జీతమో రామచంద్ర..!


 పాలకొల్లు అర్బన్ : ఇచ్చేదే చాలీచాలని జీతం. అది కూడా ఏడాది కాలంగా చెల్లించడం లేదు. ఇక ఉద్యోగులు ఏం తిని బతకాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల జీతాలను ప్రభుత్వం లక్షల్లో పెంచింది. పాపం ఎమ్మెల్యేలు ఎంత కష్టంలో ఉంటే ప్రభుత్వం ఆ పని చేస్తుంది! అలాగే తమపై కూడా కాసింత కనికరం చూపాలని జిల్లాలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. తమ జీతాలను బకాయిలతో సహా చెల్లించి పస్తులతో అల్లాడిపోతున్న తమ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకొంటున్నారు.

 

 జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ఏడాది కాలం నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వసతి గృహాల్లో రెగ్యులర్‌గా పనిచేసే ఉద్యోగులు పదవీ వివరమణ చేయడంతో ప్రభుత్వం ఆ ఖాళీలను అవుట్ సోర్సింగ్‌లో నియామకం చేసింది. గత 10, 12 ఏళ్ల నుంచి  నైట్‌వాచర్, అటెండర్, వంటమనిషి, హెల్పర్‌గా అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడాది కాలంగా జీతాలు చెల్లించకపోవడంతో అప్పుల అప్పారావులుగా కాలం గడుపుతున్నారు. వీరిని ప్రయివేట్ ఏజన్సీ ద్వారా నియామకం చేశారు.

 

 జిల్లాలోని 287 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 97 మంది అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు.  ఏజెన్సీ వీరి నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి తాత్కాలిక ఉద్యోగులుగా నియమించింది. ప్రభుత్వం వీరికి రూ.6,700 చొప్పున ఏజెన్సీకి చెల్లిస్తుంటే, అందులో నుంచి రూ.1000 మినహాయించుకుని కేవలం రూ.5,700లు మాత్రమే ఉద్యోగులకు ఏజెన్సీ చెల్లిస్తోంది. జిల్లా మొత్తం మీద ఒక్కొక్కరికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చెల్లించాల్సి ఉంది.  ఉన్నత చదువులు చదువుకుని ఖాళీగా ఉండలేక ప్రభుత్వ వసతి గృహాలు కాబట్టి ఎప్పటికైనా తమ కొలువులు పర్మినెంట్ చేస్తారనే ఆశతో పనిచేస్తున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

  పుష్కర కాలం నుంచి పనిచేస్తున్న వీరికి జీతాలు పెంపుదల లేక, ఇచ్చే కొద్దిపాటి జీతం సక్రమంగా చెల్లించకపోవడంతో నరకయాతన పడుతున్నామంటున్నారు. పోనీ ఈ ఉద్యోగం మానేద్దామంటే సర్వీసు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కిరాణా, పాలు తదితర ఖర్చులకు అప్పులు చేసుకుని జీవిస్తున్నామంటున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, లేదా నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆశలు కల్పిం చారన్నారు. రాష్ట్రం మొత్తం మీద అవుట్‌సోర్సింగ్, టెండర్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఉద్యోగులంతా ఆయన మాటలు నమ్మి  ఓట్లు వేసి మోసపోయామని వాపోతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top