ఎక్కడి బస్సులు అక్కడే


కార్మికుల సమ్మెతో నిలిచిన ఆర్టీసీ బస్సులు

 జిల్లావ్యాప్తంగా 600కు పైగా బస్సులకు బ్రేకులు

 గ్యారేజీల ఎదుట కార్మికుల ఆందోళన

 ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపేందుకు చర్యలు

 వ్యతిరేకించిన కార్మికుల అరెస్ట్

 ఆర్టీసీకి రూ.40 లక్షల ఆదాయానికి గండి

 ప్రయాణికులను దోచుకున్న ప్రైవేటు ఆపరేటర్లు

 

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్‌తోపాటు నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తదితర ప్రధాన కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు బుధవారం ఉదయం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. తమకు 2013 ఏప్రిల్ నుంచి నూతన పీఆర్సీ వర్తింపచేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలనే డిమాండ్లతో కార్మికులంతా సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు కదల్లేరు.

 

 ప్రజా రవాణాకు దూరమైన 1.20 లక్షల మంది

 కార్మికుల సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల మంది ప్రయాణికులకు ప్రజా రవాణా సౌకర్యం దూరమైంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, భీమవరం, నరసాపురం, డిపోల నుంచి 612 బస్సులు 650 సర్వీసులుగా, 578 షెడ్యూళ్లలో తిరిగేవి. సుమారు 207 రూట్లలో 1.20 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేవి. తద్వారా ఆర్టీసీకి రోజుకి రూ.48 లక్షల ఆదాయం సమకూరేది. జిల్లాలోని 2,878 మందికార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడగా, ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మూసుకుపోయాయి. బుధవారం వేకువజామున 5 గంటల నుంచే డిపో గ్యారేజీలకు కార్మికులు, వివిధ యూనియన్ల నాయకులు చేరుకుని ఆందోళన చేపట్టారు.

 

 బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని డిపోల్లో ఇదే వాతావరణం కనిపిం చగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత ఏలూరు గ్యారేజీకి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సి ఉన్నందున కార్మికులు స్వచ్ఛందంగా ఆందోళనను విరమించి గ్యారేజీ నుంచి వెనుకకు వెళ్లాలని కోరారు. దీనికి యూనియన్ల నాయకులు ససేమిరా అనడంతో కొంత గడువు ఇచ్చిన అనంతరం ఆందోళనకారులను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అనంతరం కొంతమంది ప్రత్యామ్నాయ డ్రైవర్లు, కండక్టర్లతో ఏలూరు డిపో నుంచి 5 బస్సులను వివిధ ప్రాంతాలకు పంపించారు. కాగా, నరసాపురం డిపో నుంచి మరో 3 బస్సులను నడపగలిగారు. వీటితోపాటు ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యానికి అవకాశం కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 44 అద్దె బస్సులను నడిపారు. మిగిలిన సుమారు 600 పైగా బస్సులు నిలిచిపోయాయి.

 

 ‘ఎస్మా’ ప్రయోగిస్తామనడంపై ఆగ్రహం

 సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు వెంటనే విధులకు హాజరు కావాలని, లేనిపక్షంలో వారిపై ఎస్మా చట్టం (అత్యవసర సేవల నిర్వహణా చట్టం) ప్రయోగించి విధుల నుంచి తొలగిస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయాల్లో అధికారులు నోటీసులు పెట్టారు. దీనిపై కార్మికులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, కార్మికుల నిరవధిక సమ్మెకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చింతకాయల బాబూరావు మద్దతు ప్రకటించారు. ఆందోళనకు దిగిన కార్మికులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.

 

 ప్రైవేటు ఆపరేటర్ల ఇష్టారాజ్యం

 ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఆటోలు, ట్రక్ ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు, హైదరాబాద్ వెళ్లే టూరిస్ట్ బస్సుల యజమానులు అధిక చార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఇప్పటివరకూ ఆటో కనీస చార్జీ రూ.7 వసూలు చేస్తుండగా, బుధవారం ఈ ధరను అమాంతం రూ.12కు పెంచారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌కు రూ.400 నుంచి రూ. 700 చార్జీ వసూలు చేస్తుండగా బుధవారం రూ.1,200 వసూలు చేశారు. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తిరిగిన మ్యాక్సీ క్యాబ్‌లు, ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు సైతం చార్జీలను రెట్టింపు వసూలు చేశాయి.

 

 అరెస్ట్‌ల ద్వారా సమ్మె ఆగదు

 కార్మికులు వేతన సవరణ కోసం రెండేళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. శాంతియుతంగా సమ్మెకు దిగిన కార్మికులను అరెస్ట్ చేస్తే సమ్మె నిలిచిపోతుందనుకోవడం పొరపాటు. నిర్బంధాలు, 144 సెక్షన్లు, ఎస్మా చట్టాల ప్రయోగం ద్వారా సమ్మెలు ఆగిన దాఖలాలు చరిత్రలో లేవు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించి ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

 

 -  సీహెచ్ సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్

 కక్ష సాధింపు చర్యే

 ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోంది. తాత్కాలిక డ్రైవర్లకు ఇస్తామని ప్రకటించిన రూ.వెయ్యిలో రూ.500 ప్రస్తుత కార్మికులకు ఇస్తే ఫిట్‌మెంట్ బెనిఫిట్‌కు సరిపోతుంది. సమ్మెకు అనేక పరిష్కార మార్గాలు సూచించాం. చర్చలకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం.

 - నెక్కంటి సుబ్బారావు, గౌరవాధ్యక్షుడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top