రూ.725 కోట్లు


సాక్షి ప్రతినిధి, కడప: ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ ఓవైపు రుణమాఫీ అమలుకాకపోగా మరో వైపు ఉన్న అప్పు సకాలంలో చెల్లించని కారణంగా రైతన్నలు అదనపు భారం భరించాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే అప్పులన్నీ మటుమాయం అవుతాయని భావించిన అన్నదాతలకు మరోభారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా రూ.725 కోట్ల అదనపు భారం భరించాల్సిన పరిస్థితి తలెత్తింది.  

 

 నన్ను నమ్మండి.. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటా.. బడుగులకు ఆసరాగా నిలుస్తా.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రైతుల రుణాలను మాఫీ చేస్తూ తొలిసంతకం చేస్తా... తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి .. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతి బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్న మాటలు ఇవి.

 

 ఆయన హామీలను నమ్మిన ప్రజానీకం రాష్ట్రంలో టీడీపీకి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ అవుతాయని రైతన్నలు ఆశించారు. అయితే వారి ఆశలను నీరుగార్చుతున్నారు. రుణమాఫీ విధివిధానాలపై కమిషన్ వేశారు. ఎలాగైనా రైతు రుణాలను మాఫీ చేస్తామంటూ ఊరడించారు. ప్రతి రైతుకు రూ.1.5లక్షల రుణం రద్దు చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకోవడం మినహా ఇప్పటికీ బ్యాంకులకు రుణమాఫీ విధివిధానాలపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోవడంతో రైతన్నలపై రూ.725 కోట్ల అదనపు భారం పడనుంది.

 

 ఏడాది దాటితే...రూ.13.5శాతం వడ్డీ...

 జిల్లాలో 2013-14 వరకూ రైతులకు సంబంధించి రూ. 5308.3 కోట్ల పంట రుణాలు ఉన్నాయి. 5,68,500 మంది రైతులు బ్యాంకుల్లో బకాయి ఉన్నారు. వీరంతా గత ఏడాది జూలై 31లోపు రుణాలు పొందారు. జూలై 31లోపు రుణం పొందిన రైతులకు ఇన్సూరెన్సు వర్తిస్తుందనే కారణంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఏడాది లోపు రుణం చెల్లిస్తే 3శాతం నాబార్డు (ఆర్బీఐ), 4శాతం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. రైతన్నలు ఏడాది లోపు రుణాలు రెన్యువల్ చేసుకుంటే వారికి వడ్డీలేని రుణం దక్కేది.



రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో రైతులు రుణాలను రెన్యువల్ చేయించుకోలేదు. ఎలాగైనా రుణాలు రద్దవుతాయనే ఆలోచనలో ఉండిపోయారు. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోపు రుణాలు చెల్లించకపోతే రూ.13.5 శాతం వడ్డీ భరించాల్సి ఉంది.



జూలై 31లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ వర్తించి ఉంటే ఎలాంటి సమస్య తలెత్తేదికాదు. ఇప్పటికే ఏడాది పూర్తి అయిన నేపధ్యంలో జిల్లాలోని 5.68 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.5308 కోట్లకు గాను రూ.716.58 కోట్ల అదనపు భారం భరించాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే ఇన్‌స్పెక్షన్ ఛార్జీలు రూపేణ బ్యాంకు రుణం ఉన్న ప్రతిరైతు రూ.150 భరించాల్సి ఉంది. ఈకారణంగా రూ. 8.52 కోట్లను రైతులు భరించాల్సిన పరిస్థితి నెలకొందని బ్యాంకింగ్ నిపుణులు వివరిస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాలో పంట రుణాలు పొందిన రైతులు రూ.725 కోట్ల అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు.

 

 బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం.....

 రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల హామీలుగా  తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతోనే బ్యాంకులు జవసత్వాలు కోల్పోయాయి. ఎలాగైనా రుణాలు మాఫీ అవుతాయని రుణ గ్రహీతలు అప్పులు చెల్లించడం నిలిపివేశారు. అధికారం చేట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తారని భావించిన బ్యాంకర్లకు సైతం నిరాశే ఎదురైంది. సీజన్‌లో  రైతుల అవసరార్థం  కొత్తగా రుణాలు ఇవ్వలేక, రుణ రికవరీ లేక మనుగడ సైతం కష్టసాధ్యంగా మారిందని పలువురు బ్యాంకర్లు వాపోతున్నారు.

 

 ముందే కటాఫ్ తేదీ ప్రకటించి రుణాలు చెల్లించిన వారికి సైతం రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించి ఉంటే బ్యాంకుల మనుగ డైనా ఉండేదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అలాగే రైతన్నలకు సైతం అదనపు వడ్డీ పడే అవకాశం ఉండేది కాదని వివరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి అటు బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే, రైతన్నలను తీవ్రమైన గందరగోళంలోకి నెట్టేశారని ఆరోపిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top