పాపం పసివాడు

పాపం పసివాడు


సాక్షి ప్రతినిధి, కరీంనగర్: డాక్టర్ నిర్లక్ష్యం ఏడు నెలల పసిపాడి ప్రాణం మీదకొచ్చింది. బాలుడికి వచ్చిన జబ్బేమిటో నిర్దారించకుండానే చేసిన చికిత్స వికటించడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. చూస్తుండగానే తమ బిడ్డ ఉలుకూ పలుకూ లేకుండా కనుగుడ్లు తేలయడంతో లబోదిబోమన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడి వైద్య బృందం అత్యవసర చికిత్స చేసి ఆ బాలుడిని ప్రాణపాయం నుంచి తప్పించడంతో ఊపిరిపీల్చుకున్నారు.



జలుబు చేసిందని బాబును ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొస్తే అక్కడి వైద్యుల నిరక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం మూలంగా రూ.1.43 లక్షలు ఖర్చు చేయాల్సి రావడంతో తీవ్ర మానసికి ఆందోళనలకు గురయ్యామని వాపోయారు.  బాధితుడి తల్లిదండ్రులు కారంగుల రజిత, విజయ్‌కుమార్ తాత మల్లేశం వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే...



 10 నిమిషాల్లో మూడు ఇంజక్షన్లు...

 ‘‘మాది కరీంనగర్ వావిలాలపల్లి. ఏడు నెలల మా బాబు త్రినాథ్‌కు జలుబు, జ్వరం వచ్చింది. ఇటీవల కరీంనగర్‌లోని ఆదిత్య పిల్లల ఆసుపత్రికి వెళ్లాం. డాక్టర్ బి.నారాయణకు బాబును చూపిస్తే కడుపులో నంజు (కఫం) ఉందని చెబుతూ ఆస్పత్రిలో చేర్చుకున్నాడు. ఏ పరీక్షలు చేయలేదు. 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా మూడు ఇంజెక్షన్లు (ఎక్స్-వన్ 250 ఎంజీ సింగిల్‌డోస్, మిక్‌డిన్ సింగిల్ డోస్, క్లావమ్ సింగిల్‌డోస్) ఇచ్చిండు. ఇంజక్షన్లు ఇచ్చిన 5 నిమిషాల్లోనే బాబు శరీరం నల్లబడింది.



ఒంటిపై దద్దులు(ర్యాషెస్) వచ్చినయ్. ఒక్కసారిగా ఉలుకు పలుకు లేకుండా గుడ్ల తేలేసిండు. భయపడి డాక్టర్ వద్దకు వెళితే దగ్గర్లోని స్థానిక స్టార్ పిల్లల హాస్పిటల్‌కు వెళ్లమని చెప్పిండు. అక్కడికి వెళితే బాబు పరిస్థితి బాగోలేదని చెబుతూ ప్రతిమ హాస్పిటల్‌కు పంపించిండ్రు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు హాస్పిటల్‌లో చేర్చుకొని వైద్యం అందించినప్పటికీ నాలుగు రోజులపాటు బాబు  ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదు.



మేం భయపడి హైదరాబాద్ తీసుకెళతామని చెప్పడంతో బాబు కండీషన్ రిస్క్‌గా ఉందని మాతో సంతకం చేయించుకుని పంపించిండ్రు. అక్కడినుంచి బయటపడి హెదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌కు తీసుకువెళ్లినం. అక్కడి డాక్టర్లు ఐసీయూలో ఉంచి పరీక్షలు చేసి చికిత్స అందించిండ్రు. కొద్దిసేపటికే బాబు కళ్లు తెరిచిండు. మాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. బాబుకు తక్కువ వ్యవధితో మోతాదుకు మించిన ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే రియాక్షన్ ఏర్పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని అక్కడి డాక్టర్లు శివనారాయణ్‌రెడ్డి, ప్రీతమ్ చెప్పిండ్రు’’ అని పేర్కొన్నారు.

 

 డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

 - కె.మల్లేశం, శిశువు తాత, కరీంనగర్

 మా మనువడు పుట్టినప్పుటి నుంచి ఆదిత్య హాస్పిటల్‌లోనే వైద్యం చేయిస్తున్నాం. ఆ నమ్మక ంతోనే వెళితే డాక్టర్ నిర్లక్ష్యంగా వైద్యం చేశాడు. ఎక్కువ ఇంజక్షన్లు ఇచ్చి బాబు ప్రాణాల మీదకు తెచ్చిండు. ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికి శరీరంపై ఇంకా దద్దులు పోనేలేదు. బాబుకు వైద్యం కోసం రూ.1.43లక్షలు ఖర్చు చేసినం. డాక్టర్ నారాయణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు మాకు జరిగిన నష్టాన్ని చెల్లించాలి.

 

 ఏటీఎంలా వాడుకుంటున్నారు

 - తెలంగాణ వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ రోగికి ఏం చికిత్స చేస్తున్నారో తెలుసుకునే హక్కు రోగితోపాటు వారి బంధువులకూ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ హక్కును చాలా మంది డాక్టర్లు కాలరాస్తున్నారు. రోగిని డబ్బులు పిండుకునే ఏటీఎం యంత్రంలా వాడుకుంటున్నారు. ఇకనైనా డాక్టర్ల వైఖరిలో మార్పు రావాలి. రోగిని, వారు కుటుంబ సభ్యులను మనుషులుగా చూడాలి.

 

 మా తప్పేమీలేదు

 - డాక్టర్ బి.నారాయణ

 త్రినాథ్‌కు చికిత్స విషయంలో మా తప్పేమీ లేదు. బాబు మా ఆసుపత్రికి వచ్చేటప్పుడు జలుబు, దగ్గుతో బాధపడుతున్నా డు. నంజు(కఫం) ఎక్కువగా ఉందని ట్రీట్‌మెంట్ చేశాం. మేం ఇంజెక్షన్లు ఇచ్చిన రెండు గంటల తరువాత రాషెష్ వచ్చా యే తప్ప వెంటనే వచ్చాయనడం సరికాదు. వైరల్ ఫీవర్ లేదా బ్లడ్ కాంపోజిషన్‌లో తేడావల్ల కూడా దద్దుర్లు రావొచ్చు. దీనికితోడు ఆ బాబుకు లోలోపల ఉన్న వ్యాధి తీవ్రత ఏమిటో తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించే సౌలభ్యం మా వద్ద లేదు. అందుకే వేరే ఆసుపత్రికి రెఫర్ చేశాను.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top