ఆనందంగా దుర్గమ్మ దర్శనం

ఆనందంగా దుర్గమ్మ దర్శనం


సీహెచ్ నర్సింగరావు

ఈవో, దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం

 

ఇంద్రకీలాద్రిపై ఒకవైపు మహిళలు మెట్ల పూజలు చేస్తున్నారు. మరోవైపు అమ్మవారికి సమర్పించేందుకు భక్తులు పూజా సామగ్రి కొనుగోలు చేస్తుండటంతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. ఇంకోవైపు దేవస్థాన ఆవరణ అంతా పెళ్లి బృందాలతో కోలా హలంగా ఉంది. నూతన వధూవరులు, వారి బంధువుల హడావుడితోపాటు మేళతాళాలతో కొండపై పెళ్లికళ ఉట్టిపడుతోంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇటువంటి తరుణంలో దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. తొలుత ఆలయంలోకి వెళ్లి కనకదుర్గమ్మకు పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు, అర్చకుల ఆశీర్వాదం అందుకుని నేరుగా భక్తుల వద్దకు వెళ్లారు. ‘నా పేరు నర్సింగరావు. నేను దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిని..’ అంటూ పరిచయం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులు పూజాసామగ్రి సమర్పించే చెట్టు వద్ద నుంచి మొదలై చీరల కౌంటర్, అన్నదాన భవనంతోపాటు ఆలయ ప్రాంగణమంతా కలియతిరిగారు. పేరు, ఊరి పేరు చెప్పి దర్శనం ఎలా అయ్యిందో వివరించాలని కోరారు. భక్తుల సమస్యలు తెలుసుకున్న ఆయన అందరికీ ఆనందంగా అమ్మవారి దర్శనం అయ్యేలా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు.

 

ఈవో : అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారా?

 

ప్రసాద్, సురేఖ : నిన్ననే మాకు పెళ్లి జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని పసుపు బట్టలతో  వచ్చాం. అమ్మ దర్శనం బాగా అయ్యింది.



ఈవో : నూరేళ్లు పిల్లాపాపలతో సుఖంగా ఉండండి.

ఈవో : అమ్మవారి దర్శనం ఎలా అయ్యిందమ్మా.. క్యూలైన్‌లో ఏమైనా ఇబ్బందులున్నాయా?



దేవర లక్ష్మి : సార్.. పెళ్లి ముహూర్తాలతో కాస్త రద్దీ ఎక్కువగా ఉంది. అయినా అమ్మవారి దర్శనం బాగా అయ్యింది. క్యూలైన్‌లో లోపాలేమీ లేవు.



ఈవో : అమ్మవారి చీరలను కొంటున్నారా (దేవస్థాన కౌంటర్ వద్ద).. ఏ ఊరమ్మా?

 

పల్లివెల పద్మ : మాది రాజమండ్రి దగ్గర కడియపు లంక సార్.. అమ్మవారికి సమర్పించిన చీరలను కొనాలనుకుంటున్నాం.



ఈవో : చీరల కౌంటర్ వద్ద ధరల బోర్డు ఎందుకు పెట్టలేదు. వెంటనే షాపు ముందు ఏర్పాటు చేయండి.



కౌంటర్‌లో వర్కర్ : పక్కన ఉంది సార్



ఈవో : దేవస్థానంలో మహిళలతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించారా?

 

కనకరత్నం : మాది హైదరాబాద్ సార్. అందరూ భక్తిభావనతోనే ఉన్నారు. క్యూలైన్లు బాగానే నడుస్తున్నాయి.

 

ఈవో : అన్నప్రసాదం ఎలా ఉందమ్మా?


 

అరుణ, జ్యోతి, భారతి : మాది విజయవాడ సార్. అన్నం చాలా బాగుంది. మంచిగా వడ్డిస్తున్నారు. అడిగినంత పెడుతున్నారు. చాలా బాగుంది సార్.



ఈవో : మీరు చెప్పండి అన్నప్రసాదం ఎలా ఉంది?



శంకర్రావు : మేం విజయనగరం నుంచి వచ్చాం. భోజనం చాలా బాగుంది. కూరలు, మజ్జిగ బాగున్నాయి. ప్రశాంతంగా తింటున్నాం.

 

ఈవో : అన్నదానంలో మార్పులేమైనా చేయాల్సిందని భావిస్తున్నారా?

 

సిరివాడ పద్మ (తేలప్రోలు) : సిబ్బంది అందరూ శాంతంగానే వడ్డిస్తున్నారు. అమ్మవారి ప్రసాదం చాలా బాగుంది. మార్పులేమీ అవసరం లేదు. ఇలాగే పెడితే చాలు.

 

ఈవో : అమ్మా మీరు ఎక్కడ నుంచి వచ్చారు. దేవస్థానంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

 

శ్రీదేవి, ఆదిలక్ష్మి : మేం శ్రీకాకుళం జిల్లా రాబందు గ్రామం నుంచి వచ్చాం. ఏటా దసరా ఉత్సవాలకు వస్తాం. మళ్లీ ఇలా మధ్యలో వస్తుంటాం. ఆలయంలో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి.

 

ఈవో : కొబ్బరికాయలు కొట్టేచోట ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?



వీరాంజనేయులు (వడ్లమూడి, తాడేపల్లి మండలం) : కొబ్బరికాయలు కొట్టేచోట ఆరుగురు యువకులు అడ్డుగా నిల్చుంటున్నారు. దీనివల్ల మహిళలకు కొంత ఇబ్బందికరంగా ఉంది. అప్పుడప్పుడు వారు రూ.10 అడుగుతున్నారు.



ఈవో : కొండపైకి రావడానికి ఏమైనా ఇబ్బందులున్నాయా?



కె.అరుణ (విజయవాడ): ట్రాఫిక్ కారణంగా కొండపైకి రావడానికి రెండు గంటలు పడుతోంది. దేవస్థానం నడుపుతున్న బస్సులను పెంచాలి. టోల్‌గేటు వద్ద డివైడర్ ఏర్పాటుతో మరింత ఆలస్యమవుతోంది.



ఈవో : రోజుకు ఎంతమందికి అన్నదానం చేస్తారు.. ఏర్పాట్లపై ఏవిధంగా ప్లాన్ చేస్తున్నారు?



హేమదుర్గాంబ (అన్నదానం విభాగం సీనియర్ అసిస్టెంట్) : సార్.. రోజూ ఐదు వేల మందికి అన్నదానం చేస్తాం. కనీసం 4,500 మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. శుక్రవారం, ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆయా రోజుల్లో 5,500 మందికి ఏర్పాట్లు చేస్తాం. భోజనం మెనూ ముందురోజే సిద్ధం చేస్తాం. రోజూ ఒకే కూర కాకుండా మార్పులు చేస్తుంటాం. భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అన్నప్రసాదాన్ని అందించడంలో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటున్నాను.

 (ప్రసాదాల విక్రయ కౌంటర్ వద్ద..)

 

ఈవో : పూజాసామగ్రి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారా?



వీర్రాజు (జగ్గంపేట) : పది రూపాయలకు కొబ్బరికాయ అమ్ముతున్నారు. అమ్మవారి దర్శనం బాగా అయింది.



ఈవో : అమ్మవారి ప్రసాదం ఎలా ఉంది?

 

శ్యామల, సీత : మాది విజయవాడే.. వారం వారం అమ్మవారి దర్శనానికి వస్తుంటాం. దర్శనం అయిన తర్వాత అన్నదానంలో అమ్మవారి ప్రసాదం తీసుకుంటాం. మిగిలిన దేవాలయాలన్నింటి కంటే ఇక్కడ ప్రసాదం చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ మధ్య రుచి కూడా బాగుంది.

 

ఈవో : మీకేమైనా ఇబ్బందులున్నాయా.. దేవస్థాన సిబ్బంది నుంచి సమస్యలు ఎదురవుతున్నాయా?



రమాదేవి, అరుణ (ఓపీడీఎస్ మహిళా సెక్యూరిటీ గార్డులు) : ఎప్పటి నుంచో ఇక్కడే పనిచేస్తున్నాం. ఒకేసారి 30 మందిని తొలగించారని అధికారులు చెబుతున్నారు. మా కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. దయ ఉంచి మాకు న్యాయం చేయండి.

 

ఈవో : వంద మంది ప్రైవేట్ సిబ్బందిని తీసుకునేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి మాకు అనుమతి ఉంది. ఈ మేరకు 70 మంది పురుషులతో పాటు 30 మంది మహిళలను తీసుకుంటాం. తప్పకుండా మీకు న్యాయం చేస్తా.

 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top