ఇసుక మేటల్లో ..కాసుల వేట


సాక్షి ప్రతినిధి, గుంటూరు : చెరువుల్లోని మట్టి, రీచ్‌ల్లోని ఇసుక అమ్మకాలతో సంతృప్తి చెందని టీడీపీ నేతలు, కార్యకర్తలు నదీ పరివాహక భూముల తవ్వకాలకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతకాలం క్రితం నదిలో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిలిపివేయగా, తిరిగి వాటికి అనుమతులు  ఇవ్వాలని కోరుతున్నారు.  తెనాలి నియోజకవర్గ పరిధిలోని నదీ పరివాహక భూముల్లో ఇసుక తవ్వకాల కోసం దాదాపు 20 మంది టీడీపీ నేతలు రైతులతో దరఖాస్తు చేయించారు. దీనికి సంతృప్తి చెందిన జిల్లా అధికార యంత్రాంగం అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం.

 

 ప్రకాశం బ్యారేజీ దిగువన తెనాలి, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని నదీపరివాహక ప్రాంతాల్లో అనేక ఇసుక రీచ్‌లు  కొనసాగాయి. ముఖ్యంగా దుగ్గిరాల మండలం పెదకొండూరు, గొడవర్రు. కొల్లిపర మండలం కొల్లిపర, బొమ్మువానిపాలెం, అన్నవరం. కొల్లూరు మండలంలోని చిలుమూరు, ఈపూరు. భట్టిప్రోలు మండలంలోని ఓలేరు తదితర చోట్ల ఇసుక రీచ్‌లు కొనసాగాయి. గత ఏడాది జూలైలో కొల్లిపర మండలంలోని ముగ్గురు రైతులు తమ పొలాల్లో మేట వేసిన ఇసుకను తొలగిస్తే సాగుకు అవకాశం ఏర్పడుతుందంటూ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. 40 రోజుల తరువాత ఇసుక రవాణాలో జరుగుతున్న అక్రమాలపై అప్పటి జిల్లా ఎస్‌పీ పీహెచ్‌డీ రామకృష్ణ దృష్టి పెట్టడంతో తవ్వకాలను నిలిపివేశారు. కొల్లిపరకు చెందిన మరో ఇద్దరు రైతులు ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందినా తవ్వుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ ఐదుగురు రైతులు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు.

 

 వీరితోపాటు మరో పదిహేను మంది టీడీపీ నేతలు రైతుల పేరున నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు.ఇటీవల  కురిసిన వ ర్షాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వరద నీటితోపాటు ఇసుక కొట్టుకు వచ్చి మేటలు వేసింది. నిర్మాణ పనులకు అనువుగా ఉన్న ఈ ఇసుకను అమ్ముకుని కోట్లు గడించేందుకు ఈ భూములు కలిగిన రైతుల పేరున టీడీపీ నేతలు దరఖాస్తు చేయించారు.

 

  దరఖాస్తుల పరిశీలన, సర్వే కార్యక్రమాలు మండల స్థాయిలో పూర్తయి జిల్లా యంత్రాం గం వద్దకు చేరుకున్నాయి. చివరగా ప్రభుత్వం వద్దకు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో పెదకూరపాడు, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలోని నదీపరివాహక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిని డ్వాక్రా గ్రూపులు నిర్వహిస్తుండటంతోపాటు ఇసుక తవ్వకాలు, అమ్మకాలు డీఆర్‌డీఏ, డ్వామాల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణలో రీచ్‌లు కొనసాగుతుండటంతో అనుకున్న స్థాయిలో ఆదాయం లభించడం లేదు. దీంతో బ్యారేజీ దిగువ భా గంలోని ఇసుక రీచ్‌లు, నదీ పరివాహక భూముల్లో ఇసుక తవ్వకాలకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top