్పజెప్పారు.  ఈ రీచ్‌లలో  11,48,220 కూబిక్ మీటర్ల ఇసుక అం దుబాటులో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.  

 

 ఆధిక ధరల ఆజ్యం ఇసుక అక్రమాలకు అధిక ధర ఆజ్యం పోస్తోంది. క్యూబిక్ మీటరుకు రూ.675 ధరను అధికారులు నిర్ణయించడంతో కొనుగోలుదారులు, నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో అనధికారికంగా ఇసుక తరలింపు పెరుగుతోంది. చాలామంది అధికార రీచ్‌లతోపాటు, మిగతా నదీ తీరప్రాంతాల నుంచి దొంగచాటుగా తరలించుకుపోతున్నారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా వే బిల్లులతో జిల్లాలోని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడంతో అక్రమ రవాణా సులభతరమవుతోంది.

 

 పెరుగుతున్న ఉద్యమాలు

 ఇసుక ధరపై సామాన్యులు, భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తగ్గించాలన్న డిమాండ్‌తో ఉద్యమాలు పెరుగుతున్నాయి. క్యూబిక్ మీటరు ధర రూ.200 కంటే తక్కువగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ భవన  నిర్మాణ  కార్మికులు, ఇంజనీర్లు, ప్రజా సంఘాలవారు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు కూడా అదే బాట పట్టారు. ఇటీవల భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పట్టణంలోని వైఎస్‌ఆర్ కూడలిలో దీక్షలు చేపట్టారు. నాగావళి నదిలో కార్మికులు, బండ్ల కార్మికులు, నిర్మాణ కార్మికులు ఇసుక సత్యాగ్రహ ం చేపట్టారు.

 

 

 ఇవీ అక్రమాల జాడలు

  ఆమదాలవలస మండలంలోని జీకేవలస, నిమ్మతొర్లాడ, పాతూరు, కొత్తవలస, ఇసకలపేట, ముద్దాడపేట, కలివరం, తొగరాం, దూసి, బెలమాం, నెల్లిమెట్ట గ్రామాలు నదీ తీరంలోనే ఉన్నా ఇసుక రీచ్‌లు పొందలేకపోతున్నాయి. మండలంలో సుమారు 560 డ్వాక్రా గ్రూపులు ఉండగా, వాటిలో సుమారు 200 గ్రూపులు ఈ గ్రామాల్లోనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఈ మండలానికి ఇసుక రీచ్ కేటాయించకపోవడంతో ఆదాయం కోల్పోతున్నామని ఈ సంఘాల సభ్యులు వాపోతున్నారు.  బూర్జ మండలంలో అల్లెన, కాఖండ్యాం గ్రామాల వద్ద ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాఖండ్యాంలో టీడీపీకి చెందిన వారికే రీచ్ కేటాయించడం వివాదంగా మారింది. దీని ప్రారంభానికి ప్రభుత్వ విప్ వచ్చినప్పుడు స్థానికులు అడ్డుకోవడంతో రగడ జరిగిన విషయం తెలిసిందే. అయినా అధికార  టీడీపీ నేతలు ఈ రీచ్‌ను బలవంతంగా ప్రారంభింపజేశారు. అల్లెన రీచ్‌కు ఇంకా అనుమతి రావాల్సి ఉంది.

 

  పొందూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గోకర్ణపల్లి, తాడివలస, బొడ్డేపల్లి, సింగూరు, గండ్రేడు తీరప్రాంతాలు ఇసుక తవ్వకాలకు అనువుగా ఉన్నా.. రీచ్‌ల నిర్వహణకు అనుమతులు లేవు. దీంతో రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుకను అనధికారికంగా తరలించుకుపోతున్నారు. ప్రధాన రహదారులపైనే పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉంచుతున్నారు.  తమకు అనుకూలంగా లేనిచోట్ల టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి ఇసుక రీచ్‌లను రద్దు చేయించేందుకు కుట్ర పన్నుతున్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దసవళాపురం ర్యాంపు విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే పురుషోత్తపురం, యరగాం ర్యాంపుల ను తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top