సదరం..‘పరీక్ష'

సదరం..‘పరీక్ష'


కర్నూలు(హాస్పిటల్): వికలత్వ ధ్రువీకరణ పత్రం పొందాలంటే చుక్కలు చూడాల్సిందే. డివిజన్ పరిధిలోని ప్రాంతాల నుంచి తరలివచ్చే వృద్ధులు.. వికలాంగులు.. మానసిక వికలాంగులు ఎంతో ఆశతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నా.. ఇక్కడ వారి ‘ఓపి’కను పరీక్షిస్తున్నారు. కనీస సదుపాయాలు లేకపోవడం.. అరొకర సిబ్బంది.. దళారుల కారణంగా ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆసుపత్రిలోని 41వ నెంబర్ ఓపీని సదరం క్యాంపు నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వందలాదిగా తరలివచ్చిన వికలాంగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రత్యేక కౌంటర్లు లేకపోవడం.. గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఎండ తీవ్రత కారణంగా వారి అవస్థలు వర్ణనాతీతం. కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేక దాహంతో అలమటించారు. కంప్యూటర్ ఆపరేటర్ల కొరతతో వందల సంఖ్యలో తరలివచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసుకోవడం.. కంప్యూటర్‌లో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాంపు వద్దే పడిగాపులు కాయాల్సి రావడంతో బాత్‌రూం, మరుగుదొడ్ల సమస్యతో అల్లాడిపోయారు.



ఓపీ వద్ద దళారులను నమ్మి మోసపోవద్దనే పోస్టర్లు అతికించినా.. వీరి పాత్రే కీలకంగా ఉంటోంది. మీకు వికలత్వ శాతం తక్కువగా ఉంది.. పింఛన్‌కు అనర్హులవుతారు.. రూ.800 ఇస్తే వికలత్వ శాతం ఎక్కువ వచ్చేలా చూస్తామంటూ నమ్మబలుకుతున్నారు. మరికొందరు సంఘాల పేరిట 20 నుంచి 30 దరఖాస్తులతో కార్యాలయంలోకి వచ్చి తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు కూడా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుకు రూ.500 చొప్పున వసూలు చేస్తుండటం గమనార్హం. పింఛన్ పొందాలంటే సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడం.. ఇక్కడ చూస్తే పరిస్థితి గందరగోళంగా ఉండటం వికలాంగులను కలచివేస్తోంది.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top