ఏపీలో ఎక్కడి బస్సులు అక్కడే..

ఏపీలో ఎక్కడి బస్సులు అక్కడే..


హైదరాబాద్/విజయవాడ బ్యూరో: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఏపీలోని 13 జిల్లాల్లోని 9,640 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల అధికారులు అద్దె బస్సుల్ని నడిపించినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఎక్కువమంది ప్రయాణికులు ట్యాక్సీలు, ఆటోల్లోనే ప్రయాణించారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీకి సమ్మె ఆరంభమైన మొదటిరోజైన బుధవారం రూ.18 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కడప జోన్లలో హెవీ లెసైన్సులున్న వారిని డ్రైవర్లుగానూ, పదోతరగతి పాసైనవారిని కండక్టర్లుగా తీసుకుని కొన్ని రూట్లలో అద్దె బస్సుల్ని నడిపారు.


 


విశాఖ నగరంలో 270 హైర్ బస్సులను అధికారులు ఆపరేట్ చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. వందలాది బస్సులు నిలిచిపోవడంతో విశాఖ జిల్లా ఆర్టీసీ ఒక్కరోజులోనే రూ.70 లక్షల ఆదాయం కోల్పోయింది. విజయవాడ జోన్ పరిధిలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి రీజియన్లలో 3,050 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ మూడు జిల్లాల్లోనూ 576 అద్దె బస్సులుండగా బుధవారం అతికష్టం మీద 170 బస్సులను నడిపారు. ఉదయం 10 గంటల నుంచి గుంటూరు డిపోలో నిరసన ప్రారంభించిన కార్మికసంఘ నాయకులను మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.



నేటి నుంచి తిరుమలకు బస్సులు: ఆర్టీసీ సమ్మెతో వెంకన్న భక్తులు బుధవారం తీవ్ర అవస్థలు పడ్డారు. దూరప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకోగలిగినా తిరుమల బస్సులకోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. తిరుమల డిపోలో మొత్తం 110 బస్సులు ఉండగా సమ్మె కారణంగా బుధవారం 43 బస్సులే తిరిగాయి. సమ్మెతో భక్తులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. ఆయన వినతి మేరకు  తిరుమల, తిరుపతి మధ్య నిరంతరాయంగా తిరుమల డిపోకు చెందిన బస్సులను గురువారం నుంచి నడిపేందుకు యూనియన్ నాయకులు హామీఇచ్చారు.

 

ఎస్మా బెదిరింపులకు భయపడం  సమ్మెను ఉధృతం చేస్తాం: టీ ఆర్టీసీ కార్మిక జేఏసీ



ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న యాజమాన్యం బెదిరింపులకు భయపడబోమని తెలంగాణ ఆర్టీసీ కార్మిక యూనియన్ల జేఏసీ పేర్కొంది. బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు కె.పద్మాకర్, టీఎంయూ నాయకుడు అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ సూపర్‌వైజర్స్ యూనియన్ నాయకుడు కృష్ణమోహన్ మాట్లాడారు. సమ్మెకు తెలంగాణ రైల్వే ఉద్యోగుల సమాఖ్య మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్ర సీ నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు కె.శ్రీధర్ డిమాండ్ చేశారు.

 

ఆర్టీసీ మనుగడకే ప్రమాదం కార్మికులు విధుల్లో చేరాలి: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు




ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే సమ్మె విరమించాలని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికులను వేధించే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆర్టీసీ చరిత్రలో కార్మికులకు 24 శాతానికి మించి ఫిట్‌మెంట్ ఇచ్చిన దాఖలా లేదని.. తాను సాహసించి ఈసారి 27 శాతానికి స్థిరీకరించేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపే ప్రయత్నాలను కొన్నిచోట్ల కార్మికులు అడ్డుకుంటున్నారని.. దానిని సహించబోమని, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గురువారం నుంచి అద్దె బస్సులు తిరుగుతాయని భరోసా ఇచ్చారు. ఏపీలో ఎంసెట్ పరీక్ష జరిగే ఎనిమిదో తేదీన  అద్దె బస్సులన్నీ వారికి కేటాయిస్తామని తెలిపారు.

 

అవసరమైతే ఎస్మా : ఏపీ మంత్రి శిద్ధా




ఒంగోలు: ‘‘ఆర్టీసీ కార్మికులకు 27 శాతం ఫిట్‌మెంట్‌ను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. 43 శాతం కావాలంటూ యూనియన్లు పట్టుబడుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో సబ్‌కమిటీని వేసింది. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు సబ్ కమిటీని సంప్రదించకుండానే సమ్మెకు దిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతోపాటు అవసరమైతే సమ్మెకు దిగిన వారిపై ఎస్మాను ప్రయోగించేందుకు వెనుకాడం’’ అని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

 

 ప్రత్యామ్నాయాలు సిద్ధం ఏపీ మంత్రి రావెల



ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరువేల సర్వీసులకుగాను 600 సర్వీసులే నడపగలిగామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణాశాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, రైల్వేశాఖ అధికారులతో సమీక్ష జరిపామన్నారు. ప్రత్యేక రైళ్లు నడపడానికి, బోగీలు పెంచడానికి..  రైల్వేశాఖ అంగీకరించిందన్నారు.

 

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు  పరిష్కరించాలి : పొంగులేటి



ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌చేశారు. ఆర్టీసీ కార్మికులను చిన్నచూపు చూడడం తగదని, బస్సులు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. కాగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు బాబు బృందం కుట్ర పన్నుతోందని వైఎస్సార్ టీయూసీ ఏపీ అధ్యక్షుడు పి.గౌతమ్ రెడ్డి ఆరోపించారు.

 

 ప్రభుత్వ వైఖరి సరికాదు: తమ్మినేని




కార్మికులను కాపాడుకుంటామని, ఉద్యోగులను కళ్లలో పెట్టి చూసుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల నిర్భంద వైఖరితో వ్యవహరించడం దురదృష్టకరమని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగితే చర్చలకు పిలిచి పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం నిర్భందాన్ని ప్రయోగించడం సరికాదని బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

 

సీఎం జోక్యం చేసుకోవాలి: చాడ




ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జోక్యం చేసుకుని ఆర్టీసి ఉద్యోగులు, సిబ్బంది సమ్మెను విరమింపచేయాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తిచేశారు. బుధవారం ఈ మేరకు సీఎంకు ఆయన ఒక లేఖ రాస్తూ సమ్మె విచ్ఛిన్నానికి, తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం ప్రయత్నించడం కార్మిక వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. బస్సులపై ఆధారపడి న ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, సీఎం స్వయంగా జోక్యం చేసుకుని సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top