నిర్లక్ష్యానికి మూల్యం


కర్నూలు(జిల్లా పరిషత్ ): కర్నూలు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల జీతాలను కమిషనర్ పీవీవీఎస్ మూర్తి నిలిపివేశారు. రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధుల పట్ల అలసత్వం, అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోవడం, అనుమతి లేని నిర్మాణాలను అరికట్టలేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగులపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు.



దీనికితోడు ఇటీవల కార్పొరేషన్‌లో విలీమైన మామిదాలపాడు, మునగాలపాడు, స్టాంటన్‌పురం గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డుల విభజన, ఇళ్ల సర్వేలను నిర్ణీత సమయంలో చేపట్టకపోవడం కూడా కారణం చూపుతూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై గత మే నెలలోనే ఉద్యోగులకు మెమో జారీ చేసినా స్పందించకపోవడంతో జీతాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సిబ్బంది తక్కువ.. పని ఎక్కువగా ఉండటంతోనే పనులు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



టౌన్ ప్లానింగ్ విభాగంలో సిటిప్లానర్, అసిస్టెంట్ సిటిప్లానర్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. గుంతకల్లు టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న షబ్నం శాస్త్రి రెండు ప్రాంతాల్లో మూడు రోజుల చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. మూడు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ పోస్టులకు గాను ఒక్కరు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. ఐదుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు గాను నలుగురు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నలుగురూ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ఇన్‌చార్జ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా కార్పొరేషన్‌లో సర్వేయర్ పోస్టు సైతం ఖాళీగా ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టారు.



దీంతో భవనాలకు అనుమతులు పొందాలంటే ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అనుమతి ఇవ్వకపోతే ఆలస్యానికి బాధ్యత వహిస్తూ సంబంధిత ఉద్యోగులు జరిమానా చెల్లించాల్సి ఉంటోంది. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు అధికంగా కార్యాలయానికే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు లేకపోవడం వల్ల అక్రమ నిర్మాణాల ఫైళ్లు నత్తనడకన నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు నిలిపివేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



 ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తిని వివరణ కోరగా.. రెండు నెలలుగా ఉద్యోగుల జీతాలు నిలిపివేసిన విషయం వాస్తవమేనన్నారు. విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శించకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పెండింగ్ ఫైళ్లన్నీ క్లియర్ కాగానే జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top