అధికార మదం.. అమాయకులపై దౌర్జన్యం

అధికార మదం.. అమాయకులపై దౌర్జన్యం - Sakshi


ఊరు మొత్తాన్ని నేలమట్టం చేసే కుట్ర వైఎస్సార్‌సీపీయే లక్ష్యం

అన్న అండతో తమ్ముడి అరాచకం ఊహించలేకపోయామంటున్న పోలీసులు

నిందితులపై ఐదు కేసులు నమోదు 58 మంది అరెస్ట్, రిమాండ్

ఎస్‌ఐపై చర్యలుంటాయన్న ఏఎస్పీ ఇంకా భయం గుప్పెట్లోనే పాల్మన్‌పేట

 


‘కొట్టకండయ్యా అని కాళ్లా వేళ్లాపడ్డాం.. మీరెవరో, మేమెవరో, మీకూ.. మాకూ ఏమిటి శత్రుత్వం, ఎందుకిలా కొడుతున్నారు, ఇది మీకు న్యాయమా అని కన్నీరుమున్నీరై వేడుకున్నాం.. అయినా మా మాటలు వారి చెవికెక్కలేదు. మా అక్క చంటిబిడ్డ తల్లి.. ఆమెపైకి రాయి విసరారు. కొంచెముంటే బిడ్డ ఏమైపోయేదో.. మేం ఈ ఊరిలో ఎలా బతకాలి.’  -పిక్కి మేరీ, బాధితురాలు

 

‘మిమ్మల్ని చెరబట్టినా మీ మగాళ్లు అడ్డుకోవడానికి రారంటూ మా జుత్తు పట్టుకుని చావగొట్టారు. కొట్టొద్దని వేడుకున్నా వదల్లేదు. నానా దుర్భాషలాడారు. అసలు మనం ఎక్కడున్నామో అర్ధం కావడం లేదు. ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం అండగా నిలవడంతో భయమోస్తోంది.’      -కోడ మల్లిక, బాధితురాలు.

 

ప్రజలను బిడ్డల్లా చూసుకోవాల్సిన పాలకులే అధికార మదంతో రాక్షసులుగా మారితే ఎలా ఉంటుందో పాల్మన్‌పేట దారుణకాండ రుజువుచేసింది. తన అన్న రాష్ర్టంలో సీనియన్ నాయకుడిగా, మంత్రిగా ఉన్నాడనే ధైర్యంతో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచి వేసేందుకు కుట్రపన్నిన ఓ తమ్ముడు చేసిన అరాచకానికి పాల్మన్‌పేట నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. కూలిపోయిన ఇళ్లు, పగిలిపోయిన పరికరాలు, ధ్వంసమైన ద్విచక్రవాహనాలు మౌనంగా రోది స్తుంటే, మేమసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. అని దెబ్బలు తిన్న బాధితులు ప్రశ్నిస్తున్నారు.  - సాక్షి, విశాఖపట్నం

 


సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్న పాల్మన్‌పేటను పూర్తిగా నేల మట్టం చేయాలని టీడీపీ కుట్ర పన్నినట్లు కనిపిస్తోంది. ఊరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ గరికిన రమణల ఇళ్లు ప్రధానంగా టార్గెట్ చేశారు. వాటిపై దాడి చేసి ఇళ్లలోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు.   ఆ తర్వాత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వారి వాహనాలు, ఇళ్లు లక్ష్యం చేసుకున్నారు. దీనంతటికీ ముందుగానే పక్కా వ్యూహం రచించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఊరిపై దాడికి రాగానే ఎవరెవరు ఎవరిపై దాడిచేయాలనే స్పష్టతతోనే దాడులకు పాల్పడం వెనుక నిందుతులు ఓ ప్రణాళికతోనే దాడులకు వచ్చినట్లు రూఢీ అవుతోంది. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని ఆ ఊరిలో లేకుండా చేయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ దురాగతానికి టీడీపీ పాల్పడినట్లు బాధితుల మాటలను బట్టి అర్ధమవుతోంది. ఏకంగా 86 వాహనాలను నాశనం చేయడంతో పాటు ఇళ్లల్లోకి చొరబడి బీరువాల్లో ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. చివరికి బియ్యం బస్తాలు కూడా దొమ్మీ చేసేశారంటే ఈ దాడులు క్షణికావేశంలో చేసినవి కాదని,   పక్కా ప్రణాళికతో తెగబడినవని స్పష్టమవుతోంది.





అన్న అండతో తమ్ముడి అరాచకం

రాష్ర్ట మంత్రి యనమల రామకృష్ణుడి తమ్ముడు కృష్ణుడే ఈ అరాచకానికి ప్రధాన సూత్రధారని బాధితులు చెబుతున్నారు. నిజానికి ఈ నియోజకవర్గంతో అతనికి సంబంధం లేదు. కానీ తునిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలై ఆ అవమానాన్ని జీర్జించుకోలేకపోతున్నారు. సరిహద్దు నియోజకవర్గమైన పాయకరావుపేటలో, తన నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై కత్తి కట్టాడు. సమయం చిక్కితే చాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనికోసం కొందరు రౌడీమూకలను పెంచిపోషిస్తున్నారు. వారితో దురాగతాలు చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.



వీడని భయం..

పాల్మన్‌పేటపై టీడీపీ గూండాల దాడి తర్వాత ఆ గ్రామం పోలీసుల పహారా మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. అక్కడి ప్రజలు ఒంటరిగా ఇళ్లల్లో ఉండేందుకు కూడా భయపడుతూ అంతా కలిసి కట్టుగా గుంపులుగానే ఉంటున్నారు. ఏఎస్పీ ఐశ్యర్య రస్తోగితో పాటు స్పెషల్‌పార్టీ, ఆక్టోపస్, ఏఆర్, సివిల్ పోలీసులు దాదాపు 200 మంది 15 పికెటింగ్‌లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బాధితులు వణికిపోతున్నారు. ప్రతికార దాడి చేయడానికి తామకు క్షణం పట్టదని, కాని తాము టీడీపీ రౌడీల్లా వ్యహరించలేమని బాధితులు అంటున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఈ గ్రామం వదిలి పొట్ట చేతపట్టుకుని వసల పోతామంటున్నారు.    





లేడీ డాన్‌లా..

వందలాది మంది టీడీపీ రౌడీమూకలతో పాటు ఓ మహిళ కూడా ఈ దారుణకాండలో పాలుపంచుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. రాజయ్యపేట గ్రామానికి చెందిన టీడీపీ నేత, ల్యాండ్ లార్డ్ పిర్ల వెంకట్రావు కుమార్తె కళ్యాణి లేడీ డాన్‌లా తమపై దాడులు చేసిందని పిక్కి మేరీ అనే బాధిత యువతి తెలిపింది. స్థానిక జడ్పీ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న యాదాల అప్పలరాజు విద్యార్థులపైనా వివక్ష చూపిస్తున్నారని, ఆయన కూడా దాడుల్లో పాల్గొన్నాడని బాధితులు తెలిపారు.





బాధితులకు జగన్ భరోసా

బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యుడు చిక్కాల రామారావుతో జగన్ ఫోన్‌లో మాట్లాడారు. పాల్మన్‌పేటలో ప్రస్తుత పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. బాధితులకు పార్టీ తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన వెంటనే అందిస్తామని, వారికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని చెప్పారు.

 

 

 

 ఊహించలేకపోయాం..

 తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి దాడులకు పాల్పడతారని ముందుగా ఊహించలేకపోయాం. నాలుగు రోజుల ముందు నుంచి గొడవలు జరుగుతుండటంతో రెండు పికెటింగ్‌లు ఏర్పాటు చేశాం. ఇరు వర్గాలు ముందురోజు రాత్రి రాజీకి వచ్చాయి. కానీ తెల్లారేసరికి ఇలా పక్క జిల్లా నుంచి వచ్చి విరుచుకుపడ్డారు. దాదాపు 110 మందికి పైగా నిందితులు దాడుల్లో పాలుపంచుకున్నట్లు గుర్తించాం. వారిలో 58 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించాం. మిగతావారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం. ఈ దుర్ఘటనలో మా సిబ్బంది తమ పాత్ర సక్రమంగానే నిర్వర్తించారు. దానివల్లనే ఇద్దరు పోలీసులు తీవ్రంగా గామపడ్డారు. అయితే స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ తీరును బాధితులు తప్పుపడుతున్నారు. ఆయనపై విచారణ జరిపి భవిష్యత్‌లో మరెవరూ అలా ప్రవర్తించకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటాం.         - ఐశ్వర్య రస్తోగి, ఏఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top