వీధికెక్కిన జెడ్పీ పోరు


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని తాము దక్కించుకోవాలని అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు వంతపాడుతున్నారు. ఈ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఎవరికివారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  హైకోర్టు  తీర్పు రాగానే దీనిపై కలెక్టర్‌కు ఆదేశాలు రాకుండానే ఈదర హరిబాబు జెడ్పీకి వచ్చి చైర్మన్ సీట్లో కూర్చుంటున్న సంగతి తెలిసిందే.



అయితే ఈ అంశంపై డివిజన్ బెంచి ముందు విచారణ జరుగుతున్నందున, తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో నూకసాని బాలాజీయే చైర్మన్‌గా కొనసాగుతారని అధికారులు ప్రకటించారు. ఈ వివాదం కోర్టులో నడుస్తున్న సమయంలో ఈదర హరిబాబు ప్రస్తుతం తాను జెడ్పీ చైర్మన్‌గానే కొనసాగుతున్నానని చెప్పడంతో అధికారులు  చాంబర్‌కు తాళాలు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గురువారం జెడ్పీ చైర్మన్ చాంబర్‌కు తాళాలు వేసేశారు.



అధికారులు ఒక తాళం వేస్తే, ఈదర హరిబాబు మరో తాళం వేసేశారు. జిల్లా ప్రథమపౌరునిగా భావించే జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో  నిత్యం సాగుతున్న నాటకీయ పరిణామాలు చివరకు జెడ్పీ పరువును నడిరోడ్డుకు ఈడ్చాయి.  జరుగుతున్న పరిణామాలతో  జెడ్పీ పాలన కుంటుపడడమే కాకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఇబ్బంది పడుతున్నారు.



 రోజూలాగే జెడ్పీకి వచ్చిన హరిబాబుకు చైర్మన్ చాంబర్‌కు తాళం వేసి కనపడింది. తాళం తీయమని అటెండర్‌ను అడిగితే తాళం జెడ్పీ సీఈవో వద్ద ఉందని సమాధానం ఇచ్చాడు. జెడ్పీ సీఈవోకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయలేదు. దీంతో కావాలని తాళం వేసినట్లు అర్థం చేసుకున్న హరిబాబు దానికి నిరసనగా జెడ్పీ కార్యాలయం మెట్లపై బైఠాయించారు.  ఈదర హరిబాబు జెడ్పీ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు అధికారులు సమాచారం అందించారు. అయితే ఫిర్యాదు చేయడానికి సిద్ధం కాలేదు. దీంతో పోలీసులు జెడ్పీకి వచ్చినా ఎటువంటి చర్యలకు దిగకుండా కొద్దిసేపు వేచి చూసి వెళ్లిపోయారు.  



జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోతో పాటు కార్యాలయ పరిపాలనాధికారి కూడా జెడ్పీ కార్యాలయానికి రాలేదు. ఎవరు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. దీంతో వీరు అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకే వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి.



    ఇటీవల జరిగిన బదిలీల విషయంలో కూడా అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారింది. పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరన్న సందిగ్ధ పరిస్థితిని అడ్డం పెట్టుకుని అధికారులు బదిలీలు పూర్తి చేశారు. బదిలీల విషయంలో జిల్లా పరిషత్ చైర్మన్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో 979ని పక్కన పెట్టి పాత జీవోను చూపించి బదిలీలు పూర్తి చేశారు. జెడ్పీకి ఎన్నికైన పాలకవర్గం ఉన్నప్పటి కీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు సంబంధం లేకుండా రెవెన్యూ ప్రతినిధులతో కమిటీగా ఏర్పడి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి జెడ్పీ వ్యవస్థనే అవమానపరిచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top