ఓ శాడిస్ట్ భర్త వికృత చేష్టలు

ఓ శాడిస్ట్ భర్త వికృత చేష్టలు - Sakshi


నీలి చిత్రాలు చూపిస్తూ భార్యపై వికృత చేష్టలు

పోలీసులను ఆశ్రయించిన మహిళ

కేసు నమోదు చేసి గాలికొదిలేసిన పోలీసులు


 

అనంతపురం క్రైం : సభ్య సమాజం తలదించుకునేలా భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది బాధితురాలు. భర్త, ఇతర కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని వాపోతోంది. బాధితురాలు చివరకు తన గోడు విలేకరుల ఎదుట వెళ్లబోసుకుంది. ఆమె కథనం మేరకు, ఉరవకొండ పట్టణానికి చెందిన యువతికి యాడికికి చెందిన ఉడుముల సంజీవుల కుమారుడు ఉడుముల చిరంజీవితో గతేడాది ఫిబ్రవరిలో వివాహం చేశారు.



చిరంజీవి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వివాహం అయినప్పటి నుంచి భర్త, బంధువులు మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె వాపోయింది. ముఖ్యంగా భర్త శాడిస్టులా తయారయ్యాడు. రోజూ నీలిచిత్రాలను చూపించి, తనపై వికృత చేష్టలకు పాల్పడేవాడని చెప్పింది. పడకగదిలోని దాంపత్య ముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి తన స్నేహితులకు చూపించే వాడని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు తాను స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి బెదిరించేవాడని చెప్పింది. భర్త ఇంట్లో లేనప్పుడు మామ ఉడుముల సంజీవులు తనపై అసభ్యంగా ప్రవర్తించాడని, ఈ విషయం భర్తకు చెబితే తననే కొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది.



ఈ క్రమంలో తాను గర్భం దాల్చడంతో, వెంటనే గర్భం తీయించుకోవాలంటూ భర్త, అత్తమామలు బలవంతంగా కొట్టి గర్భస్రావం కల్గించే మాత్రలు మింగించారని వాపోయింది. ఈ బాధలు భరించలేక పుట్టింటికి వచ్చేసినట్లు చెప్పింది. తనను రాచి రంపాన పెట్టిన భర్త, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉరవకొండ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు 155/2014 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 313, 498 (ఏ), 3అండ్4 ఆఫ్ డీపీ యాక్ట్, ఆర్/డబ్ల్యూ 341 పీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికి ఎనిమిది నెలలవుతోంది.



నిందితుల్లో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని చెప్పింది. ఈ విషయంలో ఎస్‌ఐ మొదలుకుని సీఐ, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, చివరకు వారం కిందట  జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిశారు. ఎస్పీ  సంబంధిత స్టేషన్ అధికారులను మందలించారు. రెండ్రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా, ప్రజా సంఘాల నాయకులు తమకు అండగా నిలవాలని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.



ఉరవకొండ సీఐ సూర్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను కొత్తగా వచ్చానని, అయితే ఈ కేసుకు సంబంధించి భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని చూశామని రాజీకాకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top