అన్ని వ్యాధులకు...

అన్ని వ్యాధులకు...


మచిలీపట్నం : సర్కారు వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. కడుపునొప్పి, కాలునొప్పి, జ్వరం వచ్చి ప్రభుత్వాసుపత్రికి వెళితే అక్కడ వైద్యులు, సిబ్బంది ఉండరు. ఒక వేళ ఉన్నా అన్ని వ్యాధులకు ఒకే రకం మందులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల( పీహెచ్‌సీ)లో సురక్షిత ప్రసవాలు జరుపుతారని పాలకులు చెబుతున్నా శిథిలావస్థకు చేరిన ఆపరేషన్‌ థియేటర్లు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయి.



ఐదు నెలల కిందట జిల్లావ్యాప్తంగా 20కు పైగా నూతన పీహెచ్‌సీలను ప్రారంభించారు. వీటికి నిధులు విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదు. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు పోస్టు పోర్టబుల్‌ (పీపీ) యూనిట్లు, 620 ఉప కేంద్రాలు, 24 గంటల పాటు పనిచేసే ఆసుపత్రులు 28 ఉన్నట్లు లెక్కలు చెబుతున్నా రోగులకు సకాలంలో వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ‘సాక్షి’ బృందం సోమవారం పీహెచ్‌సీలను పరిశీలించింది. వివరాలు ఇలా ఉన్నాయి.



► మచిలీపట్నం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణలో శుభ్రత లోపించింది. శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆసుపత్రిలో సివిల్‌ సర్జన్‌ పోస్టులు –7, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ పోస్టులు–4, డెప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టు–1, స్టాఫ్‌నర్సు పోస్టులు–9 ఖాళీగా ఉన్నాయి. మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని రూ. 12 కోట్లతో నిర్మించినా ప్రారంభానికి నోచుకోలేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగకపోవటంతో నిధులు ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి.

► అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు లో 24గంటల ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రి పగటిపూట మాత్రమే పనిచేస్తోంది. డాక్టర్‌ ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేరు. వేకనూరు పీహెచ్‌సీని ఇటీవల ప్రారంభించారు. మందులు, ఫర్నిచర్‌ కొరత ఉంది. పులిగడ్డ పీహెచ్‌సీలో ఫర్నిచర్‌ కొరత వేధిస్తోంది. ఘం టసాల పీహెచ్‌సీలో ఒక డాక్టరే ఉండ గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పెదకళ్లేపల్లి పీహెచ్‌సీని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది.

► కంకిపాడు పీహెచ్‌సీలో మత్తు డాక్టర్‌ లేరు. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఆసుపత్రి ఆవరణ చెత్త, చెదారాలతో నిండి ఉంది. ఉప్పులూరు పీహెచ్‌సీకి నిధులు విడుదల కావటం లేదు. ఈ ఆసుపత్రి సిబ్బంది ప్రతి అవసరానికి కంకిపాడు పీహెచ్‌సీపై ఆధారపడాల్సి వస్తోంది.

► మైలవరం నియోజకవర్గంలోని మైలవరం, రెడ్డిగూడెం పీహెచ్‌సీలలో గైనకాలజిస్టులు లేరు. జి.కొండూరు పీహెచ్‌సీకి సాధారణ రోగులు వెళితే విజయవాడకు రిఫర్‌ చేస్తున్నారు. ఇక్కడ డాక్టర్‌ కొరత ఉంది.

► తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం పీహెచ్‌సీలో డాక్టర్‌ లేరు. పుష్కరాల సమయంలో మాతా, శిశువులను వారి గృహాలకు తీసుకువెళ్లే వాహనాన్ని విజయవాడకు తీసుకువెళ్లారు. ఇంకా తిరిగి రాలేదు. పీహెచ్‌సీ భవనం శి«థిలావస్థకు చేరింది. తిరువూరులోని రాజగూడెం పీహెచ్‌సీని నూతనంగా నిర్మించినా నిధులు విడుదల కావటం లేదు.

► జగ్గయ్యపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టు, మత్తు డాక్టర్, ఎక్స్‌రే టెక్నిషియన్, దంత వైద్యుడు లేరు. నూజివీడు గొల్లపల్లి పీహెచ్‌సీలో వైద్యులు లేరు. సిబ్బంది కొరత వేధిస్తోంది.

► గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు పీహెచ్‌సీలో ఫ్లోరింగ్‌ దెబ్బతింది. తలుపులు, దర్వాజాలు పాడైపోయాయి. రూ.12లక్షల వ్యయంతో మరమ్మతులు చేస్తామని చెప్పటమే త ప్ప పనులు ప్రారంభం కావటం లేదు.

► కైకలూరు పీహెచ్‌సీలో నలుగురు డాక్టర్లకు ఇద్దరే పనిచేస్తున్నారు. ల్యాబ్‌ టెక్నిషియన్, సిబ్బంది కొరత ఉంది. నందిగామ నియోజకవర్గంలోని పీహెచ్‌సీలలో సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top