రుణమాఫీకి షరతులొద్దు

రుణమాఫీకి షరతులొద్దు


కర్నూలు(న్యూసిటీ):

 రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతల రుణాలను ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.షడ్రక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. ముఖ్యమంత్రి అయ్యాక కాలయాపన చేస్తూ మోసగించడం తగదన్నారు. కౌలు రైతులకు, రైతు మిత్ర గ్రూపులకు, ఉద్యాన పంటలకు.. గొర్రెలు, చేపల పెంపకందారులకూ రుణమాఫీని వర్తింపజేయాలన్నారు. రైతులకు వెంటనే బ్యాంకుల్లో కొత్త రుణాలు ఇప్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నరసింహులు, ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి నాగన్న, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి చక్రవర్తి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మాధవ స్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రఘురామమూర్తి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి నాగేశ్వరమ్మ, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top