తుంగభద్రను తోడేస్తున్న తమ్ముళ్లు

తుంగభద్రను తోడేస్తున్న తమ్ముళ్లు - Sakshi


దర్జాగా అధికార పార్టీనేతల ఇసుక దందా

నిషేధిత నిడ్జూరు ఇసుక రీచ్ నుంచి అక్రమ రవాణా

►  చర్యలకు వెనకాడుతున్న అధికారులు


 

కర్నూలు సిటీ: తుంగభద్ర నదిని అడ్డాగా చేసుకున్న అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ఇసుక దందా నడుపుతున్నారు. గతేడాది ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వం ఇసుక అమ్మకాలు చేపట్టింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ ఏడాది ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు ప్రకటించి ఎంపిక చేసిన రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో పూడూరు, ఆర్.కొంతలపాడుతో పాటు మరో మూడు చోట్ల మాత్రమే ఇసుక ఉచితంగా తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చారు. కానీ అధికార పార్టీ నేతలు అక్రమార్కులతో చేతులు కలిపి తుంగభద్ర నదిని తోడేస్తునానరు. అడ్డుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్నారు.



తుంగభద్ర, హంద్రీ, వేదావతి నదుల్లో నాలుగు రీచ్‌లకు మాత్రమే ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ తుంగాతీరంలోని జి.శింగవరం, నిడ్జూరు గ్రామాల తీరంలోని నది నుంచి ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయకూడదు. కానీ అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు కాసుల దాహంతో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతులు ఉన్న రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు చేయాల్సి ఉన్నా రీచ్‌లు దూరంగా ఉన్నాయనే సాకుతో నిడ్జూ రు రీచ్‌పై కన్నేశారు. దీంతో రేయింబవళ్లు తేడా లేకుండా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.



మునగాలపాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే మనుషులమని చెప్పి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. నదిలో నుంచి తీసిన 20 ట్రాక్టర్ల ఇసుకను ఎమ్మెల్యే సమీప బంధువు నందికొట్కూరు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. పూడూరు దగ్గర తవ్వుతున్న ఇసుకను ఓ వ్యక్తి తన లారీలతో తరలిస్తున్నాడు. ఇందుకు ఓ రెవెన్యూ అధికారి అతనికి అండగా ఉన్నట్లు   తెలుస్తోంది.



ఇటీవల కర్నూలు తహశీల్దారు కార్యాలయ అధికారులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్ చేస్తే అధికార పార్టీ నేత వాటిపై కేసు నమోదు చేయవద్దని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ట్రా క్టర్ల రాకపోకలపై తీవ్ర అవస్థలు పడుతున్నామని సమీప గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు.

 

 

 నిడ్జూరు రీచ్‌లో

 తవ్వకాలు నిషేధించాం

 తుంగభద్ర నదిలో రెండు రీచ్‌ల్లో మాత్రమే ఉచితంగా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చు. నిడ్జూరు రీచ్‌లో తవ్వకాలు నిషేధించాం. ఇక్కడి నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. తుంగభద్ర తీర ప్రాంతంలో రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేసి ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేస్తాం.   

 - రఘుబాబు, కర్నూలు రెవెన్యూ డివిజన్ అధికారి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top