సమైక్య ఉప్పెన


* మూడు వారాలుగా హోరెత్తుతున్న పోరు

* కొనసాగుతున్న సకలం బంద్

* రోజురోజుకీ బలపడుతున్న నినాదం... సమైక్యాంధ్రప్రదేశ్

 

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న దరిమిలా ఎగసిన సమైక్య ఉద్యమం మూడువారాలైనా సడలని దీక్షతో ముందుకు సాగుతోంది. అన్నివర్గాల జన భాగస్వామ్యంతో రోజురోజుకూ బలపడుతూ పతాకస్థాయికి చేరుతోంది. సకలం బంద్‌తో జీవనం స్తంభిస్తున్నా జనం లెక్కచేయక సమైక్యమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు. మంగళవారం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఎటు చూసినా ఉద్యమవాతావరణమే కనిపించింది.

 

ఎక్కడికక్కడ రోడ్ల దిగ్బంధం

ఏపీఎన్జీవోల పిలుపు మేరకు సమైక్యవాదులు మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో రోడ్లను దిగ్బంధం చేశారు.  ముఖ్యంగా జాతీయరహదారులపై గంటల తరబడి ందోళనలు చేపడ్డటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడలో రామవరప్పాడు, గొల్లపూడి, కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ వద్ద  రోడ్లను దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జగ్గయ్యపేటలో అనుమంచిపల్లి గ్రామ సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగ, ఎన్జీవో, ఉపాధ్యాయసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, తేలప్రోలులో జాతీయ రహదారిపై కబడ్డీ ఆడారు. మైలవరంలో మానవహారం ఏర్పాటు చేశారు.

 

ఎడ్ల బళ్లతో ప్రదర్శన

ఉయ్యూరులో రైతులు కేసీపీ కర్మాగారం నుంచి వీరమ్మ తల్లి ఆలయం వరకు 200 ఎడ్లబళ్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రధాన సెంటర్లో బళ్లతో మానవహారంగా ఏర్పడి రహదారులను దిగ్బంధించడంతో రాకపోకలు స్తంభించాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో 300 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం నుంచి విశాఖ, పాలకొండ, సాలూరు వెళ్లే  జాతీయ రహదారులను దిగ్బంధించి, వంటా- వార్పు  చేపట్టారు.

 

వికలాంగుల రాస్తారోకో

విశాఖపట్నం శ్రీహరిపురంలో వికలాంగులు రాస్తారోకో చేపట్టారు. జి.మాడుగుల మండలం వై.బి.గొండూరు ప్రధానోపాధ్యాయుడు వరహాలరాజు సమైక్యాంధ్ర మద్దతుగా స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తగరపువలస గోస్తనీ నదిలో వైఎస్సార్ సీపీ నేత విజయనిర్మల వరినాట్లు నాటుతూ నిరసన తెలిపారు.

 

అర్చకుల దీక్షలు

సింహాచలం దేవాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గురు అర్చకులు, ఆరుగురు ఉద్యోగులు రిలేదీక్షలు ప్రారంభించారు. జీవీఎంసీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు.

 

కోర్టుకు తాళాలు

విశాఖజిల్లా కోర్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోర్టుకు తాళాలు వేసి జీవీ ఎంసీ కార్యాలయం జంక్షన్‌వరకు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు,ఎన్‌జీఓలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు రాస్తారోకోలు,వంటావార్పు, మానవహారాలతో నిరసనలను హోరెత్తించారు. ఎన్‌జీఓసంఘం బుజబుజ నెల్లూరు జాతీయ రహదారిని దిగ్బంధించింది.

 

జాతీయ రహదారిపై జన గోదావరి

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జేఏసీ, కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయరహదారి దిగ్బంధంలో వేలాదిమంది సమైక్యవాదులు పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన సమైక్యవాదులు రావులపాలెం చేరుకునిహైవేపై ఆందోళన చేపట్టారు.  కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని ఇంటిగ్రేడెట్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం కార్యాలయం బంద్ పాటించకపోవడంతో సమైక్యవాదులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

 

121 శివాలాయల్లో ఏకకాలంలో రుద్రాభిషేకాలు

సమైక్యాంధ్రను కాంక్షిస్తూ బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో కోనసీమలో 121 శివాలయాల్లో రుద్రాభిషేకాలు ఏకకాలంలో నిర్వహించారు. సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను చాటుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం జగ్గంపేట నియోజకవర్గంలో  కొనసాగింది.

 

వాహనాలను తుడిచి న్యాయవాదుల నిరసన

సమ్మెలోభాగంగా విధులను బహిష్కరించిన న్యాయవాదులు ఏలూరులో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను చేతిరుమాళ్లతో తుడిచి నిరసన తెలిపారు. ఏలూరు నగరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో వేలాదిమంది విద్యార్థులు రోడ్లపైకొచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. ఆదోనిలో రహదారుల దిగ్బంధం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదురు రోడ్డుపై వంటా-వార్పు, గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆర్టీసీ కార్మికులు దున్నపోతుల ప్రదర్శన నిర్వహించారు.

 

అనంతలో పోలీస్‌స్టేషన్ ముట్టడి

బైండోవర్లు, అక్రమ అరెస్టులను నిరసిస్తూ భారీసంఖ్యలో న్యాయవాదులు, విద్యార్థులు అనంతపురంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించి, ధర్నా చేశారు. ఎస్కేయూలో విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉరవకొండలో స్వర్ణకారులు రోడ్డుపైనే పని చేసి.. నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో 10 వేల మంది విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించారు. రాజంపేటలో 300 ట్రాక్టర్లతో యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగు ర్యాలీలో వంగపండు ఉష పాల్గొని ఆటపాటలతో అలరించారు.

 

విద్యార్థుల సింహగర్జన

తిరుపతిలో శాప్స్ ఆధ్వర్యంలో 15 వేల మంది విద్యార్థులతో సమైక్యాంధ్ర సింహగర్జన నిర్వహించారు. గజల్ శ్రీనివాస్ పాల్గొని ఉద్యమ పాటలతో జనాన్ని ఉత్తేజపరచారు. ఏపీపీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. పీలేరులో 10వేల మంది విద్యార్థులతో భారీర్యాలీ నిర్వహించారు. మదనపల్లెలో చెవిటి, మూగ, వికలాంగులు గుండు గీయించుకుని నిరసన తెలియజేశారు.



‘విభజన’ మనస్తాపంతో 9 మంది మృతి

 న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్ర విభజనపై ఆందోళనతో మంగళవారం మరో తొమ్మిది మంది తనువు చాలించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో  గంగుల నాగ వెంకట కృష్ణ (48),  భీమడోలులోని కౌలురైతు సుతాని వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్న (55), ఉంగుటూరు మండలం గోపాలపురం శివారు పందిరెడ్డిగూడెంకు చెందిన కూలీ రాజాని అచ్చియ్య (55), కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి గ్రామానికి చెందిన వెంకట్రాముడు (48), తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన మెడబల రామారావు (50), పి. గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు పెచ్చెట్టి సూర్యారావు (63), అంబాజీపేట మండలం మొసళ్లపల్లికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు బొక్కా రామకృష్ణ (43),  అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంటలో నరసయ్య (60), ఎగువతూపల్లిలో మద్దిపోగులు గంగన్న(58)లు గుండెపోటుతో మృతి చెందారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top