అంబరాన్నంటిన ‘సాక్షి’ ఎరీనా వన్‌

అంబరాన్నంటిన ‘సాక్షి’ ఎరీనా వన్‌ - Sakshi


ఉత్సాహంగా సాగిన అవార్డుల ప్రదానోత్సవం



విజయవాడ స్పోర్ట్స్‌: స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు.. సాంస్కృతిక కార్యక్రమాల హోరుతో ‘సాక్షి’ ఎరీనా వన్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాలలో నిర్వహించిన ‘సాక్షి’ ఎరీనా వన్‌(స్కూల్, యూత్‌) గ్రాండ్‌ ఫినాలే వైభవంగా జరిగింది. స్కూల్‌ ఫెస్ట్‌ విభాగానికి విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్, యూత్‌ ఫెస్ట్‌ విభాగానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఓఎస్‌డీ ప్రత్తిపాటి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు (ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ) రీజియన్లలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు పతకాలతో పాటు ‘సాక్షి’ ఎరీనా వన్‌ ఫెస్ట్‌ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రావీణ్యం సాధించాలని సూచించారు.



ప్రతిభను వెలికితీయడంలో ‘సాక్షి’ది విశేష కృషి..

శాప్‌ ఓఎస్‌డీ ప్రత్తిపాటి రామకృష్ణ మాట్లాడుతూ.. మరుగునపడిపోయిన క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో ‘సాక్షి’ విశేషంగా కృషి చేస్తోందని కొనియాడారు.  ‘సాక్షి’ మీడియా నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడిసిన్‌ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం మంచిపరిణామమన్నారు. సాక్షి కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ రాణిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు ‘సాక్షి’ ఎరీనా ఉత్తమ వేదికని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత ప్రమాణాలతో నడిచే పాఠశాలు, కళాశాలల వివరాలతో సాక్షి మీడియా తీసుకొచ్చిన కాఫీ టేబుల్‌ బుక్‌ను సీపీ గౌతమ్‌ సవాంగ్, ఆంధ్రా హాస్పిటల్స్‌ అధినేత రమణ మూర్తి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ ముత్తవరపు మురళీకృష్ణ, ఎఫ్ట్రానిక్స్‌ ఎండీ రామకృష్ణ, ట్రిట్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(రాజమండ్రి) ప్రిన్సిపాల్‌ బాల త్రిపుర సుందరి, ఇంటర్నేషనల్‌ వెయిట్‌లిఫ్టర్, నేషనల్‌ గేమ్స్‌ సిల్వర్‌ మెడలిస్టు కె.శిరోమణి, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్‌ తదితరులు ఆవిష్కరించారు. టీవీ జర్నలిస్టు స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘సాక్షి’ పత్రిక మఫిసిల్‌ ఎడిటర్‌ రాఘవరెడ్డి పాల్గొన్నారు.



సాక్షి ఎరీనా విజేతలు వీరే..

సాక్షి ఎరీనా వన్‌ స్కూల్, యూత్‌ఫెస్ట్‌ క్రికెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టేబుల్‌ టెన్నిస్, కబడ్డీ, క్యారమ్స్, చెస్‌ పోటీలతో పాటు డ్యాన్స్, హ్యాండ్‌ రైటింగ్‌ పోటీలు నిర్వహించారు. జూనియర్‌ రాష్ట్రస్థాయి క్రికెట్‌లో విశాఖపట్నం చైతన్య పాలిటెక్నిక్‌ కళాశాల జట్టు విన్నర్‌గా, తిరుపతి ఎస్‌.వి.జూనియర్‌ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. సీనియర్‌ విభాగంలో విన్నర్‌గా కంచికచర్ల మిక్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, రన్నరప్‌గా విశాఖపట్నం చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు నిలిచాయి. వాలీబాల్‌ ఉత్తరాంధ్రలో శ్రీ సూర్య జూనియర్‌ కళాశాల, విశాఖపట్నం విన్నర్‌గా, విశాఖపట్నం ప్రభుత్వ ఐటీఐ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచాయి. సోలో డ్యాన్స్‌లో విన్నర్‌గా ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల నరసారావుపేట విద్యార్థి గణేష్‌ నాయక్, రన్నరప్‌గా సీహెచ్‌ తేజస్వీ (నలంద డిగ్రీ కళాశాల), తృతీయ స్థానాన్ని డి.గణేష్‌ (టీజేపీఎస్‌ కళాశాల, గుంటూరు) పొందారు. కబడ్డీ యూత్‌ విభాగం కోస్తాంధ్ర సీనియర్స్‌లో విన్నర్‌గా ఆంధ్ర లయోల కళాశాల విజయవాడ, రన్నరప్‌గా మంగళగిరి వీటీజేఎస్‌ కళాశాల నిలిచాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top